వాషింగ్టన్: అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరి 24 గంటలైనా గడవకముందే మళ్లీ ఉద్రిక్తతలు చెలరేగుతున్నాయి. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఇరాన్ మళ్లీ హార్మూజ్‌ను మూసివేయడంతో దీనిపై శ్వేతసౌధం స్పందించింది. ఇరాన్ తీరు అమోదయోగ్యం కాదని చెప్పింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ట్రూత్ సోషల్‌లో స్పందించారు.
‘అన్ని అమెరికా నౌకలు, యుద్ధ విమానాలు, సైనిక సిబ్బంది, అదనపు గుండు సామగ్రి, ఆయుధ సామగ్రి అన్నీ ఇరాన్ దగ్గర ప్రాంతాల్లోనే ఉన్నాయి. శత్రువు ఇప్పటికే బలహీనంగా ఉప్పటికీ పూర్తిగా నాశనం చేసేందుకు వీలుగా వాటన్నింటినీ అక్కడే సిద్ధంగా ఉంచాం. ఒప్పందం పూర్తిగా అమలు అయ్యే వరకు అక్కడే ఉంటాయి.
ఏదైనా కారణంతో ఒప్పందం అమలు కాకపోయినా, అసాధ్యం అయినా, కాల్పులు ప్రారంభం అవుతాయి. గతంలో ఎవరూ చూడని విధంగా మరింత పెద్దగా, మెరుగ్గా, శక్తిమంతంగా సైనిక చర్య ఉంటుంది. ఈ నిర్ణయాన్ని ముందే తీసుకున్నాం. ఎవరైనా వేరేలా చెప్పినా అవి తప్పుడు మాటలు.
అణ‍్వాయుధాలను అనుమతించబోం. హార్మూజ్ జలసంధిని ఎప్పుడూ తెరిచి, సురక్షితంగా ఉండేలా చేస్తాం. మా సైన్యం సిద్ధమవుతూ, విశ్రాంతి తీసుకుంటోంది. తదుపరి విజయం కోసం ఎదురుచూస్తోంది. అమెరికా ఈజ్ బ్యాక్’ అని ట్రంప్ తెలిపారు.


