ఆక్‌.. పాక్‌.. కరివేపాక్‌ | Why Israel Suspect Pak Mediation In Iran USA Peace Talks | Sakshi
Sakshi News home page

ఆక్‌.. పాక్‌.. కరివేపాక్‌

Apr 9 2026 11:53 AM | Updated on Apr 9 2026 12:31 PM

Why Israel Suspect Pak Mediation In Iran USA Peace Talks

ఇరాన్‌-అమెరికా&కో మధ్య యుద్ధం ఆగిపోవడానికి తామే కారణమని పాకిస్తాన్‌ తెగ ప్రచారం చేసుకుంటోంది. అయితే ఇరాన్‌ మాత్రం అందులో నిజం లేదని క్లారిటీ ఇచ్చింది. ఇటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మొదట కాస్త క్రెడిట్‌ ఇచ్చినప్పటికీ.. ఆ తర్వాత చైనా పాత్ర కీలకమని చెప్పి పాక్‌ గాలి తీసేశారు. ఈలోపు.. ఇటు ఇజ్రాయెల్‌ ఆ మధ్యవర్తిత్వంపై ఏకంగా అనుమానాలే వ్యక్తం చేస్తోంది. 

మిడిల్‌ ఈస్ట్‌ వార్‌లో పాక్‌ మధ్యవర్తిత్వంపై ఇజ్రాయెల్‌ సందేహాలు వ్యక్తం చేస్తోంది. ఆ దేశానికి అంత సీన్‌ లేదని.. అదసలు నమ్మదగిన విషయమే కాదని అంటోంది. భారత్‌లోని ఇజ్రాయెల్‌ రాయబారి రూవెన్‌ అజార్‌ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. మధ్యవర్తిత్వం విషయంలో పాక్‌ పాత్ర ఏం మాత్రం ఉండకపోవచ్చు. అమెరికా కేవలం తమ వ్యూహాత్మక కారణాల వల్లే పాకిస్తాన్‌ను వాడుకుంటుందేమో అని వ్యాఖ్యానించారు.

అమెరికా గతంలో ఖతర్‌, టర్కీ వంటి దేశాలను ముందుంచి గాజా విషయంలో హమాస్‌తో ఒప్పందాలు సాధించింది. అదే విధంగా ఇప్పుడు పాకిస్తాన్‌ను ఉపయోగించుకుని ఉండొచ్చు. కాబట్టి పాక్‌ను విశ్వసనీయ మధ్యవర్తిగా ఏ కోణంలోనూ చూడలేం అని అన్నారాయన. అదే సమయంలో.. అమెరికాతో సమన్వయం కొనసాగించడం ఇజ్రాయెల్‌కు ఎంతో ముఖ్యమని ఆయన వ్యాఖ్యానించారు.

విమర్శలు కూడా.. 
పశ్చిమాసియా యుద్ధంలో పాక్‌ మధ్యవర్తిత్వంపై ఇప్పుడు విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. లెబనాన్‌ విషయంలో స్పష్టత లేకపోవడంతోనే మరోసారి ఉద్రిక్తతలు తలెత్తడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. లెబనాన్‌కు కూడా కాల్పుల విరమణ వర్తిస్తుందని పాక్‌ తొలుత ప్రకటించగా.. ఆ మాట చెప్పడానికి పాక్‌కు ఏ అర్హత ఉందంటూ ఇజ్రాయెల్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. అదే సమయంలో.. ఇటు అమెరికా కూడా లెబనాన్‌కు ఒప్పందం వర్తించబోదని తేల్చేసింది. దీంతో ఈ గందరగోళానికి పాక్‌ తీరే కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  

ఇరాన్‌, అమెరికా తమను నమ్ముతున్నాయని పాక్‌ అంటోంది. అయితే ఇరాన్‌ మాత్రం పాక్‌ ప్రయత్నాలను ప్రశంసిస్తూనే.. మధ్యవర్తిత్వాన్ని మాత్రం ఒప్పుకోవడం లేదు.  పాకిస్తాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ఇస్లామాబాద్‌లో శుక్రవారం జరగబోయే చర్చలకు అమెరికా–ఇరాన్‌ ప్రతినిధులను ఆహ్వానించారు. “ఇరాన్‌, అమెరికా- మిత్రదేశాలు తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయి. శాంతి చర్చలు విజయవంతమవుతాయని ఆశిస్తున్నాం” అని ఆయన సోషల్‌ మీడియా వేదికలో ఓ పోస్ట్‌ చేశారు. సౌదీ, టర్కీ, ఈజిప్ట్‌ విదేశాంగ మంత్రులకు సైతం ఈ సమావేశానికి ఆహ్వానం వెళ్లినట్లు సమాచారం. అయితే చర్చలు శనివారం(11వ తేదీకి) జరుగుతాయని అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌజ్‌ ఓ ప్రకటన రిలీజ్‌ చేసింది.

ఇరాన్‌పై భీకర దాడుల హెచ్చరికలు చేసిన ట్రంప్‌.. చివరి నిమిషంలో యుద్ధానికి బ్రేక్‌ వేశారు. రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని.. శాశ్వత శాంతి స్థాపనకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఇటు ఇరాన్‌ కూడా ఆ ప్రకటనను ధృవీకరించింది. కానీ, లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులతో ఘర్షణలు మళ్లీ ఉధృతమయ్యాయి. ఈ పరిణామంపై ఇరాన్‌ భగ్గుమంటోంది. కీలకమైన హర్ముజ్‌ను తెరిచినట్లే తెరిచి.. మళ్లీ మూసేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మాట్లాడుతూ లెబనాన్‌ ఈ కాల్పుల విరమణలో ఏమాత్రం భాగం కాదని, హెజ్బొల్లా ఉనికి కారణంగా ఇది ‘వేరే ఘర్షణ’ అని ప్రకటించారు. అయితే పలు దేశాలు మాత్రం లెబనాన్‌కు సీజ్‌ఫైర్‌ వర్తింపజేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement