బకింగ్‌హాం ప్యాలెస్‌ రేసిజం ఉదంతం: నేనూ రేసిజం బాధితున్నే.. రిషి సునాక్‌

Rishi Sunak: I have experienced racism in my life says UK PM - Sakshi

లండన్‌: జాత్యహంకార భూతం తననూ బాధించిందని బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ వెల్లడించారు. భారత మూలాలున్న ఆయన బ్రిటన్లోనే పుట్టి పెరగడం తెలిసిందే. ‘‘బాల్యంలో, పెరిగి పెద్దవుతున్న దశలో నేను రేసిజాన్ని ఎదుర్కొన్నా. అయితే ఈ సామాజిక సమస్యను ఎదుర్కొనే విషయంలో నాటితో పోలిస్తే బ్రిటన్‌ ఇప్పుడు ఎంతో ప్రగతి సాధించింది’’ అని అభిప్రాయపడ్డారు. బకింగ్‌హాం ప్యాలెస్‌లో తాజాగా రేసిజం ఉదంతం వెలుగులోకి రావడం తెలిసిందే.

దివంగత రాణి ఎలిజబెత్‌ 2 సన్నిహితురాలు, ప్రిన్స్‌ విలియం గాడ్‌మదర్‌ లేడీ సుసాన్‌ హసీ ప్యాలెస్‌లో పని చేస్తున్న ఒక ఆఫ్రికన్‌ ఉద్యోగిని పదేపదే ఆమె స్వస్థలం గురించి గుచ్చిగుచ్చి ప్రశ్నించారు. ‘‘నేను బ్రిటిషర్‌నే అని ఎన్నిసార్లు చెప్పినా ఆఫ్రికాలో ఎక్కడి నుంచి వచ్చానంటూ సుసాన్‌ నన్ను పదేపదే నిలదీసింది. నా జుట్టును పక్కకు తోసి మరీ నా నేమ్‌ బ్యాడ్జ్‌ను పట్టి పట్టి చూసింది. ఇది నన్నెంతో బాధించింది’’ అంటూ సదరు ఉద్యోగి ట్వీట్‌ చేయడంతో వివాదం రేగింది.

చివరికి సుసాన్‌ క్షమాపణలు చెబుతూ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇది చాలా బాధపడాల్సిన విషయమని బకింగ్‌హాం ప్యాలెస్‌ పేర్కొంది. జాత్యహంకారానికి బ్రిటిష్‌ సమాజంలో స్థానం లేదంటూ ప్రిన్స్‌ విలియం దంపతులు కూడా ప్రకటన విడుదల చేశారు. ఈ నేపథ్యంలో రిషి మీడియాతో మాట్లాడుతూ తన వ్యక్తిగత అనుభవాన్ని వివరించారు. ‘‘రేసిజం ఎక్కడ కన్పించినా తీవ్రంగా వ్యతిరేకించాల్సిందే. దాన్ని తుదముట్టించే దిశగా చేయాల్సింది ఇంకా ఎంతో ఉంది. గతం నుంచి పాఠాలు నేర్చుకుంటూ మెరుగైన భవిష్యత్తు దిశగా సాగాలి’’ అన్నారు. 

మరిన్ని వార్తలు :

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top