గోల్డ్‌–సిల్వర్‌ జూమ్‌.. క్రూడ్‌ క్రాష్‌ | Gold and Silver Prices Rise After US–Iran Ceasefire | Sakshi
Sakshi News home page

గోల్డ్‌–సిల్వర్‌ జూమ్‌.. క్రూడ్‌ క్రాష్‌

Apr 9 2026 4:49 AM | Updated on Apr 9 2026 7:53 AM

Gold and Silver Prices Rise After US–Iran Ceasefire

వెండి కేజీ రూ. 11,000 జంప్‌ 

బంగారం 10 గ్రా. రూ. 3,200 అప్‌ 

మరోపక్క కుప్పకూలిన చమురు ధరలు 

ఈ ప్రభావంతో జోరందుకున్న రూపాయి

న్యూఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధ వాతావరణానికి తాత్కాలికంగా బ్రేక్‌ పడటంతో బంగారం, వెండి ధరలు తిరిగి జోరందుకున్నాయి. యూఎస్, ఇరాన్‌ మధ్య రెండు వారాలపాటు కాల్పుల విరమణకు తెరలేవడంతో విలువైన లోహాలకు డిమాండ్‌ పెరిగింది. ఆలిండియా సరాఫా అసోసియేషన్‌ వివరాల ప్రకారం స్థానిక మార్కెట్లో కేజీ వెండి రూ. 11,000 (5 శాతం) జంప్‌చేసి రూ. 2,51,000ను తాకింది. ఇక మేలిమి బంగారం సైతం 10 గ్రాములు రూ. 3,200 (2 శాతం) ఎగసి రూ. 1,56,400కు చేరింది. 

విదేశీ మార్కెట్లోనూ: అంతర్జాతీయ మార్కెట్లలోనూ వెండి, బంగారం మెరిశాయి. స్పాట్‌ గోల్డ్‌ ఔన్స్‌ 2 శాతంపైగా (97 డాలర్లు) బలపడి 4,803 డాలర్లకు చేరింది. మరోపక్క సిల్వర్‌ ఔన్స్‌ 6% జంప్‌చేసి 77.33 డాలర్లను తాకింది. హార్మూజ్‌ను తెరిచే వీలున్నట్లు ఇరాన్‌ సంకేతాలివ్వడంతో సెంటిమెంటు మెరుగుపడినట్లు బులియన్‌ వర్గాలు పేర్కొన్నాయి.  

ముడిచమురు 20% క్షీణత 
కొద్ది రోజులుగా చుక్కలు చూపిస్తున్న  క్రూడ్‌ ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. నౌకల రవాణాకు అడ్డంకులు తొలగనున్న అంచనాలతో చమురు ధరలు తొలుత 20% పతనమయ్యాయి. తదుపరి బ్రెంట్‌ పీపా 15.5% (17 డాలర్లు) దిగజారి 92 డాలర్లస్థాయిలో ట్రేడవుతోంది. ఇక డబ్ల్యూటీఐ పీపా 18% (20 డాలర్లు) పడిపోయి 93 డాలర్ల దిగువకు చేరింది.  

రూపాయికి జోష్‌ 
పశ్చిమాసియాలో పరిస్థితులు శాంతించడంతో ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్‌ 1%పైగా బలహీనపడి 98.5కు చేరింది. దీంతోపాటు.. దేశీ స్టాక్‌ మార్కెట్లు హైజంప్‌ చేయడం రూపాయికి బలాన్నిచి్చనట్లు ఫారెక్స్‌ వర్గాలు పేర్కొన్నాయి. ఫలితంగా డాలరుతో మారకంలో దేశీ కరెన్సీ 52 పైసలు పుంజుకుని 92.54 వద్ద ముగిసింది.

Advertisement
 
Advertisement
Advertisement