దర్జాగా దోపిడీ..! | - | Sakshi
Sakshi News home page

దర్జాగా దోపిడీ..!

Mar 18 2026 11:13 AM | Updated on Mar 18 2026 11:13 AM

● ఆందోళనలో ప్రజలు ● అధికారుల పర్యవేక్షణ కరువు

రాయితీ పక్కదారి..

హోటళ్లలో రాయితీ సిలిండర్లు

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధంతో గ్యాస్‌ సరఫరాపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు సిలిండర్లు దొరకడం లేదంటూ జనం ఆందోళన చెందుతుంటే.. మరోవైపు దర్జాగా రాయితీ సిలిండర్లను వినియోగిస్తూ హోటళ్లను నడిపిస్తున్నారు. అధికారుల తనిఖీలో నిత్యం బయట పడుతున్నాయి. అధికారుల నిఘా పెడితే మరిన్ని సిలిండర్లు సైతం బయటపడే అవకాశముంది.

జగిత్యాల: ముందస్తు జాగ్రత్తగా ప్రజలు 2 రోజులుగా సిలిండర్ల కోసం విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్నారు. పెట్రోల్‌ బంకుల్లో సైతం పెట్రోల్‌ రావడం లేదని కొందరు పేర్కొనడంతో.. వాహనాల్లో ముందు జాగ్రత్తగా పెట్రోల్‌ నింపుకుంటున్నారు. ఇప్పటికే ఎల్‌పీజీ గ్యాస్‌ సరఫరాపై కేంద్ర ప్రభుత్వం సైతం ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ నేపథ్యంలో గృహావసరాలు, అత్యవసర సేవలకందించే ఆస్పత్రులకు ప్రాధాన్యమివ్వాలని సూచించింది. దీంతో సిలిండర్లు దొరకడం లేదనే పుకార్లు రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 2 రోజులుగా గ్యాస్‌ సిలిండర్ల కోసం టోల్‌ఫ్రీ నంబర్లు, గ్యాస్‌ సిలిండర్ల యాప్‌ల ద్వారా బుక్‌ చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బుక్‌ కాకపోవడంతో ప్రజలు సిలిండర్లు రావేమోనని భయాందోళనకు గురవుతున్నారు. సిలిండర్‌ షాపుల నిర్వాహకులు మాత్రం సరఫరా కొంత స్లోగా ఉందని, ఎలాంటి ఇబ్బందులు లేవని, సాధారణంగానే కొనసాగుతోందన్నారు. ప్రస్తుతం హాస్టళ్లు, కళాశాలలకు 19 కిలోల గ్యాస్‌ సరఫరా నిలిపేస్తున్నట్లు తెలిపారు. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం వల్లే ఈ పరిస్థితులు వచ్చినట్లు భావిస్తున్నారు.

రావేమోనని..

చిన్న, మధ్యతరగతి కుటుంబాలు సిలిండర్లు బుక్‌ కాకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఒక సిలిండర్‌ వీరికి 3 నెలలు వస్తుంటుంది. చాలామంది ఒకసారి బుక్‌ చేసుకున్న అనంతరం నెల, 2 నెలల తర్వాత బుక్‌ చేసుకుంటారు. కానీ ఈ మధ్య సర్వర్‌ స్లోగా ఉందో లేదో తెలియదు కానీ సిలిండర్లు రిఫిల్‌ బుకింగ్‌ మాత్రం కావడం లేదు. ఒకవైపు సోషల్‌ మీడియా, దిన పత్రికల్లో మాత్రం గ్యాస్‌ సరఫరాపై కేంద్ర ప్రభుత్వం సైతం ఆంక్షలు విధిస్తున్నట్లు రావడంతో.. ఎక్క డ బందవుతాయోనని ప్రజలు భయాందోళనలో ఉన్నారు. దాదాపు గ్రామీణ, పట్టణం అనే తేడా లేకుండా 99 శాతం సిలిండర్లే వాడుతుంటారు. ఈ నేపథ్యంలో ఒకవేళ బందయితే ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు నెలకొంటాయి. ఇప్పటికే మహా నగరాల్లో వాణిజ్య సిలిండర్లు రాకపోవడంతో హోటళ్లను సైతం మూసేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం గ్యాస్‌ సిలిండర్లు పక్కదారి పట్టకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలను సైతం ఆదేశించింది. ఈ విషయంలో అత్యవసర సేవల నిర్వహణ చట్టాన్ని ఎస్మా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నాయి.

ఒకవైపు యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో గ్యాస్‌ సరఫరా నిలిచిపోతుందనే భయాందోళనకు గురవుతుంటే.. రాయితీ సిలిండర్లు మాత్రం పక్కదారి పడుతున్నాయి. హోటళ్లలో చిన్నచిన్న సెంటర్లలో గృహావసరాలకు సంబంధించిన సబ్సిడీ సిలిండర్లను వినియోగిస్తున్నారు. జిల్లాలో ప్రతీ హోటల్‌, స్వీట్‌ హౌస్‌, రెస్టారెంట్లలో సబ్సిడీ సిలిండర్లు వాడుతున్నారు. అధికారులు సైతం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. తోపుడు బండ్లు, టీకొట్లు నిర్వాహకులు వీటినే వినియోగిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి సబ్సిడీ సిలిండర్లు పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement