40 శాతం రాయితీపై రష్యా ఎల్‌ఎన్‌జీ? | Russia 40 percent LNG Discount Global Energy Turmoil South Asia Risks Rewards | Sakshi
Sakshi News home page

40 శాతం రాయితీపై రష్యా ఎల్‌ఎన్‌జీ?

Apr 9 2026 11:11 AM | Updated on Apr 9 2026 11:41 AM

Russia 40 percent LNG Discount Global Energy Turmoil South Asia Risks Rewards

ప్రపంచ ఇంధన మార్కెట్‌లో పెను మార్పులు సంభవిస్తున్నాయి. ఒకవైపు పశ్చిమ దేశాల ఆంక్షలు, మరోవైపు హార్మూజ్‌ జలసంధిలో నెలకొన్న అనిశ్చితి మధ్య దక్షిణాసియా దేశాలను ఆకర్షించేందుకు రష్యా భారీ డిస్కౌంట్లను ఎరగా వేస్తోంది. ముఖ్యంగా అమెరికా ఆంక్షల పరిధిలో ఉన్న తన ఎల్‌ఎన్‌జీ ప్రాజెక్టుల నుంచి గ్యాస్‌ను విక్రయించేందుకు రష్యా ఏకంగా 40 శాతం రాయితీని ప్రకటిస్తుండటం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.

అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, రష్యా కొన్ని మధ్యవర్తిత్వ సంస్థల ద్వారా ఈ రాయితీని ఆఫర్ చేస్తోంది. గ్యాస్ కొనుగోలు చేసే దేశాలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండటానికి ఈ సరుకు ఒమన్ లేదా నైజీరియా వంటి రష్యాయేతర దేశాల నుంచి వస్తున్నట్లు తప్పుడు ధ్రువీకరణ పత్రాలను కూడా సృష్టించడానికి అక్కడి ప్రైవేట్‌ విక్రేతలు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

ముఖ్యంగా ఆర్కిటిక్ ఎల్‌ఎన్‌జీ 2 వంటి బ్లాక్‌లిస్ట్ చేసిన ప్లాంట్ల నుంచి ఎగుమతులను పెంచుకోవడమే రష్యా ప్రధాన ఉద్దేశంగా ఉన్నట్లు కొన్ని సంస్థలు తెలుపుతున్నాయి. ప్రస్తుతం ఈ గ్యాస్‌ను షాడో ఫ్లీట్ (గుర్తింపు లేని నౌకలు) ద్వారా దిగుమతి చేసుకుంటున్న ఏకైక దేశం చైనా మాత్రమే. అయితే, తన కస్టమర్ బేస్‌ను విస్తరించుకోవడానికి రష్యా ఇప్పుడు భారత్, బంగ్లాదేశ్ వంటి దేశాలను సంప్రదిస్తుంది.

ఖతార్ ఎగుమతుల నిలిపివేత

ప్రస్తుతం ఆసియాలో గ్యాస్ కొరత తీవ్రంగా ఉండటానికి ప్రధాన కారణం హార్మూజ్‌ జలసంధిలో తలెత్తిన ఉద్రిక్తతలు. ప్రపంచ ఎల్‌ఎన్‌జీ సరఫరాలో ఐదో వంతు వాటా కలిగిన ఖతార్ నుంచి ఎగుమతులు నిలిచిపోయాయి. దీనివల్ల బంగ్లాదేశ్, భారత్ వంటి దేశాలు స్పాట్ మార్కెట్‌లో రెట్టింపు ధర చెల్లించి గ్యాస్ కొనాల్సి వస్తోంది. గ్యాస్ కొరత కారణంగా ఎరువుల రంగానికి సరఫరాను నిలిపివేయాల్సిన దుస్థితి నెలకొంది. గత ఏడాది తన అవసరాల్లో 60 శాతం గ్యాస్‌ను ఖతార్ నుంచి పొందిన బంగ్లాదేశ్ ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాల కోసం తీవ్రంగా అన్వేషిస్తోంది. ఇదే అదనుగా రష్యా తన రాయితీ ఆఫర్‌ను ముందుకు తెచ్చింది.

ఆచితూచి అడుగులు

రష్యా ఆఫర్ ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ భారత్ మాత్రం ఆంక్షల విషయంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. బ్లాక్‌లిస్ట్ చేసిన రష్యా ప్రాజెక్టుల నుంచి గ్యాస్ తీసుకోబోమని కేంద్ర ప్రభుత్వం గతంలోనే స్పష్టం చేసింది. అయితే, ఇటీవల అమెరికా ట్రెజరీ జనరల్ లైసెన్స్ ద్వారా కొన్ని ఆంక్షలను సడలించిన తర్వాత 2019 నుంచి మొదటిసారిగా భారత్ ఇరాన్ నుంచి చమురు రవాణాను కొనుగోలు చేసింది. అమెరికా నుంచి ఎటువంటి ఆంక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందోననే భయంతో భారతీయ కంపెనీలు రష్యా ఎల్‌ఎన్‌జీ పట్ల ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు.

రష్యా ఆఫర్ చేస్తున్న 40 శాతం డిస్కౌంట్ ఆర్థికంగా భారత్, బంగ్లాదేశ్‌లకు ఊరటనిచ్చే విషయమే. అయినప్పటికీ, దీని వెనుక ఉన్న దౌత్యపరమైన రిస్క్ తక్కువేమీ కాదు. ఒకవేళ ఈ ఒప్పందాలు జరిగితే అది అంతర్జాతీయ రాజకీయాల్లో కొత్త మలుపులకు దారితీస్తుంది. ప్రస్తుతానికి బ్లూమ్‌బెర్గ్ వంటి సంస్థలు ఈ కొనుగోళ్లు జరిగాయో లేదో ధ్రువీకరించలేదు.

ఇదీ చదవండి: మళ్లీ పసిడి ధరల మంట! తులం ఎంతంటే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement