
36 మంది బాలకార్మికులకు విముక్తి
● జిల్లాలో ముగిసిన ఆపరేషన్ ముస్కాన్
జగిత్యాలక్రైం: పుస్తకాలతో కుస్తీ పట్టాల్సిన వయస్సులో పనిలో మగ్గిపోతున్న బాలలకు విముక్తి కల్పించేందుకు జూలై1నుంచి 31వరకు ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్ 11వ విడత కార్యక్రమం జిల్లాలో విజయవంతమైంది. బడిబయట ఉన్న 36 మంది చిన్నారులను గుర్తించిన అధికారులు వారిని తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. కొంతమంది చిన్నారులు ఆర్థికంగా ఇబ్బందులతో తల్లిదండ్రుల మాట పెడచెవిన పెట్టి బడికి వెళ్లకుండా వెట్టి చాకిరి చేస్తున్న బాలలకు జిల్లా పోలీసు శాఖ, ఐసీడీఎస్ అధికారులు విముక్తి కల్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎస్పీ అశోక్‌కుమార్ ఒక సబ్‌డివిజన్ పరిధిలో ఒక ఎస్సై, ముగ్గురు కానిస్టేబుళ్లు, ఒక్క మహిళా కానిస్టేబుల్ ఆధ్వర్యంలో రెండు బృందాలు ఏర్పాటు చేశారు. వీరు ప్రతిరోజూ జిల్లాలోని ఇటుక బట్టీలు, హోటళ్లు, దాబాలు, దుకాణాల్లో, బేకరీల్లో పనిచేస్తున్న 36 మందిని గుర్తించారు.
చిన్నారులను పనిలో పెట్టుకుంటే చర్యలు
జిల్లాలో బడీడు పిల్లలను ఎవరైనా పనిలో పెట్టుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. జూలై 1నుంచి 31 వరకు చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్‌లో 36 మందికి విముక్తి కల్పించాం. పనిలో పెట్టుకున్న వారిపై కేసులు నమోదు చేశాం. – అశోక్‌కుమార్, ఎస్పీ, జగిత్యాల జిల్లా