‘వుహాన్‌’ పిల్లులకు కరోనా వైరస్‌

Wuhan Cats Got Corona Virus - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ ప్రజలను భయకంపితుల్ని చేస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్ పెంపుడు కుక్కలకు, పిల్లులకు సోకుతోందన్న వార్తలు ఆ మధ్యన వెలుగులోకి వచ్చాయి. అయితే మనుషుల నుంచి వాటికి వైరస్‌ సోకిందా లేదా వాటి నుంచే మనుషులకు వైరస్‌ సోకిందా ? అన్న వాదనలూ వినిపించాయి. అయితే వాటికి సరైన రుజువులు దొరకలేదు. కరోనా వైరస్‌ ఆవిర్భవించిన చైనాలోని వుహాన్‌ పట్టణంలో ప్రజలు పిల్లులను ఎక్కువగా పెంచుకుంటారు. అందుకని అక్కడి పిల్లులపై కోవిడ్‌ పరీక్షలు జరపాలని హువాఝంగ్‌ వ్యవసాయ యూనివర్శిటీ పరిశోధకులు నిర్ణయించారు. 

మూడు యానిమల్‌ షెల్టర్స్‌ నుంచి మూడు పెట్‌ హాస్పిటల్స్‌ నుంచి కరోనా సోకిన రోగుల ఇళ్ల నుంచి 141 పిల్లులను సేకరించి వాటి నుంచి అన్ని రకాల శాంపిల్స్‌ తీసి పరీక్షలు జరిపారు. వాటిలో 14.7 శాతం పిల్లుల్లో కరోనా యాంటీ బాడీస్‌ బయట పడగా, 10.8 శాతం పిల్లుల్లో స్థిరమైన యాంటీ బాడీస్‌ దొరికాయి. అత్యధిక యాంటీ బాడీస్‌ ఉన్న మూడు పిల్లులు కరోనా రోగుల ఇంట్ల నుంచి సేకరించినవని పరిశోధకులు తెలిపారు. కరోనా రోగుల్లోకెల్లా వారి నుంచి కరోనా సోకిన పెంపుడు పిల్లుల్లో ఆ వైరస్‌ ప్రభావం తీవ్రంగా ఉందని వారు చెప్పారు.

రోగుల నుంచి తుంపర్ల కారణంగానే పెంపుడు పిల్లులకు వైరస్‌ సోకిందని ల్యాబ్‌ పరీక్షల్లో తేలిందని, అందుకని పెంపుడు జంతువులతోని కూడా యజమానులు భౌతిక దూరం పాటించాలని పరిశోధకులు సూచించారు. జంతువుల నుంచి జంతువులకు అంటే పిల్లుల నుంచి పిల్లులకు లేదా కుక్కల నుంచి పిల్లులకు ఈ వైరస్‌ సోకుతుందా, లేదాఅన్న విషయాన్ని తేల్చుకోవాలంటే మరిన్ని పరిశోధనలు అవసరమని వారు చెప్పారు. ఇంతకుముందు అమెరికాలో కూడా 17 పెంపుడు పిల్లులకు కరోనా సోకినట్లు నిర్ధారించారు. ఈ అధ్యయనంకు సంబంధించిన పూర్తి వివరాలను ‘ఎమర్జింగ్‌ మ్రైక్రోబ్స్‌ అండ్‌ ఇన్‌ఫెక్షన్స్‌’ జర్నల్‌లో ప్రచురించారు.  (చదవండి: చెన్నైలో 21.5 శాతం మందికి కోవిడ్‌-19)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top