
వాషింగ్టన్: భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న అశాంతిని చల్లార్చడంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక పాత్ర పోషించారని యూఎస్‌ఏ అధికార కార్యాలయం వైట్‌హౌస్ పునరుద్ఘాటించింది. ట్రంప్ అధికార యంత్రాంగంలోని పలువురు అధికారులు కూడా ఇదే వాదన వినిపిస్తున్నారు.
భారత్-పాక్ మధ్య యుద్ధాన్ని అధ్యక్షుడు ట్రంప్ నిలిపివేశారని, అలాగే రష్యా- ఉక్రెయిన్ మధ్య సంధికి మధ్యవర్తిత్వం వహించారని వైట్‌హైస్ మరోమారు వాదనకు దిగింది. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ మీడియాతో మాట్లాడుతూ అధ్యక్షుడు ట్రంప్.. గాజాలో శాంతి ఒప్పందంపై చర్చలు జరిపేందుకు ప్రయత్నిస్తున్నారని, అతని ప్రయత్నాల కారణంగా పలువురు బందీలు విడుదలయ్యారని అన్నారు. ట్రంప్ ఆదేశాల దరిమిలా ఇరాన్‌లోని అణు సౌకర్యాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని పేర్కొన్నారు.
‘మేము చాలా యుద్ధాలను ఆపాం. భారత్- పాకిస్తాన్‌లు అణ్వాయుధ దేశాలు. ఇవి పరస్పరం ఘర్షణపడుతున్నాయి. ఈ దేశాల మధ్య జరిగే యుద్ధాన్ని నిలువరించాం. ఇటీవల ఇరాన్‌లో మేము ఏమి చేసామో అందరూ చూశారు. ఆ దేశ అణ్వాయుధ సామర్థ్యాన్ని ధ్వంసం చేశాం. భారత్- పాక్ మధ్య జరిగే యుద్ధాన్ని వాణిజ్యం ద్వారా పరిష్కరించామని కరోలిన్ లీవిట్ పేర్కొన్నారు. అయితే భారత్-పాక్‌ల మధ్య కాల్పుల విరమణ విషయంలో మూడవ పక్షం ప్రమేయం లేదని భారత్ స్పష్టం చేసింది.