అమెరికాలో ఎవియన్‌ ఫ్లూ... 5 కోట్ల కోళ్లు బలి

US Bird Flu Outbreak Worst on Record With 50 Million Deaths - Sakshi

వాషింగ్టన్‌: అమెరికాలో ఎవియన్‌ ఫ్లూ అక్షరాలా విలయం సృష్టిస్తోంది. ఈ ఏడాది ఇప్పటిదాకా రికార్డు స్థాయిలో ఏకంగా 5 కోట్ల కోళ్లు, పక్షులను బలి తీసుకుంది! ఇది దేశ చరిత్రలోనే అత్యంత ప్రాణాంతకమైన విపత్తని వ్యవసాయ శాఖ పేర్కొంది. దీని దెబ్బకు దేశవ్యాప్తంగా గుడ్లు, కోడి మాంసం తదితరాల రేట్లు చుక్కలనంటుతున్నాయి. అసలే ద్రవ్యోల్బణంతో అల్లాడుతున్న జనం జేబుకు మరింత చిల్లి పెడుతున్నాయి.

హైలీ పాథోజెనిక్‌ ఎవియన్‌ ఇన్‌ఫ్లుయెంజా (హెచ్‌పీఏఐ)గా పిలిచే ఈ ఫ్లూ అడవి బాతుల వంటి వాటి వ్యర్థాలు, ఈకల ద్వారా సోకుతుంది. ఇది అమెరికాలో ఫిబ్రవరిలో వెలుగు చూసింది. చూస్తుండగానే కార్చిచ్చులా దేశమంతటా వ్యాపించి ఏకంగా 46 రాష్ట్రాలను చుట్టేసింది. దాంతో ఫ్లూ వ్యాప్తిని అడ్డుకునేందుకు లక్షలు, కోట్ల సంఖ్యలో కోళ్లు, ఇతర పక్షులను చంపేయాల్సి వచ్చింది! 2015లోనూ యూఎస్‌లో ఇలాగే దాదాపు 5 కోట్ల పక్షులు ఫ్లూకు బలయ్యాయి. బ్రిటన్‌తో సహా పలు యూరప్‌ దేశాల్లో కూడా ఎవియన్‌ ఫ్లూ విలయం సృష్టిస్తోంది. ఎంతలా అంటే బ్రిటన్లో పలు సూపర్‌ మార్కెట్లు ఒక్కో కస్టమర్‌ ఇన్ని గుడ్లు మాత్రమే కొనాలంటూ రేషన్‌ పెడుతున్నాయి! 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top