ఈ రాత్రి వారి పాలిట కాళరాత్రే! వారి నాగరికతను నాశనం చేస్తాం: ట్రంప్
ఇక డెడ్‌లైన్లను పొడిగించేది లేదని వెల్లడి
ఇప్పటిదాకా వాడని ఆయుధాలతో దాడి: వాన్స్
అయినా తగ్గే ప్రసక్తే లేదని బదులిచ్చిన ఇరాన్
కోటిన్నర మందిమి ప్రాణత్యాగాలకు సిద్ధం
ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ప్రకటన
మౌలిక వసతుల చుట్టూ మానవహారాలు!
గల్ఫ్‌లో మారణహోమం తప్పదు: ఐఆర్‌జీసీ
ఖర్గ్ దీవిపై మళ్లీ అమెరికా భారీ దాడులు
50 సైనిక లక్ష్యాలు ధ్వంసమైనట్టు వెల్లడి
8 బ్రిడ్జిలు, రైల్వేస్టేషన్లపై ముమ్మర దాడులు
టెహ్రాన్ విమానాశ్రయంలో భారీగా మంటలు
ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై విరుచుకుపడ్డ ఇరాన్
సౌదీ పారిశ్రామిక నగరం జుబెయిల్‌లో పేలుళ్లు
మంగళవారం రాత్రి 8 (భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 5) గంటలకల్లా మాతో ఒప్పందానికి రావాలి. అప్పటితో మీకిచి్చన గడువు ముగుస్తుంది. తక్షణం హార్మూజ్ జలసంధిని తెరవాలి. లేదంటే ఇరాన్‌ను సమూలంగా తుడిచిపెట్టేస్తాం. ఒక్క రాత్రిలో ఆ దేశమంతటినీ సర్వనాశనం చేస్తాం. ఇదంతా జరగాలని నేనేమీ కోరుకోవట్లేదు. కానీ ఇరాన్ దారికి రాకుంటే జరిగేది అదే!. ఇదే చివరి డెడ్‌లైన్ – ఇరాన్‌ను ఉద్దేశించి ట్రంప్
వాషింగ్టన్/దుబాయ్/టెహ్రాన్/జెరూసలేం: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కనీవిని ఎరగని స్థాయికి చేరాయి. తక్షణం దారికి రాని పక్షంలో ఇరాన్‌ను భస్మీపటలం చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ‘‘మీకిచ్చిన గడువు ముగియనుంది. మంగళవారం రాత్రి 8 (భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 5:30) గంటలకల్లా మాతో ఒప్పందానికి రావాలి. తక్షణం హార్మూజ్ జలసంధిని తెరవడం వంటి చర్యలు తీసుకోవాలి. లేదంటే ఇరాన్‌ను సమూలంగా తుడిచిపెట్టేస్తాం. ఒకే ఒక్క రాత్రిలో ఆ దేశమంతటినీ సర్వనాశనం చేస్తాం. కనీసం జీవం తాలూకు ఆనవాళ్లు కూడా మిగలకుండా వారి నాగరికతనే నాశనం చేస్తాం’’ అంటూ మంగళవారం ఉదయం అల్టిమేటం జారీ చేశారు.
‘‘ఇదంతా జరగాలని నేనేమీ కోరుకోవడం లేదు. కానీ ఇరాన్ దారికి రాకుంటే జరిగేది అదే!’’ అన్నారు. ఇరాన్‌కు విధించిన డెడ్‌లైన్లను ట్రంప్ ఇప్పటికే నాలుగుసార్లు పొడిగించడం తెలిసిందే. ‘‘ఈసారి మాత్రం అలాంటిదేమీ ఉండబోదు. ఇదే చివరి డెడ్‌లైన్’’ అని ఆయన స్పష్టం చేశారు. ట్రూత్ సోషల్‌లో ఈ మేరకు పోస్టులు పెట్టారు. కాసేపటికే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా ఇరాన్‌కు ఘాటు హెచ్చరికలు జారీ చేశారు. వెంటనే సంప్రదింపులకు రాకపోతే యుద్ధంలో ఇప్పటిదాకా వాడని ఆయుధాలను ఇరాన్‌పై ప్రయోగిస్తామని పేర్కొన్నారు! అయితే అమెరికా బెదిరింపులకు లొంగేది లేదని ఇరాన్ కుండబద్దలు కొట్టింది.
ప్రాణాలొడ్డి పోరాడేందుకు తనతో పాటు ఏకంగా 1.4 కోట్ల మంది ఇరానీలు సిద్ధంగా ఉన్నట్టు అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ప్రకటించారు. వారితో పాటు తాను కూడా యుద్ధరంగంలోకి దిగుతానని ఎక్స్ పోస్టులో స్పష్టం చేశారు. ఇరాన్‌పై అమెరికా దుస్సాహసానికి దిగితే గల్ఫ్ అంతటా మారణహోమం సృష్టిస్తామని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ (ఐఆర్‌జీసీ) విభాగం హెచ్చరించింది. అమెరికా, దాని మిత్ర దేశాలకు కొన్నేళ్లపాటు గల్ఫ్ నుంచి చమురు, గ్యాస్ అందకుండా చేస్తామని పేర్కొంది. విద్యుత్కేంద్రాలు, బ్రిడ్జిలను పేల్చేస్తానని ట్రంప్ బెదిరించిన నేపథ్యంలో కీలక మౌలిక వనరులను దాడుల బారినుంచి కాపాడుకునేందుకు వాటి చుట్టూ మానవహారాలుగా ఏర్పడాల్సిందిగా ప్రజలకు ఇరాన్ ప్రభుత్వం పిలుపునిచ్చింది.
యువత, అథ్లెట్లు, కళాకారులు, విద్యార్థులతో సహా అందరూ ముందుకు రావాలని కోరుతూ ప్రభుత్వ ఉన్నతాధికారి అలీరెజా రహీమీ ఓ వీడియో సందేశం విడుదల చేశారు. అంతేగాక బాలల చేతికి కూడా ఆయుధాలిచ్చి యుద్ధ రంగంలోకి పంపేందుకు కూడా ఇరాన్ సిద్ధమవుతున్నట్టు వార్తలొస్తున్నాయి! చెక్‌పాయింట్ల వద్ద పహారాకు ప్రతి ఇంటి నుంచీ పిల్లల్ని పంపాల్సిందిగా ఐఆర్‌జీసీ పిలుపునివ్వడం ఆందోళన కలిగిస్తోంది. ఇరానీలు భారీగా వలస బాట పడుతున్నట్టు వార్తలొస్తున్నాయి. యుద్ధం అత్యంత భీకర రూపు దాల్చవచ్చన్న సంకేతాల నడుమ, ఏం జరగనుందోనని ప్రపంచమంతా ఊపిరి బిగబట్టింది!
నలిపేస్తున్నాం: నెతన్యాహు
టెహ్రాన్, కరాజ్, తబ్రిజ్, కషన్, కోమ్ తదితర నగరాల్లో కనీసం 8కి పైగా బ్రిడ్జిలను తమ యుద్ధ విమానాలు ధ్వంసం చేసినట్టు ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. ‘‘ఐఆర్‌జీసీ వాటిని ఆయుధాల సరఫరాకు వాడుకుంటోంది. అందుకే వాటిని పేల్చేయాలని ఆదేశించా’’ అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తెలిపారు. ఇరాన్‌ను అన్నవిధాలా నలిపేస్తున్నామని చెప్పుకొచ్చారు.
భారీగా ఇరాన్ ప్రతి దాడులు
ఇజ్రాయెల్‌పై ఇరాన్ భారీగా ప్రతి దాడులకు దిగింది. గల్ఫ్ దేశాలపైనా విరుచుకుపడింది. ముఖ్యంగా సౌదీ అరేబియాను లక్ష్యంగా చేసుకుంది. ప్రపంచంలోనే అతి పెద్ద పారిశ్రామిక నగరం జుబెయిల్‌పై డ్రోన్ల వర్షం కురిపించింది. ఆ ప్రాంతమంతా భారీ పేలుళ్లతో దద్దరిల్లిపోతున్న వీడియో వైరల్‌గా మారింది. దాడుల తీవ్ర దృష్ట్యా సౌదీని బహ్రెయిన్‌తో కలిపే కీలకమైన కింగ్ ఫహాద్ వంతెనను తాత్కాలికంగా మూసేశారు.
పౌర సదుపాయాలపై దాడులా?
ఇరాన్‌లో పౌర సదుపాయాలు, ఇంధన వ్యవస్థలపై దాడులు చేస్తామన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనపై అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాటిపై దాడులు అంతర్జాతీయ చట్టాలకు, యుద్ధ నియమాలకు విరుద్ధమని ఐరాసతో పాటు ఫ్రాన్స్ తదితర దేశాలు దుయ్యబట్టాయి.
ఇరాన్‌లో 18 మంది మృతి
ఇరాన్‌పై మంగళవారం అమెరికా, ఇజ్రాయెల్ భారీ స్థాయి దాడులకు దిగాయి. చమురు రవాణాకు ఆయువుపట్టైన ఖర్గ్ ద్వీపంపై అమెరికా మరోసారి విరుచుకుపడింది. కనీసం 50కి సైనిక లక్ష్యాలను వైమానిక దాడుల్లో నేలమట్టం చేసినట్టు వెల్లడించింది. అయితే అక్కడి చమురు నిల్వలు, క్షేత్రాల జోలికి మాత్రం వెళ్లలేదని స్పష్టం చేసింది. రైళ్లు, రైల్వేస్టేషన్లకు దూరంగా ఉండాల్సిందిగా ఇరానీలను తొలుత ఇజ్రాయెల్ హెచ్చరించింది. తర్వాత కాసేపటికే దేశవ్యాప్తంగా బ్రిడ్జిలు, రైల్ నెట్‌వర్కులే లక్ష్యంగా క్షిపణులు, బాంబుల వర్షం కురిసింది.
ఒక రైల్వే బ్రిడ్జి, హైవే బ్రిడ్జితో పాటు పలు రైల్వేస్టేషన్లకు భారీ నష్టం వాటిల్లినట్టు ఇరాన్ వెల్లడించింది. టెహ్రాన్‌లో ఎటు చూసినా పేలుళ్ల శబ్దాలే విన్పించాయి. నగరంలోని మెహ్రాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం పేలుళ్లతో దద్దరిల్లిపోయింది. దాడుల ధాటికి అక్కడ భారీగా మంటలు చెలరేగాయి. పశ్చిమ ఇరాన్‌లోని ఖొర్రమాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపైనా వైమానిక దాడులు జరిగాయి. అల్బోర్జ్ ప్రావిన్స్‌లో జరిగిన దాడుల్లో 18 మంది మృత్యువాత పడ్డట్టు ప్రభుత్వ వార్తా సంస్థ తెలిపింది. 24 మందికి పైగా గాయపడ్డట్టు పేర్కొంది. షిరాజ్‌లోని పెట్రో కెమికల్ ప్లాంట్‌పై దాడులు చేసినట్టు ఇజ్రాయెల్ వెల్లడించింది.
ఇజ్రాయెల్ కాన్సులేట్‌పై దాడి
ఇస్తాంబుల్: టర్కీ
రాజధాని ఇస్తాంబుల్‌లోని ఇజ్రాయెల్ కాన్సులేట్‌పై మంగళవారం ముగ్గురు సాయుధులు దాడికి దిగా రు. కాన్సులేట్ భవనం బయట కాల్పులకు పాల్ప డ్డారు. భద్రతా దళాల ఎదురు కాల్పుల్లో ఒకరు మరణించారు. గాయపడ్డ మిగతా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
అణుదాడికి సంకేతమా?
⇒ ట్రంప్, వాన్స్ హెచ్చరికలపై సర్వత్రా భయాందోళనలు
⇒ ఖండించిన వైట్‌హౌస్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ హెచ్చరికలపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇరాన్‌ను సమూలంగా భస్మీపటలం చేస్తామని ట్రంప్, పశ్చిమాసియా యుద్ధంలో ఇప్పటిదాకా వాడని ఆయుధాలను బయటికి తీస్తామని వాన్స్ పేర్కొనడం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు బహుశా ఇరాన్‌పై అణుదాడికి సంకేతాలే కావచ్చంటున్నారు. గార్డియన్ వంటి వార్తా సంస్థలతో పాటు పలువురు జర్నలిస్టులు కూడా ఈ మేరకు అభిప్రాయాలు వెలిబుచ్చారు. దీనిపై నెటిజన్లు కూడా భారీగా పోస్టులు పెడుతున్నారు. దాంతో ఈ అంశంపై వైట్‌హౌస్ స్పందించింది. అణు దాడి వార్తలను ఖండించింది. ఇలాంటి ప్రచారం చేస్తున్న వారంతా ‘బఫూన్లు’ అంటూ మండిపడింది.
విద్యుత్కేంద్రాలకు దూరంగా ఉండండి
ఇరాన్‌లో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుతున్న నేపథ్యంలో అక్కడి భారతీ యులకు విదేశాంగ శాఖ కీలక సూచనలు చేసింది. ‘‘రెండు రోజుల పాటు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోండి. ముఖ్యంగా విద్యుత్కేంద్రాలు, సైనిక స్థావరాలు, అపార్ట్‌మెంట్ల పై అంతస్తులకు దూరంగా ఉండండి. హైవేలపై ప్రయాణించాల్సి వస్తే భారత దౌత్య కార్యాలయంతో సమన్వయం చేసుకోండి’’ అని సూచించింది. టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం మంగళవారం ఈ మేరకు అడ్వైజరీ జారీ చేసింది.
హార్మూజ్‌పై తీర్మానం వీటో చేసిన రష్యా, చైనా
ఐక్యరాజ్యసమితి: హార్మూజ్ జలసంధిని ఇరాన్ వెంటనే తెరవాలంటూ మంగళవారం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రష్యా, చైనా వీటో చేశాయి. బహ్రెయిన్ పెట్టిన తీర్మానానికి అనుకూలంగా 11, వ్యతిరేకంగా 2 ఓట్లు రాగా రెండు దేశాలు గైర్హాజరయ్యాయి. భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వమున్న రష్యా, చైనా వీటో చేయడంతో తీర్మానం ఆమోదం పొందలేదు. ‘‘నిత్యావసరాల ధరలు, ఇంధన వ్యయాలు ఆకాశాన్నంటుతున్నాయి. ముడి పదార్థాలు, వస్తువుల సరఫరా నిలిచిపోయింది. ఇరాన్ చర్యల వల్ల ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది నిత్యావసర వస్తువులకు అధిక ధరలు చెల్లిస్తున్నారు. హార్మూజ్‌ను తెరిచేందుకు అంతర్జాతీయంగా చర్యలు తీసుకోవాల్సిన సమయం వచి్చంది’’ అంటూ ఓటింగ్‌కు ముందు ఐరాసలోని యూఏఈ ప్రతినిధి ‘ఎక్స్’లో పోస్టు చేశారు.


