అమెరికా, ఇరాన్ మధ్య చర్చల విషయమై ఉత్కంఠ నెలకొంది. అసలు చర్యలు జరుగుతాయా? యుద్ధం ముగుస్తుందా? అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో ఇరాన్ నేతలు బయటకు వచ్చి ట్రంప్‌తో చర్చల్లో పాల్గొంటారా? అనేది కూడా తెలియాల్సి ఉంది. మరోవైపు.. ఇరాన్, అమెరికా మధ్య చర్చలను నిర్వహించేందుకు తాము సిద్ధమని పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. అనంతరం, షరీఫ్ పోస్టును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షేర్ చేయడం ఆసక్తిని పెంచింది. అంటే, చర్చలకు పాకిస్తాన్ వేదిక కానుందనే సంగతి దాదాపు ఖాయమైనట్టు తెలుస్తోంది.
అంతకుముందు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ట్విట్టర్ వేదికగా చర్చలను ఉద్దేశించి కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో..‘పశ్చిమాసియా యుద్ధాన్ని ఆపే ఈ సంప్రదింపులను నిర్వహించే అవకాశం పాకిస్తాన్‌కు లభిస్తే మేము.. దానిని ఒక గౌరవంగా భావిస్తాం. అమెరికా, ఇరాన్‌ల వైపు నుంచి ఉమ్మడి అంగీకారం లభిస్తే చర్చలకు మధ్యవర్తిగా వ్యవహరించేందుకు పాక్ సిద్ధంగా ఉంటుంది. ఈ యుద్ధాన్ని ఆపేందుకు, పశ్చిమాసియాలో శాంతి, సుస్థిరతల పరిరక్షణకు ప్రస్తుతం జరుగుతున్న అన్ని ప్రయత్నాలను పాకిస్తాన్ స్వాగతిస్తుందని అంటూ వ్యాఖ్యానించారు. ఆయన చేసిన పోస్టును ట్రంప్ షేర్ చేయడం విశేషం. అంటే, పాకిస్తాన్ వేదికగా చర్చలకు ట్రంప్ సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. అయితే, పాకిస్తాన్‌ను ట్రంప్ ఎందుకు ఎంచుకున్నారనే ప్రశ్నలు వస్తున్నాయి. ట్రంప్ ప్లానేంటి అని కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
ఇదిలా ఉండగా.. రహస్యంగా జరుగుతున్న అమెరికా, ఇరాన్ శాంతి చర్చలకు పాకిస్తాన్, తుర్కియే, ఈజిప్ట్ మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నాయి అంటూ ఇటీవలే మీడియాలో కథనాలు వచ్చాయి. ఇప్పుడు పాక్ ప్రధాని చేసిన ప్రకటన, ఆ కథనాలకు బలం చేకూర్చేలా ఉందని అంతర్జాతీయ వ్యవహారాల పరిశీలకులు అంటున్నారు. అయితే, అంతకుముందే అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలకు వేదికగా పాకిస్థాన్‌ను ఎంపిక చేస్తారంటూ పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలను ప్రచురించాయి. కాగా, ఈ ఊహాగానాలను నమ్మొద్దని, అధికారిక ప్రకటనలు వెలువడే వరకు వేచి చూడాలని మీడియాకు పాక్ విదేశాంగ శాఖ సూచించింది.
Pakistan welcomes and fully supports ongoing efforts to pursue dialogue to end the WAR in Middle East, in the interest of peace and stability in region and beyond. Subject to concurrence by the US and Iran, Pakistan stands ready and honoured to be the host to facilitate…
— Shehbaz Sharif (@CMShehbaz) March 24, 2026


