‘మా తొలి క్షిపణికే.. మీ నౌకలు ముంచేస్తాం’ | Your Ships Will Be Sunk By Our First Missiles: Iran | Sakshi
Sakshi News home page

‘మా తొలి క్షిపణికే.. మీ నౌకలు ముంచేస్తాం’

Apr 16 2026 12:01 PM | Updated on Apr 16 2026 12:19 PM

Your Ships Will Be Sunk By Our First Missiles: Iran

టెహ్రాన్: మా మొదటి క్షిపణులకే మీ ఓడలు మునిగిపోతాయంటూ హార్ముజ్ జలసంధి విషయంలో అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చింది. హార్ముజ్ జలసంధిని నియంత్రించేందుకు అమెరికా ప్రయత్నిస్తే.. ఆ నౌకలను ఇరాన్ ధ్వంసం చేస్తుందని ఇరాన్‌ సుప్రీం నేత మొజ్తాబా ఖమేనీ సైనిక సలాహాదారుడు మొహ్సెన్ రెజాయి హెచ్చరించారు. అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న ఘర్షణకు ఈ జలసంధి కేంద్ర బిందువుగా మారింది. 

మొహ్సెన్ రెజాయీ.. ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ హెచ్చరికలు చేశారు. సైనిక దుస్తుల్లో ఉన్న ఆయన మాట్లాడుతూ.. మిస్టర్ ట్రంప్.. హార్ముజ్ జలసంధికి పోలీసు కావాలనుకుంటున్నారు. ఇది నిజంగా మీ పనేనా? అమెరికా వంటి శక్తివంతమైన సైన్యం చేసే పని ఇదేనా? మీ ఓడలు మా మొదటి క్షిపణులకే సముద్రంలో మునిగిపోతాయి" అంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్‌లో హార్డ్‌లైనర్‌గా పేరున్న రెజాయీ.. ఒకవేళ అమెరికా ఇరాన్‌పై భూతల దాడికి దిగితే.. తాము వేలమందిని బందీలుగా పట్టుకుంటామని.. ప్రతి బందీకి ఒక బిలియన్ డాలర్లు వసూలు చేస్తామంటూ ఘాటు వ్యా‍ఖ్యలు చేశారు. ప్రస్తుత కాల్పుల విరమణను పొడిగించడం తనకు ఇష్టం లేదని కూడా ఆయన స్పష్టం చేశారు.

యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇరు దేశాల మధ్య ఇస్లామాబాద్‌లో జరిగిన మొదటి రౌండ్ చర్చలకు ఇరాన్ తరపున పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘర్ గాలిబాఫ్ నాయకత్వం వహించారు. అయితే ఆదివారం ఆ చర్చలు విఫలమయ్యాయి. తిరుగు ప్రయాణంలో గాలిబాఫ్.. ట్రంప్‌ను ఉద్దేశించి, ‘‘మీరు పోరాడితే.. మేము కూడా పోరాడతాం" అని తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే.

ఫిబ్రవరి చివరలో అమెరికా-ఇజ్రాయెల్ ఇరాన్‌పై వైమానిక దాడులు చేసి.. సుప్రీం లీడర్ అలీ ఖమేనీని చంపిన తర్వాత ఆరు వారాల పాటు యుద్ధం కొనసాగింది. ప్రస్తుతం రెండు వారాలుగా తాత్కాలిక కాల్పుల విరమణ కొనసాగుతోంది. పాకిస్థాన్‌లో వాషింగ్టన్‌- టెహ్రాన్ మధ్య చర్చలు విఫలమవడంతో ఇరాన్ ఓడరేవులన్నింటినీ దిగ్బంధిస్తామని అమెరికా సైన్యం గత వారం ప్రకటించిన సంగతి తెలిసిందే.. దీనిని ఇరాన్ చట్టవిరుద్ధమంటూ సముద్రపు దొంగతనంగా అభివర్ణించింది.

కేవలం 34 కిలో మీటర్ల వెడల్పు ఉన్న ఈ జలసంధి ద్వారా ప్రపంచ సముద్ర చమురు వ్యాపారంలో 20 శాతం జరుగుతుంది. సౌదీ అరేబియా, ఇరాక్, ఖతార్ వంటి దేశాల ఇంధన ఎగుమతులకు ఇది కీలక మార్గం. యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఇరాన్ ఈ మార్గాన్ని దాదాపుగా అడ్డుకుంది. కేవలం చైనా వంటి మిత్రదేశాల నౌకలను మాత్రమే అనుమతిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement