ఇస్లామాబాద్‌లో అధికారికంగా ప్రారంభమైన మంతనాలు
అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య రెండు రౌండ్ల ప్రత్యక్ష చర్చలు
చర్చల పురోగతిపై ఇంకా స్పందించని ఇరుపక్షాలు
మరో దఫా సంప్రదింపులు జరిగే అవకాశం
పశ్చిమాసియాలో శాశ్వత శాంతిని కోరుకుంటున్నాం
పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ స్పష్టీకరణ
ఇస్లామాబాద్/లాహోర్/దుబాయ్: పశ్చిమాసియా లో యుద్ధానికి తెరదించి శాంతిని నెలకొల్పడమే ధ్యేయంగా వైరిపక్షాలైన అమెరికా, ఇరాన్‌ల మధ్య ప్రత్యక్ష చర్చలు శనివారం అధికారికంగా ప్రారంభమయ్యాయి. రెండు వారాల కాల్పుల విరమణ ప్రకటన తర్వాత పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో జరుగుతున్న ఈ మంతనాలకు పాక్ రాజధాని ఇస్లామాబాద్‌లోని ఓ స్టార్ హోటల్ వేదికగా మారింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా చర్చలు ఆరంభమైనట్లు పాక్ ప్రభుత్వం వెల్లడించింది.
ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చరిత్రాత్మక చర్చల కోసం ఇస్లామాబాద్‌కు చేరుకున్న అమెరికా, ఇరాన్ ప్రతినిధి బృందాలతో పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ శనివారం ఉదయం వేర్వేరుగా సమావేశమయ్యారు. పశ్చిమాసియా పరిస్థితులు, తాజా పరిణామాలపై చర్చించారు. అనంతరం సాయంత్రం అమెరికా, ఇరాన్ మధ్య ప్రత్యక్ష చర్చలు ప్రారంభమయ్యాయి. రెండు రౌండ్లు చర్చలు జరిగాయి. మరో దఫా చర్చలు జరగాల్సి ఉన్నట్లు సమాచారం. ఇప్పటిదాకా చర్చల్లో సాధించిన పురోగతి ఏమిటన్నది ఇరుపక్షాలు ఇంకా బయటపెట్టలేదు. ఆదివారం కల్లా స్పష్టత రావొచ్చని తెలుస్తోంది.
1979 తర్వాత తొలి ప్రత్యక్ష చర్చలు
అమెరికా, ఇరాన్ బృందాలు ఒకే బల్ల వద్ద కూర్చున్నాయని, చారిత్రాత్మక శాంతి చర్చలు ప్రారంభమయ్యాయని, తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరుపక్షాలు ముఖాముఖిగా కలుసుకోవడం ఇదే మొదటిసారి అని పాకిస్తాన్ టీవీ తెలియజేసింది. అమెరికా బృందానికి ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్ నేతృత్వం వహిస్తున్నారు. ఇందులో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్నర్, పశ్చిమాసియాలో అమెరికా ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ ఉన్నారు.
ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ ఘలిబాఫ్ నేతృత్వంలోని ఇరాన్ బృందంలో విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీతోపాటు ఇతర నాయకులు ఉన్నారు. 1979 నాటి ఇస్లామిక్ విప్లవం తర్వాత అమెరికా, ఇరాన్‌ల మధ్య ఇవే తొలి ఉన్నతస్థాయి ప్రత్యక్ష చర్చలు కావడం గమనార్హం. అంతకుముందు ఇస్లామాబాద్‌కు చేరుకున్న అమెరికా, ఇరాన్ బృందాలకు నూర్ ఖాన్ ఎయిర్‌బేస్‌లో ఉప ప్రధాని ఇషాఖ్ దార్, ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్, మంత్రి మొహిసిన్ రజా నఖ్వీ స్వయంగా స్వాగతం పలికారు. ఇరాన్ బృందానికి సైనిక దుస్తులు ధరించి, అమెరికా బృందానికి సూటు బూటు ధరించి అసిమ్ మునీర్ స్వాగతం పలకడం చర్చనీయాంశంగా మారింది.
అమెరికా, ఇరాన్ బృందాలతో షరీఫ్ భేటీ
పశ్చిమాసియాలో శాశ్వత శాంతి నెలకొనాలని పాక్ ప్రధాని షెహబాజ్ ఆకాంక్షించారు. శాంతి సాధనకు తమ సహకారం ఉంటుందని పునరుద్ఘాటించారు. అమెరికా–ఇరాన్‌ల మధ్య సయోధ్యకు తప్పకుండా సహకరిస్తామని చెప్పారు. అమెరికాతో చర్చల్లో పాల్గొనడానికి ఇస్లామాబాద్‌కు చేరుకున్న అమెరికా, ఇరాన్ ప్రతినిధి బృందాలతో శనివారం షెహబాజ్ వేర్వేరుగా సమావేశమయ్యారు. శాంతి యత్నాలకు సంబంధించిన అంశాలపై చర్చించారు.
ఈ సమావేశాల్లో పాక్ ఉప ప్రధానమంత్రి ఇషాఖ్ దార్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్, అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి మొహిసిన్ రజా నఖ్వీ తదితరులు పాల్గొన్నారు. శాంతి చర్చలకు ముందుకొచి్చన ఇరాన్ బృందాన్ని షెహబాజ్ షరీఫ్ అభినందించారు. ప్రాంతీయ ప్రయోజనాలు, ప్రపంచ శాంతి, సుస్థిరతల కోసం ఈ చర్చల్లో అర్థవంతమైన ఫలితాలను సాధించే దిశగా మధ్యవర్తిగా తమ పాత్రను చిత్తశుద్ధితో పోషిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు పాక్ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది.
అలాగైతేనే ఒప్పందం కుదురుతుంది: రెజా అరెఫ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన ‘అమెరికా ఫస్ట్’ సిద్ధాంతానికి అనుగుణంగా అమెరికా అధికారులు స్వదేశ ప్రయోజనాల కోసం కృషి చేస్తే అమెరికా–ఇరాన్ శాంతి చర్చల ద్వారా ఒక ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ఇరాన్ ప్రథమ ఉపాధ్యక్షుడు మహమ్మద్ రెజా అరెఫ్ పేర్కొన్నారు. అలా కాకుండా ‘ఇజ్రాయెల్ ఫస్ట్’ సిద్ధాంతానికి మద్దతిచ్చే ప్రతినిధులతో చర్చలు జరిగితే మాత్రం ఎలాంటి ఒప్పందం కుదరదని తేల్చిచెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇస్లామాబాద్ చర్చలు విఫలమైతే ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ మళ్లీ దాడులకు దిగుతాయని, ప్రపంచం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఇరాన్ డిమాండ్లు
→ హార్మూజ్ జలసంధిపై సంపూర్ణ ఆధిపత్యం మాకే ఉండాలి. అక్కడ నియంత్రణను వదులుకొనే ప్రసక్తే లేదు.
→ గల్ఫ్ దేశాల నుంచి అమెరికా సైన్యం వెనక్కి వెళ్లిపోవాలి. ఈ ప్రాంతంలో అమెరికా సైనిక స్థావరాలు ఉండడానికి వీల్లేదు.
→ ఇరాన్‌పై అమెరికాతోపాటు యూరప్ దేశాలు విధించిన ఆంక్షలను ఎత్తివేయాలి. యురేనియం శుద్ధి సహా అణు కార్యక్రమాలపై ఎలాంటి ఆంక్షలు విధించకూడదు.
→ స్తంభింపజేసిన మా ఆస్తులను విడుదల చేయాలి.
అమెరికా డిమాండ్లు
→ ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండడానికి ఎంతమాత్రం వీల్లేదు.
→ యురేనియం శుద్ధి ప్రక్రియను ఇరాన్ వెంటనే ఆపాలి. ఇప్పటికే శుద్ధి చేసిన యురేనియం నిల్వలను మాకు అప్పగించాలి.
→ హార్మూజ్ నుంచి స్వేచ్ఛాయుత నౌకాయానానికి వీలు కల్పించాలి. విదేశీ నౌకల రాకపోకలను అడ్డుకోరాదు.
చర్చలు విఫలమైతే కఠినంగా ప్రతిస్పందిస్తాం: ట్రంప్
అమెరికా, ఇరాన్ శాంతి చర్చలు షెడ్యూల్ కంటే ఐదు గంటలు ఆలస్యంగా ఆరంభమయ్యాయి. కొన్ని అంశాలపై ఇరుపక్షాలు పట్టు వీడకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఇస్లామాబాద్ చర్చలు ఎలా సాగుతాయో తనకు ఏమాత్రం అవగాహన లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. చాలా తక్కువ సమయంలోనే ఇరాన్ చిత్తశుద్ధిని అంచనా వేస్తామని చెప్పారు. హార్మూజ్ జలసంధి త్వరలోనే తిరిగి తెరుచుకుంటుందని పునరుద్ఘాటించారు. ప్రత్యామ్నాయ చమురు రవాణా మార్గాలు కూడా అందుబాటులోకి వస్తాయని సంకేతాలిచ్చారు. ఇరాన్‌ను విఫలమవుతున్న దేశంగా అభివరి్ణంచారు. ఒకవేళ శాంతి చర్చలు ఫలించకపోతే తమ వైఖరిని పునఃసమీక్షించుకుంటామని చెప్పారు. అవసరమైతే మరింత కఠినమైన ప్రతిస్పందనకు సిద్ధంగా ఉన్నట్లు హెచ్చరించారు.


