ఉక్రెయిన్‌పై రష్యా సైన్యం దూకుడు.. చర్చలంటూనే ముట్టడి

Russia-Ukraine War: Russia onslaught continues amid optimism over talks - Sakshi

నగరాలు, పట్టణాలపై క్షిపణుల వర్షం

తక్షణమే సాయం అందించండి

అమెరికాకు జెలెన్‌స్కీ విజ్ఞప్తి

దండయాత్ర విజయవంతం: పుతిన్‌

కీవ్‌/వాషింగ్టన్‌: ఒకవైపు చర్చలు.. మరోవైపు క్షిపణుల మోతలు. ఉక్రెయిన్‌–రష్యా మధ్య ప్రస్తుతం ఇదీ పరిస్థితి. ఉక్రెయిన్‌పై రష్యా బలగాలు విరుచుకుపడుతన్నాయి. దండయాత్ర మొదలై మూడు వారాలవుతున్నా ఇంకా లక్ష్యం పూర్తికాకపోవడంతో అసహనంగా ఉన్న రష్యా సైన్యం దూకుడు పెంచింది. ప్రధానంగా రాజధాని కీవ్‌పై దృష్టి పెట్టింది. కీవ్‌ చుట్టుపక్కల ప్రాంతాలతోపాటు నగరం లోపల సైతం బుధవారం రష్యా బలగాలు నిప్పుల వర్షం కురిపించాయి.

సెంట్రల్‌ కీవ్‌లో 12 అంతస్తుల ఓ అపార్టుమెంట్‌ భవనం మంటల్లో చిక్కుకుంది. చివరి అంతస్తు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రాంతమంతా దట్టమైన పొగలు వ్యాపించాయి. సమీపంలోని భవనం కూడా ధ్వంసమయ్యింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించినట్లు తెలిసింది. కీవ్‌ శివార్లపైనా రష్యా భీకర దాడులు సాగిస్తోంది. బుచాతోపాటు జైటోమిర్‌ పట్టణంపై బాంబులు ప్రయోగించింది.  కీవ్‌కు ఉత్తరంవైపు 80 కిలోమీటర్ల దూరంలోని ఇవాంకివ్‌ నగరాన్ని రష్యా పూర్తిగా స్వాధీనం చేసుకుంది. బెలారస్‌ సరిహద్దుల్లోని ఉక్రెయిన్‌ భూభాగాలపై పట్టు సాధించింది.

రష్యా నావికా దళం మారియుపోల్, ఒడెశా పట్టణాలపై దాడులు జరిపినట్లు ఉక్రెయిన్‌ అధికార వర్గాలు తెలిపాయి. రష్యా సేనలను తమ బలగాలు గట్టిగా ప్రతిఘటిస్తున్నాయని ఉక్రెయిన్‌ అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. రష్యా అధీనంలో ఉన్న ఖేర్సన్‌ ఎయిర్‌పోర్టు, ఎయిర్‌బేస్‌పై తమ సైన్యం దాడి చేసిందని, రష్యా హెలికాప్టర్లు, సైనిక వాహనాలను ధ్వంసం చేసిందని తెలిపింది. రెండో పెద్ద నగరమైన ఖర్కీవ్‌లోకి రష్యా జవాన్లు అడుగుపెట్టకుండా అడ్డుకుంటున్నట్లు వివరించింది. ఉక్రెయిన్‌కు చెందిన 111 ఎయిర్‌క్రాఫ్ట్‌లు, 160 డ్రోన్లు, 1,000కి పైగా మిలటరీ ట్యాంకులతోపాటు ఇతర వాహనాలను తమ సైనికులు ధ్వంసం చేసినట్లు రష్యా రక్షణ శాఖ అధికార ప్రతినిధి ఇగోర్‌ కొనాషెంకోవ్‌ ప్రకటించారు.

► ఉక్రెయిన్‌ నుంచి తమ దేశానికి ఇప్పటిదాకా 47,153 మంది శరణార్థులుగా వచ్చారని, వీరిలో 19,069 మంది మైనర్లు ఉన్నారని ఇటలీ బుధవారం వెల్లడించింది.
► ఉక్రెయిన్‌తో జరుపుతున్న చర్చల్లో.. ఆ దేశ సైన్యానికి తటస్థ హోదా కోసం తాము ఒత్తిడి పెంచుతున్నామని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ చెప్పారు. ఉక్రెయిన్‌ భద్రతకు హామీనిస్తూ అక్కడి సైన్యానికి తటస్థ హోదా ఉండాలని తాము సూచిస్తున్నామని తెలిపారు.  
► ఉక్రెయిన్‌కు సైనిక బలగాలను పంపించే ఉద్దేశం తమకు లేదని నాటో సెక్రెటరీ జనరల్‌ జెన్స్‌ స్టోల్టెన్‌బర్గ్‌ మరోసారి స్పష్టం చేశారు.   
► చెర్నీహివ్‌ నగరంలో ఆహారం కోసం బారులు తీరిన ప్రజలపై రష్యా కాల్పులు జరిపిందని ఉక్రెయిన్‌ అధికారులు ఆరోపించారు. ఈ కాల్పుల్లో 10 మంది పౌరులు మృతిచెందారని తెలిపారు. 
► తమ దేశంలో మరో మేయర్, ఉప మేయర్‌ను రష్యా సైన్యం అపహరించిందని రష్యా విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా ఆరోపించారు.

అమెరికా సాయం వెంటనే కావాలి
రష్యాపై జరుగుతున్న యుద్ధంలో అమెరికా సాయం మరింత కావాలని జెలెన్‌స్కీ కోరారు. తమకు వెంటనే సాయం అందించాలంటూ అమెరికా పార్లమెంట్‌(కాంగ్రెస్‌)కు విన్నవించారు. ఈ మేరకు జెలెన్‌స్కీ విజ్ఞప్తిని అమెరికా పార్లమెంట్‌లో ప్రత్యక్ష ప్రసారం చేశారు.  

మిలటరీ ఆపరేషన్‌ సక్సెస్‌: పుతిన్‌
ఉక్రెయిన్‌లో తమ సైనిక చర్చ విజయవంతమైందని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ అన్నారు. తమ దేశంపై పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలు పూర్తిగా విఫలమయ్యాయని చెప్పారు.  ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యను ‘కౌన్సిల్‌ ఆఫ్‌ యూరప్‌’  ఖండించింది. తమ కౌన్సిల్‌ నుంచి రష్యాను తొలగిస్తున్నట్లు ప్రకటించింది.

ఉక్రెయిన్‌–రష్యా శాంతి ప్రణాళిక!
యుద్ధానికి ముగింపు పలికే దిశగా ఉక్రెయిన్‌–రష్యా దేశాలు శాంతి ప్రణాళికను రూపొందిస్తున్నట్లు ఫైనాన్షియల్‌ టైమ్స్‌ వెల్లడించింది. కాల్పుల విరమణ, ‘నాటో’లో చేరాలన్న ఆకాంక్షలను ఉక్రెయిన్‌ వదులుకుంటే రష్యా దళాలు పూర్తిగా వెనక్కి తగ్గడం, సైనిక బలగాల సంఖ్యను కుదించుకోవడానికి ఉక్రెయిన్‌ అంగీకారం.. వంటివి ఈ ప్రణాళికలో ఉన్నాయని తెలియజేసింది.

యుద్ధం ఆపాలని అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశం
ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ఆపాలని ఐక్యరాజ్య సమితికి చెందిన ఇంటర్నేషనల్‌ కోర్ట్‌ ఆఫ్‌ జస్టిస్‌(ఐసీజే).. రష్యాను ఆదేశించింది. రష్యాపై ఉక్రెయిన్‌ ఐసీజేకు రెండు వారాల క్రితమే ఫిర్యాదు చేయడం తెల్సిందే. ఈ కేసులోనే కోర్టు రష్యాను ఆదేశించింది. ఈ కేసులో ఐసీజేలో భారతీయ న్యాయమూర్తి దల్వీర్‌ భండారీ రష్యాకు వ్యతిరేకంగా ఓటేయడం గమనార్హం.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top