Russia-Ukraine War: ముగిసిన చర్చలు.. అమెరికా కీలక నిర్ణయం

Russia Ukraine War News Live Updates Telugu Day 5 - Sakshi

ముగిసిన చర్చలు.. అమెరికా కీలక నిర్ణయం
► ఉక్రెయిన్‌-రష్యా మధ్య జరిగిన శాంతి చర్చలు ఎటూ తేలకుండా ముగియడంతో ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది. మరోవైపు చర్చల ముగిసిన కాసేపటికే అగ్ర రాజ్యం అమెరికా కీలక ప్రకటన చేసింది. అమెరికా ఎంబసీ సిబ్బంది రష్యాను వీడేందుకు అనుమతిచ్చింది. రష్యాలో ఉన్న అమెరికా పౌరులు సైతం వెంటనే ఆ దేశాన్ని వీడాలని సూచించింది.  కాగా, భద్రతా కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అమెరికా వెల్లడించింది. 

ఐక్యరాజ్యసమితి అత్యవసర సమావేశం

ఉక్రెయిన్‌ సంక్షోభం నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి సాధారణ సభ అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా రష్యా ఉక్రెయిన్ దేశాలు వెంటనే కాల్పులు విరమించుకోవాలని ఐరాస పిలుపునిచ్చింది. ఈ సమావేశంలో రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధంపై చర్చించనున్నారు. యుద్ధంపై  193 దేశాలు తమ అభిప్రాయాన్ని తెలపనున్నాయి.

తగ్గేదేలే.. 36 దేశాల విమానాలపై నిషేధం

► ఇప్పటికే పలు దేశాలు రష్యా పై పలు రకాలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయితే రష్యా మాత్రం వాటికి ఏ మాత్రం బెదరక పోగా తాజాగా బ్రిటన్‌, జర్మనీ, తదితర 36 దేశాలకు చెందిన విమానాలను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. 

ఉక్రెయిన్‌ సంక్షోభంపై ప్రధాని అత్యున్నత స్థాయి సమావేశం

ఉక్రెయిన్‌లో పరిస్థితులు వేగంగా మారుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కాసేపట్లో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో ఉక్రెయిన్‌లోని భారతీయలు తరలింపు ప్రక్రియపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అయితే భారతీయుల తరలింపును మరింత వేగవంతం చేయడంపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

బెలారస్‌లో ముగిసిన చర్చలు 

బెలారస్‌లో ఉక్రెయిన్‌-రష్యా బృందాల మధ్య చర్చలు ముగిశాయి. సుమారు 4 గంటల పాటు ప్రతినిధుల మధ్య ఈ చర్చలు జరిగాయి. ఈ చర‍్చల్లో ఉక్రెయిన్‌ నుంచి ఆరుగురు, రష్యా నుంచి ఐదుగురు ప్రతినిధులు పాల్గొన్నారు. కాగా, యుద్ధాన్ని వెంటనే నిలిపివేయాలని, క్రిమియా నుంచి కూడా బలగాలను తొలగించాలని ఉక్రెయిన్‌ డిమాండ్‌ చేస్తుండగా.. నాటోలో చేరబోమని లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని రష్యా పట్టుబడినట్టు సమాచారం. అయితే, ఇరు వర్గాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన కారణంగా చర్చలు విఫలమైనట్టు తెలుస్తోంది. 
 

ఉక్రెయిన్‌కు మద్దతుగా వైట్‌ హౌస్‌ వద్ద నిరసనలు
► ఉక్రెయిన్‌-రష్యా సంక్షోభం అమెరికా అధ్యక్ష భవనం వైట్‌ హౌస్‌ను తాకింది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు వ్యతిరేకంగా, ఉక్రెయిన్‌కు మద్దతుగా ఆ దేశ జెండాలు పట్టుకుని ఉక్రేనియన్లు నిరసనలు తెలిపారు. తమ స్వదేశానికి మద్దతుగా వాషింగ్టన్ డీసీలోని వైట్ హౌస్ ముందు ర్యాలీ చేశారు. ఈ ర్యాలీలో ఉక్రెయిన్‌లో పుట్టి రష్యాలో పెరిగిన ఓ వ‍్యక్తి కూడా పాల్గొనడం విశేషం. 

స్వదేశం చేరుకున్న 1400 మంది భారతీయులు
► ఉక్రెయిన్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న కారణంగా కేం‍ద్రం భారతీయులను స్వదేశానికి తరలిస్తోంది. కాగా, ఇప్పటి వరకు 6 ప్రత్యేక విమానాల్లో 1400 మంది భారతీయులు స‍్వదేశానికి చేరుకున్నట్టు భారత విదేశాంగ శాఖకు చెందిన అధికారి అరిండమ్‌ బాగ్చీ తెలిపారు. ఆరు విమానాల్లో 4 బూచారెస్ట్‌(రొమేనియా), మరో 2 బుడాపెస్ట్‌(హంగేరీ) నుంచి వచ్చినట్టు పేర్కొన్నారు.   

ఉక్రెయిన్‌కు ఈయూలో సభ్యత్వంపై భిన్నాభిప్రాయాలు: చార్లెస్‌ మిచెల్‌ 
► ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో తమ దేశానికి ఈయూలో సభ్యత్వం ఇవ్వాలని జెలెన్‌ స్కీ అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో యూరోపియన్‌ యూనియన్‌ ఉన్నతాధికారి చార్లెస్‌ మిచెల్‌ స్పందిస్తూ.. ఈయూ కూటమిలో ఉక్రెయిన్‌ చేరడంపై కూటమిలోని 27 దేశాల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయని తెలిపారు. 

ఈయూలో ఉక్రెయిన్‌కు వెంటనే సభ్యత్వం ఇవ్వండి: జెలెన్‌ స్కీ
► ఉక్రెయిన్‌పై రష్యా దాడుల చేస్తున్న వేళ తమ దేశానికి వెంటనే యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ)లో సభ్యత్వం ఇవ్వాలని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అభ్యర్థించారు. యూరోపియన్లందరితో కలిసి ఉండాలనేది తమ లక్ష్యమంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది తమ న్యాయమైన హక్కు అని తాను అనుకుంటున్నానని, ఇది సాధ్యమవుతుందని భావిస్తున్నట్టు జెలెన్‌ స్కీ పేర్కొన్నారు. 

బెలారస్‌లో చర్చలు ప్రారంభం
► బెలారస్‌లో ఉక్రెయిన్‌-రష్యా బృందాల మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. బెలారస్‌లో ఇరు దేశాల విదేశాంగ శాఖ అధికారులు మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఉక్రెయిన్‌.. రష్యా తక్షణమే యుద్ధం విరమించుకోవాలని కోరింది. 

రష్యా దాడుల్లో 102 మంది మృతి : UN
► ఉక్రెయిన్‌లో రష్యా దాడులతో మృత్యుల సంఖ్య పెరుగుతోంది. ఈ దాడుల్లో మొత్తం 102 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని ఐక్యరాజ్యసమితి (UN) సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. వీరిలో ఏడుగురు పిల్లలు కూడా ఉన్నట్టు వెల్లడించారు.

► అహింస ఒక్కటే మార్గం : దలైలామా 
ఉక్రెయిన్‌పై రష్యా మిలిటరీ దాడులపై ఆధ్యాత్మిక నేత దలైలామా స్పందించారు. యుద్ధాలకు కాలం చెల్లిందని, అహింస ఒక్కటే మార్గమని అన్నారు. రెండు దేశాల మధ్య హింసాత్మక ఘటనలు  ప్రపంచాన్ని ప్రభావితం చేస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. మానవులంతా ఒక్కటే అన్న భావాన్ని పెంపొందించుకోవాలని రెండు దేశాలకు సూచించారు.

యుద్ధాన్ని ఆపడానికి పుతిన్‌పై ఒత్తిడి తీసుకురండి: ఇగోర్ పోలిఖా
► ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధాన్ని ఆపడానికి ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై ఒత్తిడి తీసుకురావాలని భారత్‌లో ఉక్రెయిన్‌ రాయబారి డాక్టర్‌ ఇగోర్‌ పోలీఖా తెలిపారు. ఈ క్రమంలో తమ దేశ  విదేశీ భాగస్వాములందరి సాయాన్ని పోలిఖా అభ్యర్థించారు.  

మీ ప్రాణాలు కాపాడుకోండి.. రష్యా సైన్యానికి జెలెన్‌ స్కీ విజ్ఞప్తి
► ఉక్రెయిన్‌పై రష్యా సైనం దాడులు కొనసాగిస్తున్న వేళ జెలెన్‌ స్కీ కీలక వ్యాఖ‍్యలు చేశారు. రష్యా బలగాలను ఉద్దేశించి మీ ప్రాణాలు కాపాడుకోండి.. ఉక్రెయిన్‌కు వదిలివెళ్లిపోండి అంటూ విజ్ఞప్తి చేశారు. 

► బెలారస్‌లోని ఫ్యాపిట్‌ వేదికగా కాసేపట్లో రష్యా-ఉక్రెయిన్‌ మధ్య చర్చలు.. షరతులు లేకుండా ముందుకొచ్చిన రష్యా. మరోవైపు ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న దాడులు.

ఉక్రెయిన్‌కు ఊహించని సాయం!: యుద్ధ సంక్షోభ సమయంలో ఉక్రెయిన్‌కు ఊహించని సాయం అందింది. నాటో దళాలు, ఈయూ దేశాలు పరోక్ష సాయానికి పరిమితమైన వేళ..  యూరప్‌ దేశం లాట్వియా (లాత్వియా) నుంచి ఉక్రెయిన్‌కు ప్రత్యక్ష మద్ధతు లభించింది. ఈ మేరకు సోమవారం పార్లమెంట్‌లో ఓ కీలక తీర్మానం ప్రవేశపెట్టింది. 

ఉక్రెయిన్‌లో ఉన్న లాట్వియా పౌరులు అవసరమైతే యుద్ధంలో ఉక్రెయిన్‌ తరపున పాల్గొనవచ్చని తెలిపింది. ఇందుకోసం పార్లమెంటు సోమవారం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది.  తమ పౌరులు ఉక్రెయిన్‌లో పోరాడేందుకు వీలు కల్పిస్తున్నందుకు గర్వంగా ఉందని పార్లమెంటు ఆ ప్రకటనలో స్పష్టం చేసింది. ‘‘ఉక్రెయిన్‌కు మద్దతివ్వాలనుకునే, ఉక్రెయిన్ స్వాతంత్ర్యం, మా ఉమ్మడి భద్రత కోసం స్వచ్ఛందంగా సేవ చేయాలనుకునే మా పౌరులు తప్పనిసరిగా అలా చేయగలరు" అని పార్లమెంటరీ రక్షణ, హోం వ్యవహారాలు, అవినీతి నిరోధక కమిషన్ ఛైర్మన్ జూరిస్ రాంకానిస్ తరపున ఒక ప్రకటన విడుదల అయ్యింది.

లాట్వియా, బాల్టిక్ పొరుగున ఉన్న ఎస్టోనియా -లిథువేనియాతో కలిసి ఒకప్పుడు రష్యా పాలనలోనే ఉండేవి. రష్యాను భద్రతా ముప్పుగా చాలా కాలంగా చూసింది. చివరికి.. ఉక్రెయిన్ మాదిరిగా కాకుండా,  ఆ మూడు దేశాలు యూరోపియన్ యూనియన్, NATO లో చేరాయి. అయినప్పటికీ ఉక్రెయిన్‌తో లాట్వియాకు మంచి సంబంధాలు ఉన్నాయి.

బెలారస్‌కు చేరిన ఇరు దేశాల విదేశాంగ ప్రతినిధులు. మధ్యాహ్నాం 3గంటలకు చర్చలు మొదలయ్యే అవకాశం.

ఉక్రెయిన్‌ అధ్యక్షుడి కీలక వ్యాఖ్యలు: సోమవారం రష్యా-ఉక్రెయిన్‌ మధ్య జరిగే చర్చలు సానుకూల ఫలితం ఇస్తుందని తాను అనుకోవట్లేదని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ పేర్కొన్నారు. పరిస్థితులు అందుకు ఆశాజనకంగా లేవని కీలక వ్యాఖ్యలు చేశారాయన. చర్చలపై ఆదివారం హైడ్రామా సాగగా.. ఓవైపు రష్యా దళాలను ఎదుర్కొంటూనే చర్చలకు సిద్ధమని ప్రకటించాడాయన. అయితే ఉక్రెయిన్‌ ప్రతిఘటనను రష్యా జీర్ణించుకోలేకపోతోంది. అందుకే దాడులను తీవ్ర తరం చేస్తూనే.. చర్చల ప్రతిపాదనకు ఓకే చెప్పింది. ఈ క్రమంలో ఉక్రెయిన్‌తో పాటు రష్యా తీవ్రంగా నష్టపోతోంది కూడా.

► కీవ్‌లో వారాంతపు కర్ఫ్యూ ఎత్తివేత. విద్యార్థులు పశ్చిమ వైపు ప్రాంతాల రైల్వే స్టేషన్లకు వెళ్లాలని సూచన. అక్కడి నుంచి ప్రత్యేక రైళ్ల ఏర్పాటు చేసిన ఉక్రెయిన్‌ ప్రభుత్వం.

► ఉక్రెయిన్‌కు ఈయూ విమానాలు: రష్యాతో తలపడుతున్న ఉక్రెయిన్‌కు అన్ని వైపుల నుంచి మద్దతు లభిస్తోంది. మూడు వైపుల నుంచి చుట్టుముట్టి దురాక్రమణకు పాల్పడుతున్న రష్యాపై చేతనైనంత మేర పోరాడుతున్న ఉక్రెయిన్‌కు యుద్ధ విమానాలు పంపాలని యూరోపియన్ యూనియన్ దేశాలు నిర్ణయించాయి. ఈ మేరకు కూటమి విదేశాంగ విధాన చీఫ్ జోసెప్ బోరెల్ తెలిపారు. 

► రష్యాకు సౌత్‌ కొరియా షాక్‌: రష్యాను ఆంక్షలతో  ఇరకాటంలో పెడుతున్న పాశ్చాత్య దేశాలకు ఆసియా దేశం దక్షిణ కొరియా తోడైంది. రష్యా ఎగుమతులపై దక్షిణ కొరియా నిషేధం విధించింది.  

వ్యూహాత్మక వస్తువుల ఎగుమతులను నిషేధించడం ద్వారా.. రష్యాకు వ్యతిరేకంగా ఎగుమతి నియంత్రణలను కఠినతరం చేయాలని దక్షిణ కొరియా భావించింది. ఇప్పటికే SWIFT అంతర్జాతీయ చెల్లింపుల వ్యవస్థ నుంచి కొన్ని రష్యన్ బ్యాంకులను సౌత్‌కొరియా బ్యాన్‌ చేసింది.  ఈ మేరకు రాజధాని సియోల్ నుంచి విదేశాంగ మంత్రిత్వ శాఖ సోమవారం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. 

రష్యాకు మద్ధతుగా ఉన్న బెలారస్‌పై ఆంక్షలకు జపాన్‌ సిద్ధమైంది.

► సంచలనం.. పుతిన్‌పై ట్రావెల్‌ బ్యాన్‌: మొండిగా ఉక్రెయిన్‌పై దూసుకెళ్లి.. ఘోర విధ్వంసానికి తెర తీసిన రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు వరుస షాకులు తగులుతున్నాయి. తాజాగా ఆస్ట్రేలియా సంచలన ప్రకటన చేసింది.  ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్, ఆయన సెక్యూరిటీ కౌన్సిల్‌లోని సభ్యులపై ఆస్ట్రేలియా మరిన్ని ఆంక్షలు ప్రకటించింది. వీరందరిపై ఆర్థిక, ప్రయాణ ఆంక్షలు విధిస్తున్నట్టు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ స్వయంగా ప్రకటించారు. 

‘‘మేము రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ఉక్రెయిన్‌పై చేసిన అన్యాయమైన యుద్ధాన్ని ఖండిస్తున్నాం.  ఆర్థిక ఆంక్షలు, ప్రయాణ నిషేధాలు రష్యా అధ్యక్షుడు మరియు రష్యా భద్రతా మండలిలో మిగిలిన శాశ్వత సభ్యులపై గత అర్ధరాత్రి నుంచే మా(ఆస్ట్రేలియా) తరపు నుంచి అమలులోకి వచ్చాయి. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సహా 350 మందికి పైగా రష్యన్ వ్యక్తులపై ఈ ఆంక్షలు వర్తిస్తాయి’’ అని మోరిసన్ చెప్పారు. 

ఇదిలా ఉండగా.. యుద్ధంలోనూ ఆస్ట్రేలియా ఉక్రెయిన్‌కు బాసటగా.. రష్యా దాడిని ఎదుర్కొనేందుకు ప్రాణాంతకమైన సైనిక సామగ్రిని అందజేయనుంది.  అయితే ఆస్ట్రేలియా తాజా ప్రకటనలో.. ఏ మెటీరియల్‌ను పంపుతుందనే దానిపై ఎలాంటి వివరాలు ఇవ్వలేదు. ముట్టడి చేయబడిన ఉక్రెయిన్‌కు మద్దతుగా నాటో ట్రస్ట్ ఫండ్‌..  ప్రాణాంతకం కాని సైనిక పరికరాలు, వైద్య సామాగ్రి, 3 మిలియన్‌ డాలర్ల విరాళాన్ని శుక్రవారం అందించిన విషయం తెలిసిందే. 

► రష్యా దాడుల్లో 350 మందికి  పైగా మా పౌరులు మృతి చెందారు: ఉక్రెయిన్‌ 

► ఆపరేషన్‌ గంగా.. ఐదో విమానం రాక: ఉక్రెయిన్‌ నుంచి భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఆపరేషన్‌ గంగను నిర్వహిస్తోంది భారత్‌.  ఇందులో భాగంగా ఐదో విమానం.. 249 మందితో బుచారెస్ట్‌(రొమేనియా) నుంచి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కి చేరుకుంది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి ప్రయాణికులు కృతజ్ఞతలు తెలిపారు. గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్‌ స్వయంగా  గాంధీనగర్‌ వెళ్లి వంద మంది  విద్యార్థులకు స్వాగతం పలికారు.

బాంబుల మోతతో దద్దరిల్లుతున్న ఉక్రెయిన్‌ రాజధాని నగరం కీవ్‌.. కార్‌కీవ్‌ నగరం

► దాడులను తక్షణమే నిలిపివేయాలి- భారత్‌: భద్రతా మండలిలో రష్యా దాడులకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానం వీగిపోయింది.  వీటో అధికారంతో అడ్డుకుంది రష్యా. దీంతో అగ్రరాజ్యాలు ప్రత్యామ్నాయ చర్యలకు ప్రయత్నిస్తున్నాయి. ఈ సందర్భంగా.. ఉక్రెయిన్‌లోని తమ పౌరుల భద్రతపై భారత్‌ ఆందోళన వ్యక్తం చేస్తోంది. రష్యా దాడులను వెంటనే ఈ మేరకు భద్రతా మండలిలో ప్రకటన విడుదల చేసింది. అయితే భారత్‌ ఓటింగ్‌కు దూరంగా ఉండడంపై పలు దేశాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. 

ఈ 24 గంటలే కీలకం: ఉక్రెయిన్‌ పరిణామాలపై  ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.. యూకే ప్రధాని బోరిస్ జాన్సన్‌తో ఫోన్‌లో సంప్రదింపులు జరిపారు. రాబోయే 24 గంటలు ఉక్రెయిన్‌కు కీలకమని ఈ సందర్భంగా జెలెన్‌స్కీ ప్రస్తావించినట్లు తెలుస్తోంది. 

ఐరాస అత్యవసర భేటీ: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు.. ఇవాళ ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ సమావేశం.  11 దేశాల ఓటింగ్‌తో అత్యవసర భేటీకి తీర్మానం. భారత్‌, చైనా, యూఏఈ దూరం. 

► రెడీగా ఉండండి-పుతిన్‌: ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగి ఇప్పటికే ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అవసరమైతే అణ్వాయుధాల ప్రయోగానికీ సిద్ధమనే సంకేతాలు పంపుతున్నారు. ఏ క్షణంలోనైనా ‘యుద్ధ విధులకు’ దిగేందుకు సర్వ సన్నద్ధంగా ఉండాల్సిందిగా రష్యా అణ్వాయుధ దళాలను పుతిన్‌ ఆదివారం ఆదేశించారు. రక్షణ మంత్రి, ఆర్మీ చీఫ్‌ తదితరులతో ఆయన అత్యున్నత స్థాయి సమావేశం జరిపారు. నాటో దేశాధినేతల దుందుడుకు వ్యాఖ్యలకు, రష్యాపై, తనపై విధించిన కఠినమైన ఆంక్షలకు స్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు. పుతిన్‌ ప్రకటనతో అమెరికా, పాశ్చాత్య దేశాలు కలవరపడుతున్నాయి. వివాదం చివరికి అణు యుద్ధానికి దారితీస్తుందేమోనని భయపడుతున్నాయి. అదే జరిగితే వినాశకర పరిణామాలకు దారి తీస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. 

► అమెరికా ఆందోళన: ఈ వివాదంలో తలదూర్చే దేశాలపై అత్యంత కఠినంగా ప్రతి చర్యకు దిగుతామని యుద్ధానికి దిగిన సందర్భంగా పుతిన్‌ గట్టిగా హెచ్చరించడం తెలిసిందే. రష్యా తిరుగులేని అణు శక్తి అంటూ ఆ సందర్భంగా బెదిరించారు కూడా. ఉక్రెయిన్‌ను ఎలాగైనా ఓడించేందుకు రసాయనిక, జీవ రసాయన ఆయుధాల ప్రయోగానికి కూడా రష్యా దిగినా ఆశ్చర్యం లేదని ఇంగ్లండ్‌ విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రుస్‌ హెచ్చరించడం ప్రాధాన్యం సంతరించుకుంది. తాజా పరిణామాలపై అమెరికా ఆందోళన వెలిబుచ్చింది. యుద్ధోన్మాదాన్ని అస్సలు అంగీకారం కాని స్థాయికి పుతిన్‌ తీసుకెళ్తున్నారని ఐరాసలో అమెరికా రాయబారి లిండా థామస్‌ గ్రీన్‌ఫీల్డ్‌ దుయ్యబట్టారు. ఆయన చర్యలను అత్యంత కఠినంగా ఖండించాల్సిన అవసరముందన్నారు. 

► వామ్మో ‘అణు’మానాలు:  రష్యా, అమెరికా ప్రస్తుతం అతి పెద్ద అణ్వాయుధ దేశాలు. ఇవి రెండూ తమ వ్యూహాత్మక భూతల, జలాంతర్గామి అణ్వాయుధ సంపత్తిని నిరంతరం అప్రమత్తంగా, ఏ క్షణంలోనైనా యుద్ధానికి దిగేందుకు సన్నద్ధంగా ఉంచుతాయి. అయితే అణ్వాయుధాలను మోసుకెళ్లగల బాంబర్లు, యుద్ధ విమానాలు మాత్రం అవసరమనుకున్నప్పుడే రంగంలోకి దిగుతాయి. ఈ సమయంలో పుతిన్‌ గనక తన బాంబర్లు, యుద్ధ విమానాలను అణు దాడికి సన్నద్ధం చేసే పక్షంలో అది విపరిణామాలకే దారి తీయొచ్చు. అమెరికా కూడా అదే మాదిరిగా స్పందించక తప్పని పరిస్థితి తలెత్తుతుందని ఫెడరేసన్‌ ఆఫ్‌ అమెరికన్‌ సైంటిస్ట్స్‌లో న్యూక్లియర్‌ అనలిస్టు హన్స్‌ క్రిస్టెన్సన్‌ అభిప్రాయపడ్డారు. అది అంతర్జాతీయంగా పెను ఉద్రిక్తతలకు దారి తీస్తుందని హెచ్చరించారు.  

► అణు ఆటలొద్దు: ఐఏఈఏ
యుద్ధ నేపథ్యంలో ఉక్రెయిన్‌లోని అణు విద్యుత్‌ కేంద్రాల భద్రతపై అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) ఆందోళన వెలిబుచ్చింది. వాటికి ప్రమాదం కలిగించే చర్యలకు దిగొద్దని రష్యాకు సూచించింది. అలాంటి చర్యలు భారీ ప్రాణ, పర్యావరణ నష్టానికి దారి తీయవచ్చని ఐఏఈఏ డైరెక్టర్‌ జనరల్‌ రాఫెల్‌ మారియానో గ్రోసీ హెచ్చరించారు. వాటివద్ద పరిస్థితి ప్రస్తుతానికి అదుపులోనే ఉన్నట్టు ఉక్రెయిన్‌ నుంచి తమకు సమాచారముందని చెప్పారు. ఉక్రెయిన్‌లో నాలుగు అణు విద్యుత్‌ కేంద్రాలు ఉన్నాయి. వీటిలోని 15 రియాక్టర్లు దేశ విద్యుత్‌ అవసరాల్లో సగం మేరకు తీరుస్తున్నాయి. ఉక్రెయిన్లోని చెర్నోబిల్‌ అణు విద్యుత్కేంద్రాన్ని గురువారం రష్యా స్వాధీనం చేసుకోవడం తెలిసిందే. తాజాగా దానినుంచి కాస్త హెచ్చు స్థాయిలో రేడియో ధార్మికత వెలువడుతోందని ఐఏఈఏ తెలిపింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top