నీరవ్‌కు లండన్‌ హైకోర్టులో చుక్కెదురు

UK high court rejects Nirav Modi’s appeal against extradition to India - Sakshi

భారత్‌కు అప్పగించాలన్న యూకే నిర్ణయంపై నీరవ్‌ మోదీ ‘అప్పీల్‌’ను తిరస్కరించిన కోర్టు

లండన్‌: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌కు దాదాపు రూ.13,500 కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన కేసులో నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీకి బ్రిటన్‌లోని హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. భారత్‌కు అప్పగించాలన్న బ్రిటన్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్‌చేస్తూ నీరవ్‌ లండన్‌లోని హైకోర్టులో అప్పీల్‌ చేసుకునేందుకు అనుమతించాలంటూ సంబంధిత పత్రాలను సమర్పించారు. ఈ పత్రాలను పరిశీలించిన కోర్టు మంగళవారం తిరస్కరించింది. అయితే, మరో ఐదు రోజుల్లోపు నీరవ్‌ హైకోర్టులో మరోసారి అప్పీల్‌చేసుకునే అవకాశముంది.

భారత్‌లో ఆర్థికనేరాల్లో నిందితుడైన కారణంగా నీరవ్‌ను భారత్‌కు అప్పగించాలంటూ లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు ఫిబ్రవరిలో ఆదేశాలిచ్చింది. నీరవ్‌ భారత్‌లో మనీ ల్యాండరింగ్, నమ్మకద్రోహం తదితర నేరాభియోగాలను ఎదుర్కోవాల్సిందేనని తేల్చిచెప్పింది. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా బ్రిటన్‌ హోం మంత్రి ప్రీతి పటేల్‌.. నీరవ్‌ను భారత్‌కు అప్పగించేందుకు సమ్మతి తెలుపుతూ ఏప్రిల్‌ 15న ఆదేశాలు జారీచేశారు. హోం మంత్రి నిర్ణయాన్ని, వెస్ట్‌మినిస్టర్‌ కోర్టు నిర్ణయాన్ని సవాల్‌ చేసేందుకు అవకాశమివ్వాలంటూ నీరవ్‌ హైకోర్టులో దాఖలుచేసిన ‘అప్పీల్‌’ అనుమతి పత్రాలను కోర్టు మంగళవారం తిరస్కరించిందని హైకోర్టు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.  50ఏళ్ల నీరవ్‌ను 2019 మార్చి 19న అరెస్ట్‌చేసిన యూకే పోలీసులు అతడిని నైరుతి లండన్‌లోని వాండ్స్‌వర్త్‌ జైలులో ఉంచారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top