హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన గడువు ముగియడానికి ముందే ఇరాన్‌పై దాడులు మొదలైనట్లు కనిపిస్తోంది. ఇరాన్‌లోని అల్యూమినియం ఎక్కువగా ఉత్పత్తి చేసే అరక్ అల్యూమినియం కంపెనీపై ఇజ్రాయెల్-అమెరికా క్షిపణలు.. బుధవారం వేకువజామున దాడి చేశాయి. ఈ విషయాన్ని ఇరాన్ మీడియా ధ్రువీకరించింది. దీంతో సదరు కంపెనీ ఉన్న మాషార్ పరిసర ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 5:30 గంటల (అమెరికాలో మంగళవారం రాత్రి 8 గంటలు) వరకు ఇరాన్‌కి అమెరికా గడువు విధించింది. అప్పటిలోగా హర్మూజ్‌ని తెరవకపోతే ఇరాన్‌లోని వంతెనలు, విద్యుత్ కేంద్రాలని నేలమట్టం చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. తాజాగా ఇరాన్ నాగరికత మొత్తం అంతమైపోతుందని వ్యాఖ్యానించారు. దీనికి ప్రతిస్పందనగా.. అమెరికా, దాని మిత్రదేశాలు తమ దెబ్బ రుచిచూస్తాయని ఇరాన్ పేర్కొంది. ఈ క్రమంలోనే ఈజిప్టు, పాకిస్తాన్, తుర్కియే మధ్యవర్తిత్వంతో ఇరుదేశాల మద్య జరుగుతున్న చర్చలకు ముగింపు పలికింది. శాంతి చర్చల్లో భాగంగా 45 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదన తీసుకురాగా దాన్ని ఇప్పటికే ఇరాన్ తిరస్కరించింది.


