
పోలీసులా.. కాంగ్రెస్ కార్యకర్తలా
● బాల్కొండ ఠాణాలో కాంగ్రెస్ ప్రెస్‌మీట్ ● కోరుట్లలో బీఆర్‌ఎస్ ప్రెస్‌మీట్‌ను అడ్డుకున్నారు ● ‘ఎక్స్’లో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ● విచారణ చేయాలని డీజీపీకి ఫిర్యాదు
కోరుట్ల: పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ‘ఎక్స్’ వేదికగా ఆరోపించారు. ఈ విషయమై డీజీపీకి ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. రైతుల శ్రేయస్సు కోసం యూరియా సమస్యపై మాట్లాడేందుకు బీఆర్‌ఎస్ నాయకులు కోరుట్ల మండలం అయిలాపూర్‌లో ఆదివారం విలేకరుల సమావేశం పెడితే పోలీసులు అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. యూరియా పంపిణీకి జింక్ కొనుగోళ్లకు ముడిపెట్టి రైతులను ఇబ్బంది పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. కనీసం బీఆర్‌ఎస్ నాయకులకు ప్రెస్‌మీట్ పెట్టుకునే స్వేచ్ఛ లేకుండా అడ్డుపడటం సిగ్గుచేటన్నారు. ఇదే కాంగ్రెస్ నాయకులు బాల్కొండ నియోజకవర్గంలో ఏకంగా పోలీస్‌స్టేషన్‌లోనే ప్రెస్‌మీట్ పెట్టడం.. దానికి పోలీసులే ఏర్పాట్లు చేయించడం విడ్డూరమన్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వివక్ష చూపుతున్న పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల తీరుగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఈ అరాచక కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న దౌర్జన్యాలను ప్రజలు గమనించాలని కోరారు. ఈ విషయంలో డీజీపి స్పందించి పోలీసు వ్యవస్థను కాపాడాలని కోరారు.