SCO Summit 2022: యుద్ధాన్ని ముగించండి

Shanghai Cooperation Organisation: PM Narendra Modi meets Russia President Putin in Sakarmand - Sakshi

పుతిన్‌తో చర్చల్లో మోదీ సూచన

బర్త్‌డే విషెస్‌ చెప్పిన పుతిన్‌

సమకాలీన ప్రపంచంలో యుద్ధాలకు తావు లేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌పై యుద్ధానికి తక్షణం ముగింపు పలకాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు సూచించారు. ఎస్‌ఈఓ సదస్సు సందర్భంగా పుతిన్‌తో మోదీ చర్చలు జరిపారు. చర్చలు, దౌత్యాల ప్రాధాన్యతను నొక్కిచెప్పారు.

‘‘ఆహార, ఇంధన, ఎరువుల సంక్షోభం నేడు వర్ధమాన దేశాలకు అతి పెద్ద సమస్య. వీటికి వెంటనే పరిష్కారం కనిపెట్టేందుకు మీరు కృషి చేయాలి’’ అని పుతిన్‌కు సూచించారు. యుద్ధంపై భారత్‌ వైఖరిని, ఆందోళనను అర్థం చేసుకోగలనని పుతిన్‌ బదులిచ్చారు. దాన్ని వీలైనంత త్వరగా ముగించేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌ యుద్ధం మొదలయ్యాక మోదీ, పుతిన్‌ సమావేశమవడం ఇదే తొలిసారి. చర్చలు అద్భుతంగా సాగాయంటూ మోదీ ట్వీట్‌ చేశారు.

‘‘వర్తకం, ఇంధనం, రక్షణ వంటి పలు రంగల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత పెంచుకోవాలని నిర్ణయించాం. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలూ చర్చకొచ్చాయి’’ అని వివరించారు. రష్యాతో బంధానికి భారత్‌ ఎంతో ప్రాధాన్యమిస్తుందని పునరుద్ఘాటించారు. శనివారంతో 72వ ఏట అడుగు పెడుతున్న మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘రేపు నా ప్రియమిత్రుడు పుట్టిన రోజు జరుపుకోనున్నారు. రష్యా సంప్రదాయంలో ముందుగా శుభాకాంక్షలు చెప్పరు. అయినా మీకు, భారత్‌కు శుభాకాంక్షలు. మీ నేతృత్వంలో భారత్‌ మరింత అభవృద్ధి చెందాలి’’ అని ఆకాంక్షించారు.  గత డిసెంబర్లో తన భారత పర్యటన తాలూకు జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. టర్కీ అధ్యక్షుడు తయ్యిప్‌ ఎర్డోగన్‌తో కూడా మోదీ భేటీ అయ్యారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top