రణ పంచతంత్రం | Ukraine massive drone attack deep inside Russia | Sakshi
Sakshi News home page

రణ పంచతంత్రం

Jun 4 2025 4:48 AM | Updated on Jun 4 2025 4:48 AM

Ukraine massive drone attack deep inside Russia

రష్యాపై ఉక్రెయిన్‌ డ్రోన్‌ల దండు దాడితో మారిన యుద్ధవ్యూహాలు

అగ్రరాజ్యం అమెరికాకు సరిసాటిగా ప్రపంచంలోనే పేరెన్నికగన్న రష్యా గత మూడేళ్లుగా ఉక్రెయిన్‌ను యుద్ధంలో ముచ్చెమటలు పట్టిస్తోంది. యుద్ధం తొలినాళ్లలోనే ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ను వందలాది ట్యాంక్‌లతో చుట్టేసి ఆక్రమించినంత పనిచేసిన రష్యా ఆతర్వాత కాస్తంత వెనుక్కు తగ్గింది. అణ్వాయుధాలు లేని ఉక్రెయిన్‌ ఏనాటికైనా తన ముందు తలవంచక తప్పదన్న రష్యా నిఘా నిర్లక్ష్యం తాజాగా భారీ మూల్యాన్నే చెల్లించుకుంది. ఉక్రెయిన్‌ డ్రోన్ల దండు ‘స్పైడర్‌ వెబ్‌’ పేరుతో చేసిన దాడి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కొత్తతరహా రణతంత్రంగా మార్మోగిపోతోంది.

దీంతో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు యుద్ధవ్యూహాలకు పదునుపెట్టక తప్పదని ఈ ఉదంతం మరోసారి నిరూపించింది. గతంలో యుద్ధట్యాంకులను ఎంత త్వరగా ముందుకు ఉరికిస్తే అంత త్వరగా శత్రుదేశ భూభాగం మన వశం అవుతుందనే భావన ఉండేది. ఇప్పుడు ఎంత మెరుపువేగంతో డ్రోన్లను సరైన లక్ష్యందిశగా పంపితే అంత త్వరగా సమరక్షేత్రంలో జైత్రయాత్ర పూర్తిచేయొచ్చనే వాదన మొదలైంది. ఉక్రెయిన్‌ స్పైడర్‌ వెబ్‌ దాడి ప్రపంచవ్యాప్తంగా ఐదు రకాలుగా రణవ్యూహాలను రాటుదేల్చాల్సిన పరిస్థితిని తీసుకొచ్చిందని యుద్ధరంగ నిపుణులు చెబుతున్నారు. ఆ ఐదింటి గురించి ఓసారి పరిశీలిస్తే..

1. దాడి కంటే వ్యూహం కీలకం
యుద్ధంలో ఎంత బలంగా కొట్టామనేది కాదు. ఎక్కడ ఎప్పుడు ఎలా కొట్టామనేది ముఖ్యం. దాడి కంటే వ్యూహం ప్రధానమని తాజా ఘటన మరోసారి నిరూపించింది. లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం కంటే ముందు.. ముందస్తు ప్రణాళికలో ఎలాంటి పొరపాట్లులేకుండా చూసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు అస్సలు పనికిరావు. రష్యా వైమానికస్థావరాలపై దాడి కోసం తాము దాదాపు ఏడాది, ఏడాదిన్నరకాలంగా వ్యూహరచన చేస్తున్నామని ఆదివారం దాడి తర్వాత ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చెప్పారు. ఖచ్చితమైన దాడి కంటే అత్యంత స్పష్టమైన ప్రణాళిక అనేదే యుద్ధవిజయానికి కీలకం. కొత్త తరహా వ్యూహాన్ని రచించడం, దాని అమలుకు సిబ్బందిని మోహరించడం, దాడి చేయడం, దాడి తర్వాత అక్కడి నుంచి మెరుపువేగంతో అదృశ్యమవడం అనేవి ముఖ్యం.

2. రవాణా మార్గాలు.. రణతంత్ర ఆయుధాలు
యుద్ధంలో సరిహద్దుల వద్దకు క్షిపణులను, భారీ బాంబులను తరలించడానికి స్వదేశంలోని రహదారులనే ఏదేశమైనా ఉపయోగించుకుంటుంది. కానీ ఉక్రెయిన్‌ ఈ దాడిలో రష్యన్‌ రహదారులనూ ఉపయోగించుకుంది. డ్రోన్లను సరిహద్దు దాటించాక ఎవరూ గుర్తుపట్టకుండా చెక్క క్యాబిన్లలో సర్దిపెట్టి వాహనాల్లోకి ఎక్కించారు. తర్వాత వందల కిలోమీటర్ల దూరం వరకు రోడ్డుమార్గంలోనే తీసుకెళ్లారు. సరిహద్దు దాటొచ్చిన డ్రోన్లను ఉక్రెయిన్‌ సమీప ప్రాంతాల్లో ఉపయోగించకుండా ఇలా వందల కిలోమీటర్లు తరలిస్తుందనే రష్యా అధికారులు అస్సలు ఊహించలేదు.

అందుకే సుదూర ప్రాంతాల్లో ఎక్కడా వాహనాల తనిఖీలు జరగలేదు. యుద్ధంవేళ దేశవ్యాప్తంగా భారీ కంటైనర్లను సైతం తనిఖీచేయాలనే కొత్త నిబంధనను ఈ ఉదంతం తెరమీదకు తెస్తోంది. ప్రతీ కంటైనర్‌ను తనిఖీచేస్తే ఇంతటి దాడుల నుంచి ఏ దేశమైనా రక్షణ పొందొచ్చనే కొత్త పాఠాన్ని ఈ దాడి బోధిస్తోంది. రష్యాలో జరిగే అక్రమ సరకు రవాణా మార్గాలను ఉక్రెయిన్‌ తనకు అనుకూలంగా మలుచుకుంది. ఏదైనా దేశంలో జరిగే స్మగ్లింగ్, అక్రమ రవాణా అనేది ఇలాకూడా వైమానికస్థావరాలపై దాడులకు పరోక్షంగా కారణమవుతుందని ఈ ఉదంతం చాటుతోంది.

3. బుల్లి డ్రోన్‌తోనూ భారీ లక్ష్యం బద్దలు!
ఆదివారం రష్యాలో ధ్వంసమైన విమానాలను ఉక్రెయిన్‌ ప్రధాన భూభాగం నుంచి సుదూర ప్రాంతాల్లో నిలిపి ఉంచారు. ఈ విమానాలను ఉక్రెయిన్‌ తన సొంత భూభాగం నుంచి లక్ష్యంగా చేసుకుని దాడిచేయాలంటే దీర్ఘశ్రేణి క్షిపణి కావాలి. ఆ క్షిపణి తయారీకి భారీ స్థాయిలో వ్యయం తప్పదు. సైబీరియా, ఆర్కిటిక్‌ ఖండ సమీప రష్యా వైమానిక స్థావరాలపై దాడి చేయాలంటే అత్యంత సుదూరాలకు ప్రయాణించే బాలిస్టిక్‌ క్షిపణులు అవసరం. కానీ ఇవేం లేకుండానే ఇదే పనిని బుల్లి డ్రోన్లు అత్యంత సులభంగా పూర్తిచేయగలవని తాజా ఘటనతో స్పష్టమైంది. అంటే సుదూర లక్ష్యల ఛేదనకు వందల కోట్ల ఖర్చుతో తయారైన క్షిపణులతో పనిలేదని ఈ ఘటనతో తేలిపోయింది. లక్ష్యం ఎంత దూరంగా ఉందనేది ముఖ్యంకాదు. దానికి ఎంత దగ్గరి నుంచి బద్దలుకొట్టగలం అనేదే ప్రధానం.

4. తక్కువ వ్యయంతో ఎక్కువ నష్టం చేయొచ్చు..
ముల్లును ముల్లుతోనే తీయాలనేది పాత సామెత. యుద్దవిమానాలను కూల్చేయాలంటే మనం కూడా యుద్ధవిమానంతోనో, క్షిపణితోనో దాడి చేసి నాశనంచేయాల్సిన పనిలేదని ఈ దాడి కొత్త విషయాన్ని చెబుతోంది. అత్యంత భారీ వ్యయంతో రూపుదిద్దుకున్న బాంబర్‌ విమానాలను నాశనం చేయడానికి అత్యంత చవకైన డ్రోన్లు ఉంటే చాలు. ఉక్రెయిన్‌ దాడిలో రష్యాకు చెందిన 41 యుద్ధవిమానాలు ధ్వంసమయ్యాయి.

వాటి విలువ ఏకంగా రూ.60,000 కోట్లు ఉంటుందని అంచనా. ఇంతటి శక్తివంతమైన అస్త్రాలను నిర్వీర్యంచేసేందుకు మనం కూడా అంతే స్థాయిలో ఖర్చుచేయాల్సిన పనిలేదని ఈ దాడి ఘటన తేటతెల్లంచేసింది. స్పైడర్స్‌ వెబ్‌ దాడి తర్వాత రణతంత్రాల పాఠాలను తమకూ బోధించాలని కొన్ని మిత్రదేశాలు బతిమాలినట్లు అంతర్జాతీయమీడియాలో కథనాలు వెలవడ్డాయి. అణ్వస్త్ర దేశంకాకపోయినా ఇప్పుడీ దాడితో ఉక్రెయిన్‌ ఒక్కసారిగా వార్‌ హాట్‌ఫేవరెట్‌గా నిలిచింది.

5. మనం మాత్రమే రహస్యం అనుకుంటే సరిపోదు..
రహస్య స్థావరం అనేది రహస్యంగా ఉంటేనే బాగుంటుంది. అందరికీ తెల్సిపోయాక రహస్య స్థావరం అంటే బాగోదు. గగనతల నిఘా నేత్రాలు కొలువైన శాటిలైట్లయుగంలో ప్రతీదీ బహిరంగమే. అందుకే ఫలానా చోట స్థావరం ఉందని తెలిసినా దానిపై దాడి చేయడం అసాధ్యం అనే స్థాయిలో దానికి భద్రత కల్పించడం అవశ్యమని తాజా ఘటనతో నిరూపితమైంది. నిఘా సంస్థ కార్యాలయంలో రహస్యాలు ఎంత భద్రంగా ఉంటాయో, నిఘా సంస్థ పరిసరాలు సైతం అంతే రక్షణాత్మకంగా ఉండాలని తాజా ఘటన చాటింది.

రష్యా ఇంటెలిజెన్స్‌ సంస్థ ఎఫ్‌ఎస్‌బీ ప్రాంతీయ ప్రధాన కార్యాలయం సమీపంలోనే తమ కమాండర్‌సెంటర్‌ను నిర్వహించామని ఉక్రెయిన్‌ ప్రకటించింది. దీంతో శత్రు దేశాలపై నిఘాతోపాటు స్వీయ నిఘాపైనా మరింత దృష్టిపెట్టాల్సిన ఆవశ్యకతను ఈ ఉదంతం గుర్తుచేస్తోంది. అధునాతన ఆయుధాలకంటే అధ్భుతమైన ఆలోచనలే ఆయాదేశాలకు అసలైన అస్త్రాలుగా అక్కరకొస్తాయని స్పైడర్స్‌వెబ్‌ ఘటన ఉద్ఘాటిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement