
మాస్కో: భారత్, చైనాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందించారు. రెండు దేశాలే లక్ష్యంగా విధిస్తున్న టారిఫ్‌లు సరికాదని హెచ్చరించారు. ట్రంప్ యంత్రాంగం ఈ రకమైన టారిఫ్‌లతో ఆసియాలోని రెండు అతిపెద్ద దేశాలను అణగదొక్కే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఆర్థికపరమైన ఒత్తిళ్లతో దేశాలను లొంగదీసుకునే ప్రయత్నం చేయడం సరికాదన్నారు.
చైనా మిలటరీ పెరేడ్ తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్ మీడియాతో మాట్లాడుతూ.. భారత్, చైనాలపై అమెరికా చర్యలు సరైనవి కావు. ట్రంప్ నిర్ణయాలు భాగస్వామ్య దేశాలను దూరం చేసుకునేలా ఉన్నాయి. ట్రంప్ పరిపాలన ఆసియాలోని రెండు అతిపెద్ద దేశాలపై ప్రభావం చూపుతోంది. రెండు దేశాలను అణగదొక్కేందుకు.. ఆర్థిక ఒత్తిడిని ఒక సాధనంగా ఉపయోగిస్తున్నారు. భారత్-చైనాలు భాగస్వాములని పేర్కొంటూ.. వీరి మధ్య సంబంధాలను ట్రంప్ బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నారు. అధిక జనాభా కలిగిన భారత్, చైనాలు శక్తిమంతమైన ఆర్థిక వ్యవస్థలు. ఆయా దేశాలకు ప్రత్యేకమైన రాజకీయ వ్యవస్థలు, దేశీయ చట్టాలు ఉన్నాయి.
🚨🇷🇺 'YOU CANNOT TALK TO INDIA OR CHINA LIKE THAT:' Putin on economic pressure against partners
"Attempting to weaken their leadership, built through difficult histories, is a mistake." pic.twitter.com/GsiU3K3mnZ— Sputnik India (@Sputnik_India) September 3, 2025
టారిఫ్‌లతో వారిని శిక్షించే ప్రయత్నాలు చేస్తే.. అవి ఆ దేశ నాయకులను ఇబ్బందులకు గురిచేస్తాయి. ఈ క్రమంలో వారిలో ఎవరైనా బలహీనపడితే.. అతని రాజకీయ జీవితం ముగిసిపోతుంది. ఇరుదేశాల చరిత్రలో వలసవాదం వంటి కష్టతరమైన కాలం నడిచింది. వారి సార్వభౌమాధికారంపై చాలాకాలం పాటు పన్ను విధించారు. ఇప్పుడు వాటన్నింటికీ కాలం చెల్లింది. ఇంకా వాటిని అణగదొక్కేలా మాట్లాడటం సరైనది కాదు. భాగస్వాములతో మాట్లాడేటప్పుడు.. సరైన పదాలు ఉపయోగించాలి’ ట్రంప్‌ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. చివరగా.. ఈ ఉద్రిక్తతలు త్వరలోనే ముగుస్తాయని.. మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఆశాభావం వ్యక్తంచేశారు.
ఇదిలా ఉండగా.. ఇటీవలి కాలంలో అమెరికా, భారత్ మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారన్న కారణంగా ట్రంప్.. భారత్‌ను టార్గెట్ చేసి భారీగా పన్నులు విధించారు. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. కానీ, భారత్ మాత్రం అమెరికా చర్యలకు లొంగలేదు. రష్యాకు మరింత చేరువయ్యే విధంగా చర్యలు తీసుకుంది. ఇదే సమయంలో రష్యా సైతం చమురు విషయంలో భారత్‌కు మరిన్ని ఆఫర్లు ప్రకటించింది.