కాసుల కక్కుర్తి..! | - | Sakshi
Sakshi News home page

కాసుల కక్కుర్తి..!

Aug 4 2025 3:39 AM | Updated on Aug 4 2025 3:39 AM

కాసుల కక్కుర్తి..!

కాసుల కక్కుర్తి..!

● ఆర్టీఏ అధికారుల తీరు ● కనిపించిన వాహనం నుంచి చేతివాటం ● ఏడాపెడా వసూలు.. ఇవ్వకుంటేనే కేసులు

కోరుట్ల: జూన్‌ 19న.. ఇబ్రహీంపట్నం నుంచి కోరుట్ల వైపు వస్తున్న మూడు వాహనాలను ఓ ఆర్టీఏ అధికారి ఆపాడు. అందులో ఓ టిప్పర్‌, రెండు ట్రాక్టర్లు ఉన్నాయి. ఈ మూడు వాహనాల పత్రాలు పరిశీలించి వాటిలో ఓ ట్రాక్టర్‌కు ఫిట్‌నెస్‌ లేదని, రూ.10వేలు ఇస్తే వదిలేస్తామన్నాడు. డ్రైవర్‌ వద్ద డబ్బుల్లేకపోవడంతో జరిమానా విధించారు.

– జూలై 2న.. ఉదయం కోరుట్ల మండలం నాగులపేట వద్ద ఓ ఇసుక ట్రాక్టర్‌ ఆర్టీఏ అధికారులకు కనిపించింది. సదరు అధికారి కొంతదూరం ట్రాక్టర్‌ను తీసుకెళ్లి తరువాత వదిలేసినట్లు సమాచారం. ఏం జరిగిందని ఆరా తీస్తే.. సదరు ట్రాక్టర్‌ యజమాని రూ. 20వేలు ఇవ్వడంతో ఫైన్‌ రాయకుండా వదిలేశారట. ఇదీ.. వాహనాల స్థితిగతులను పరిశీలించి అవి సరైన రీతిలో ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన మోటార్‌ వెహికిల్‌ శాఖలో ఓ అధికారి తీరు. ప్రతిరోజూ జిల్లాలోని ఏదో ఓ ప్రాంతంలో పర్యటిస్తూ తనకాసుల వసూళ్ల దందాను యథేచ్ఛగా సాగించడం సదరు అధికారికి షరామాములుగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

పత్రాలు లేకున్నా సరే

సాధారణంగా టిప్పర్లు, ట్రాక్టర్లు, ప్రైవేటు బస్సులు, ఇతరత్రా వాహనాలకు రిజిస్ట్రేషన్‌ పత్రాలు, ఫిట్‌నెస్‌, ఇన్సురెన్స్‌, పొల్యూషన్‌, రోడ్‌టాక్స్‌, ఓవర్‌లోడ్‌ వంటి అంశాలతోపాటు ఇంజిన్‌ కండీషన్‌ను ఆర్టీఏ అధికారులు పరిశీలించాలి. ఫోర్‌వీల్‌ వాహనాలను తనిఖీలు చేయడం విధుల్లో ఓ భాగం. ఈ క్రమంలోనే జిల్లాకు చెందిన ఓ ఆర్టీఏ అధికారి జిల్లాలో పర్యటిస్తూ తరచూ తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీల్లో నిబంధనల ప్రకారం వాహనాలకు ధ్రువీకరణ పత్రాలు లేకుంటే జరిమానా విధించాలి. కానీ.. సదరు ఆర్టీఏ అధికారి కొన్ని సందర్బాల్లో వాహనాలను చెక్‌ చేసి ధ్రువీకరణ పత్రాలు లేని అంశాన్ని గుర్తించి జరిమానా వేయకుండా అమ్యామ్యాలు దండుకుని వాహనాలను వదిలేస్తున్నారన్న చర్చ జోరుగా సాగుతోంది.

వదిలేస్తే ప్రమాదమే..

కాసులకు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో టిప్పర్లు, ట్రాక్టర్ల వంటి పెద్ద వాహనాల పత్రాలు, ఫిట్‌నెస్‌, ఇంజిన్‌ కండీషన్‌, ఇన్సూరెన్స్‌ వంటి అంశాలను ఆర్టీఏ అధికారులు పక్కన పెట్టడం ప్రమాదకరం. ఇన్సురెన్స్‌ లేకుంటే ప్రమాదాలు జరిగిన సందర్భంలో ఎవరైనా చనిపోయినా.. లేదా గాయపడిన వారికి బీమా చెల్లింపు సమయంలో నష్టం వాటిల్లుతుంది. ఫిట్‌నెస్‌ లేకుండా.. కాలం చెల్లిన వాహనాలతో ప్రమాదాలు జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ధ్రువీకరణ పత్రాలు లేకుండా వాహనాలు రోడ్లపై తిరుగుతుంటే పట్టుకుని జరిమానా వేయకుండా ‘సొంత లాభం’ చూసుకుంటే సర్కార్‌ ఖజానాకు పెద్ద ఎత్తున గండిపడుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై ఆర్టీఏ అధికారిని వివరణ కోరేందుకు యత్నించగా ఆయన ఫోన్‌ స్వీకరించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement