
విసిగిపోయిన భారతీయ విద్యార్థులు
అన్నీ అడ్డ్డంకులూ, అంతరాయాలే!
ఎఫ్–1 వీసాల జారీలో తీవ్ర జాప్యం
దెబ్బకొట్టేసిన ‘ఓపీటీ’ చట్ట ప్రతిపాదనలు
‘ఫాల్’లో 25 శాతం వరకు తగ్గిన ప్రవేశాలు!
వీసా వస్తే వచ్చింది.. పోతే పోయింది
అమెరికాలో ఇది ‘ఆటమ్ / ఫాల్’ అడ్మిషన్‌ల సీజన్. యూనివర్సిటీల ప్రాంగణాలన్నీ అంతర్జాతీయ విద్యార్థులతో కళకళలాడాల్సిన సమయం. కానీ ఈ సెమిస్టర్‌లో (సెప్టెంబర్–అక్టోబర్–నవంబర్) తరగతి గదులు వెలవెలబోనున్నాయి. అందుకు కారణం.. మారిన నిబంధనలు, నిరంతర అంతరాయాలు! విద్యార్థులకు ఇచ్చే ఎఫ్–1 వీసాల ప్రాసెసింగ్ తీరుబడిగా సాగుతోంది. చదువు పూర్తయ్యాక ఉద్యోగం చేయటానికి అనుమతి ఇచ్చే ‘ఓపీటీ’ మార్పులపై అమెరికన్ కాంగ్రెస్ ఇంకా ఏమీ తేల్చలేదు. దీంతో విద్యార్థులు.. ముఖ్యంగా భారతీయ విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఏం చేయాలో తోచడం లేదట. వీసా వస్తే వచ్చింది.. పోతే పోయింది.. ఏదైతే అది జరగనీ అనుకుంటున్నారట. పర్యవసానమే.. ఖాళీగా ఉన్న కాలేజీ సీట్లు.
వీసాల జారీలో జాప్యం, ‘ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్’ (ఓపీటీ) పై అనిశ్చితి కార ణంగా 2025 సెప్టెంబర్–అక్టోబర్–నవంబర్ సెమిస్టర్‌కు గాను, అమెరికన్ విశ్వ విద్యాలయాలలో భారతీయ విద్యార్థుల ప్రవేశాలు 20–25% వరకు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపు నెల రోజుల పాటు స్తంభించిపోయిన యూఎస్ స్టూడెంట్ వీసా నియామకాలు, ఓపీటీల భవిష్యత్తుపై కొనసాగుతున్న అస్పష్టత భారతీయ విద్యా ర్థులను సందిగ్ధంలో ఉంచి, అమెరికన్ విశ్వవిద్యాలయాలలో భారతీయ విద్యార్థుల ప్రవేశాల శాతం పడిపోటానికి దారి తీశాయని ఇండియాలోని ‘స్టడీ–అబ్రాడ్’ కేంద్రాలు చెబుతున్నాయి.
విరామం తొలగినా..!
అమెరికన్ ప్రభుత్వం ఈ ఏడాది మే 27 నుంచి జూన్ 18 వరకు కీలకమైన కాల వ్యవధిలో విద్యార్థి వీసా నియామకాలపై విరామం ఇచ్చింది. వీసా సేవలపై విరామం తొలగి తిరిగి అవి ప్రారంభమైన ప్పటికీ, స్లాట్ లభ్యత పరిమితంగానే ఉంటోంది. దీంతో తమ దరఖాస్తులకు ఎప్పటికి విముక్తి లభిస్తుందో తెలియక భారతీయ విద్యార్థులు అయోమయంలో పడ్డారు.
27 శాతం తగ్గుదల
2025 మార్చి–మే మధ్య జారీ అయిన ఎఫ్–1 విద్యార్థి వీసాలు.. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 27% క్షీణించాయి. ఈ సంవత్సరం మార్చి–మే మధ్య భారతీయ విద్యార్థులు 9,906 ఎఫ్–1 (విద్యా) వీసాలను పొందారు. గత ఏడాది ఇదే కాలంలో 13,478 వీసాలను అందుకున్నారు.
అమెరికాలోని ప్రధాన విశ్వవిద్యాలయాల్లో ఆటమ్ సెమిస్టర్ ప్రవేశాలకు అంతర్జాతీయ విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటారు కనుక సాధారణంగా మే–జూలై మధ్య అత్యధిక సంఖ్యలో ఎఫ్–1 వీసాల ప్రాసెస్ జరుగుతుంది. దాదాపు 70 శాతం అంతర్జాతీయ విద్యార్థి వీసాలు ఈ వ్యవధిలో జారీ అవుతాయి. కానీ ఈ సంఖ్య భారీగా తగ్గిందని సమాచారం.
లేఖ రాయాల్సి వచ్చింది
2025 ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో.. అంటే అక్టోబరు 2024 నుంచి మార్చి 2025 వరకు చూస్తే.. సోషల్ మీడియా వెట్టింగ్, స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూలు నిలుపుదల వంటి చర్యల ఫలితంగా అమెరికా జారీ చేసే మొత్తం ఎఫ్1 వీసాలు భారీగా తగ్గాయి. అంతకుముందు ఏడాది ఇదే సమయంతో పోలిస్తే 15 శాతం తగ్గి, 89,000 వీసాలే జారీ వచ్చాయి. ఇక మనదేశం విషయానికొస్తే. ఏకంగా 44 శాతం తగ్గి, 14,700 జారీ అయ్యా యి.
అయినా విదేశీ విద్యార్థుల సంఖ్యలో మనమే మొదటి స్థానంలో ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జులై 24న అమెరికన్ కాంగ్రెస్ సభ్యుల బృందం ఒకటి వీసా అపా యింట్‌మెంట్లలో జాప్యాన్ని నివారించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరిందట. ఫాల్ సెమిస్టర్‌లో భారత విద్యా ర్థులు క్లాసులకు హాజరవ్వడానికి.. వారికి వీసా ప్రాసెసింగ్‌లో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ఉండేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోందో ఆగస్టు 8 లోగా తెలియజేయాల్సిందిగా వారు కోరారట.
ఎటూ తేలని ఓపీటీ
విద్యానంతరం అంతర్జాతీయ విద్యార్థులు ఉద్యోగాల కోసం అమెరికాలో తాత్కాలికంగా ఉండేందుకు వీలు కల్పించే, అత్యంత ప్రజాదరణ కలిగిన ఆప్షన్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ)కి సంబంధించి యూఎస్ కాంగ్రెస్ ప్రతిపాదనలు నిలిచిపోవటంతో అస్పష్టత ఏర్పడింది. మరోవైపు గత ఏప్రిల్‌లో ప్రతినిధుల సభలో హెచ్.ఆర్. 2315 అనే కొత్త బిల్లును ప్రవేశపెట్టారు. దీని లక్ష్యం ఎఫ్–1 వీసాలపై అంతర్జాతీయ విద్యార్థుల ఓపీటీని తొలగించడం. అదీగాక, గత నెలలోనే కాంగ్రెస్ సభ్యులు 2025 డిగ్నిటీ చట్టాన్ని ప్రవేశపెట్టారు. ఈ చట్టం ఓపీటీ ద్వారా విదేశీ ఉద్యోగులు పొందే ఆదాయాలను అదనపు పన్నుల విధింపు పరిధిలోకి తెస్తుంది.
యూనివర్సిటీలకు నష్టం
ఓపీటీ కీలకమైన ఉద్యోగ అనుభవంగా పనికొస్తుందన్న ఆశతో, చదువు కోసం తీసుకున్న రుణాలను తీర్చుకునే ఏకైక మార్గంగా ఓపీటీపై ఆధారపడి పడిన భారతీయ విద్యార్థులకు.. అమెరికా చట్ట సభల ప్రతిపాదనలు తీవ్ర నిరాశను మిగిల్చాయి. చాలామంది తమ యూఎస్ ప్రణాళికలను వాయిదా వేయడానికి లేదా రద్దు చేసుకోటానికి మొగ్గు చూపుతున్నారు. దీంతో అమెరికన్ విశ్వవిద్యాలయాలలో చేరవలసిన భారతీయ విద్యార్థుల శాతం గణనీయంగా తగ్గింది. అంతర్జాతీయ విద్యార్థులపై అమలవుతున్న ట్రంప్ పరిపాలనా నిర్బంధ విధానాలు అనేక యూఎస్ ఉన్నత విద్యా సంస్థలకు ఆర్థిక నష్టాన్ని కలిగిస్తాయని, తద్వారా విద్యార్థులు నమోదు తగ్గుతుందని ఇటీవలే మూడీస్ రేటింగ్స్ వెల్లడించటం గమనార్హం.
చైనాను దాటేసిన భారత్.. ప్రస్తుతం ఇండియానే యూఎస్ విశ్వవిద్యాలయాలకు అతిపెద్ద మార్కెట్. భారత్ తర్వాతి స్థానాలలో చైనా, దక్షిణ కొరియా ఉన్నాయి. 2024లో భారతదేశం 3,31,602 మంది విద్యార్థులను యూఎస్‌కు పంపింది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 23 శాతం ఎక్కువ.