Taliban-Kashmir: కశ్మీర్‌ ముస్లింల హక్కులపై మాట్లాడుతాం!

Taliban claim they have right to speak for Muslims in Kashmir - Sakshi

చైనా మాకు కీలక భాగస్వామి

తాలిబన్ల ప్రేలాపనలు

ఇస్లామాబాద్‌: కశ్మీర్‌ సహా ప్రపంచంలోని ముస్లింల హక్కుల కోసం గళమెత్తుతామని తాలిబన్లు ప్రకటించారు. ఒకపక్క భారత్‌తో సత్సంబంధాలను కోరుకుంటున్నామని, కశ్మీర్‌ విషయంలో జోక్యం చేసుకోమంటూనే కశ్మీర్‌పై తాలిబన్లు కొత్త ప్రేలాపనలు మొదలుబెట్టారు. కశ్మీర్‌ సహా ఎక్కడ నివసించే ముస్లింల హక్కుల కోసమైనా మాట్లాడే హక్కు తమకుందని, అయితే ఏ దేశానికి వ్యతిరేకంగా సాయుధ చర్యలు చేపట్టే విధానం తమకు లేదని తాలిబన్లు వింత భాష్యాలు చెప్పారు. 

అఫ్గాన్‌ తిరిగి తాలిబన్‌ పాలనలోకి పోవడంతో భారత్‌కు ఉగ్రముప్పు పెరిగిందని ఆందోళనలు వ్యక్తమవుతున్న సమయంలో బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాలిబన్‌ ప్రతినిధి సుహైల్‌ షహీన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌ సహా ప్రపంచంలో ఎక్కడ నివసించే ముస్లింల కోసమైనా మాట్లాడే హక్కు సాటి ముస్లింలుగా తమకుందన్నారు.  ఇటీవలే ఖతార్‌లో భారత రాయబారితో భేటీ అయిన తాలిబన్లు..అఫ్గా్గన్‌ గడ్డను ఉగ్రనిలయంగా మార్చమంటూ హామీ ఇచ్చారు. కశ్మీర్‌ భారత అంతర్గత విషయమని, తాము జోక్యం చేసుకోబోమని గతంలో తాలిబన్లు చేసిన ప్రకటనతో తాజా ప్రకటన విభేదిస్తుండడం ఆందోళన కలిగించే అంశమని నిపుణులు భావిస్తున్నారు. అలాగే భారత వ్యతిరేక హక్కానీ నెట్‌వర్క్‌పై సైతం తాలిబన్ల స్వరం మారింది. హక్కానీలపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారాలని సుహైల్‌ తాజా ఇంటర్వ్యూలో చెప్పారు.  
 

పంజ్‌ షీర్‌ తాలిబన్ల వశం!
ఇన్నాళ్లూ తమకు ఎదురు నిలిచిన పంజ్‌ షీర్‌ లోయను సైతం స్వాధీనం చేసుకున్నామని, తద్వారా మొత్తం అఫ్గానిస్తాన్‌పై పూర్తి పట్టు సాధించామని తాలిబన్‌ కమాండర్‌ ఒకరు శుక్రవారం ప్రకటించారు. పంజ్‌ షీర్‌లోని తిరుగుబాటుదారులపై విజయం సాధించామని చెప్పారు.  కీలకమైన పంజ్‌ షీర్‌ తమ వశం కావడంతో రాజధాని కాబూల్‌లో తాలిబన్లు తుపాకులతో గాల్లోకి కాల్పులు జరిపి సంబరాలు చేసుకున్నారు. పంజ్‌ షీర్‌ను ఆక్రమించినట్లు తాలిబన్లు చెబుతున్నప్పటికీ అధికారికంగా ఇది ఇంకా నిర్ధారణ కాలేదు.  

పునర్నిర్మాణానికి చైనా సాయం
చైనా తమకు అత్యంత కీలక భాగస్వామి అని, అఫ్గాన్‌ పునరి్నర్మాణానికి చైనా సాయం తీసుకుంటామని తాలిబన్‌ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్‌ వెల్లడించారు. అఫ్గాన్‌లోని ఖనిజ నిక్షేపాలు వెలికితీసి దేశానికి ఆర్థిక ఆసరా అందించేందుకు చైనా సహాయం అందిస్తుందన్నారు. చైనా ప్రతిపాదిత వన్‌బెల్ట్, వన్‌ రోడ్‌ను సమర్థి్ధస్తున్నామన్నారు.  

కొత్త ప్రభుత్వంపై నేడు ప్రకటన
పెషావర్‌:  అఫ్గానిస్తాన్‌లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై తాలిబన్లు తమ ప్రకటనను ఒకరోజు వాయిదా వేశారు. శనివారం తమ నిర్ణయాన్ని వెల్ల డిస్తామని చెప్పారు.  కొత్త సర్కారు అధినేతగా ముల్లా అబ్దుల్‌ ఘనీ బరాదర్‌ పేరు తెరపైకి వచ్చింది. తాలిబన్‌ ముఠా సహ వ్యవస్థాపకుడైన బరాదర్‌ ప్రస్తుతం దోహాలోని తాలిబన్‌ రాజకీయ కార్యాలయ చైర్మన్‌గా ఉన్నాడు. అఫ్గానిస్తాన్‌ నుంచి సైనిక బలగాల ఉపసంహరణపై గత ఏడాది అమెరికాతో జరిగిన చర్చల్లో కీలకంగా వ్యవహరించాడు.   

ప్రమాదంలో మహిళా జడ్జీలు
కాబూల్‌: తాలిబన్ల రాకతో అఫ్గానిస్తాన్‌లో మహిళా జడ్జీల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. జైళ్లలో శిక్షను అనుభవిస్తున్న పలువురు నేరస్తులను ఇటీవల తాలిబన్లు విడిపించారు. దీంతో తమకు శిక్ష విధించిన మహిళా జడ్జీలపై ప్రతీకారం తీర్చుకోవడానికి వారు ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. జనవరిలోనే తాలిబన్లు ఇద్దరు మహిళా న్యాయమూర్తులను కాల్చి చంపారు. ఇలా ప్రమాదం అంచుల్లో ఉన్న మహిళా జడ్జీల సంఖ్య 250 వరకూ ఉంది. తాలిబన్లు అఫ్గాన్‌ను హస్తగతం చేసుకోగానే కొందరు  దేశాన్ని వదిలి వెళ్లిపోగా  పరిస్థితులు అనుకూలించక కొందరు ఇక్కడే ఉండిపోయారు. ఈ నేపథ్యంలో తాలిబన్లు వారి ఇళ్లకు వెళ్లి తమకు శిక్ష విధించిన మహిళా జడ్జి ఎక్కడ అని ప్రశ్నిస్తున్నట్లు ఇంటర్నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ విమెన్‌ జడ్జెస్‌ (ఐఏడబ్ల్యూజే) సభ్యులు తెలిపారు.

విడుదలతోనే ప్రమాదం..
దోషులను తాలిబన్లు విడుదల చేయడంతోనే అసలు ప్రమాదం ప్రారంభమైందని అఫ్గాన్‌ నుంచి యూరోప్‌కు వెళ్లిన ఓ మహిళా జడ్జి చెప్పారు.   జడ్జిలేగాక సామాజిక కార్యకర్తలైన మహిళలకు సైతం ముప్పు పొంచి ఉందని వివరించారు. ‘మిమ్మల్ని వెంటాడి తీరుతాం’ అని తాలిబన్లు ఇప్పటికే మహిళా పోలీసు ఆఫీసర్లకు సందేశాలు పంపినట్లు వెల్లడించారు.

తమ హక్కులను కాపాడాలంటూ అఫ్గానిస్తాన్‌ రాజధాని కాబూల్‌లో మహిళల ర్యాలీ

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top