Asia's Richest Woman: ఆసియాలోనే అత్యంత ధనికురాలు.. ఏడాది తిరిగేసరికి సగం సంపద ఫసక్‌

Yang Huiyan: The richest woman in China Lost Half Of Properties - Sakshi

ఆమె ఒక బడా వ్యాపారవేత్త. నాలుగు రోజుల్లో రెండు బిలియన్ల సంపద ఆర్జించి.. యుక్తవయసులోనే ప్రపంచం దృష్టిని ఆకట్టుకుంది.. ఆసియాలోనే అత్యంత సంపద ఉన్న మహిళగా ఖ్యాతికెక్కింది. ప్చ్‌.. కానీ, అది ఏడాది కిందటి మాట. ఇప్పుడామె ఆస్తి సగం కరిగిపోయింది. అలా ఇలా కాదు. మన కర్సెనీలో చెప్పాలంటే.. లక్షల కోట్ల రూపాయలు మాయమయ్యాయి. ఇదంతా చైనాలో తలెత్తిన రియల్‌ ఎస్టేట్‌ రంగపు సంక్షోభ ప్రభావమే. 

యాంగ్‌ హుయియాన్‌(41).. చైనా రియల్టి దిగ్గజ సంస్థ కంట్రీ గార్డెన్‌లో అత్యధిక వాటాలున్న వ్యక్తి. నిరుడు ఆమె సంపద అక్షరాల 23.7 బిలియన్‌ డాలర్లు(ఆ ఏడాది మొదట్లో 27 బిలియన్‌డాలర్లుగా ఉంది). కానీ, 

► అందులో సుమారు 52 శాతం సంపద ఐస్‌లా కరిగిపోయింది. ఇప్పుడు ఆమె మొత్తం ఆస్తి విలువ 11.3 బిలియన్‌ డాలర్లకు చేరుకుందని బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ పేర్కొంది. 

చైనా ప్రావిన్స్‌ అయిన గువాంగ్‌డాంగ్‌కు చెందిన కంట్రీ గార్డెన్‌ షేర్లు.. హాంకాంగ్‌ ట్రేడింగ్‌లో బుధవారం దారుణంగా దెబ్బ తిన్నాయి. ఈ ప్రభావంతోనే ఆమె దారుణంగా నష్టపోయింది. 

► Yang Huiyan తండ్రి యాంగ్‌ గువోక్వియాంగ్‌.. కంట్రీ గార్డెన్‌ వ్యవస్థాపకుడు. 

► 2005లో ఆయన తన వాటాలను కూతురి పేరు మీద రాయడంతో .. ఆమె రిచ్చెస్ట్‌ వుమెన్‌ లిస్ట్‌లో చేరిపోయారు. 

► రెండేళ్లకు.. అంటే 2007లో కంట్రీ గార్డెన్‌ ఐపీవోకు వెళ్లింది. ఆ ప్రభావంతో.. ఆమె ఆసియాలో ధనిక మహిళగా గుర్తింపు పొందారు. 

► అయితే సైప్రస్‌ పేపర్ల లీకేజీతో ఆమె ఒక్కసారిగా హాట్‌టాపిక్‌గా మారింది. 

► చైనాలో ద్వంద్వ పౌరసత్వానికి వీల్లేదు. కానీ, ఆమె సైప్రస్‌ పౌరసత్వం 2018లో తీసుకున్నారన్న విషయం సైప్రస్‌ పేపర్ల ద్వారా వెలుగు చూసింది. 

► ప్రస్తుతం యాంగ్‌ సంపద తరిగిపోవడంతో.. ఆమె ఈ లిస్ట్‌లో గట్టి పోటీనే ఎదుర్కొంటున్నారు. 

► ఫైబర్స్‌ టైకూన్‌ అయిన ఫ్యాన్‌ హోంగ్‌వెయి సుమారు 11.2 బిలియన్‌ డాలర్లతో.. యాంగ్‌కు గట్టిపోటీనే ఇస్తోంది. 

► కరోనా టైం నుంచి చైనాలో రియల్‌ ఎస్టేట్‌ రంగం ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. 

► రియల్టి రంగంలో పెనుసంక్షోభంతో ప్రపంచంలోనే రెండో పెద్ద అర్థిక వ్యవస్థ మొత్తం చైనా పతనం దిశగా దూసుకుపోతోంది.

► ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలను తట్టుకునేందుకు అడ్డగోలుగా డిస్కౌంట్‌లను ప్రకటించి.. ఇప్పుడు నగదు కొరతతో రియల్టి రంగంలోని దిగ్గజ కంపెనీలు ఇబ్బందుల పాలవుతున్నాయి. 

► దేశంలోని ప్రైవేట్ రంగ కంపెనీలపై పట్టు సాధించడం కోసం డ్రాగన్‌ అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌  "సాధారణ శ్రేయస్సు" (కామన్‌ ప్రాస్సరటీ) పేరుతో తీసుకువచ్చిన విధానం వల్ల చైనా బిలియనీర్ క్లాస్‌లో భారీ ఆటుపోట్లు సంభవిస్తున్నాయి.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top