మన లాలాజల గ్రంథులు విష గ్రంథుల్లా మారే అవకాశం?!

Research On Pit Pipe Japan Institute Interesting Facts About Venom - Sakshi

మనమ్‌..వెనమ్‌

పాముకు కోరల్లో విషం ఉంటుంది.. 
తేలుకు తన తోకలో ఉంటుంది.. 
అయితే మనిషికి నిలువెల్లా విషం ఉంటుంది అంటుంటారు.. 

ఇప్పటివరకైతే మనిషి శరీరంలో విషం (వెనమ్‌) ఉన్న ఆనవాళ్లు లేవు కానీ.. సమీప భవిష్యత్తులో పాముల మాదిరిగానే మన లాలాజలంలో విషం ఊరే అవకాశం ఉందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. ఇదీ మానవ పరిణామంలో ఒక భాగమని పరిశోధకులు పేర్కొంటున్నారు. ఈ మేరకు జపాన్‌లోని ఒకినావా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు పిట్‌ వైపర్‌ (రక్త పింజర) పాములపై పరిశోధనలు చేశారు. ఈ పాముల్లోని కోరల్లో విషానికి సంబంధించిన జన్యువుల గురించి తెలుసుకునేందుకు ఈ పరిశోధనలు సాగాయి.

ఈ క్రమంలో నోటిలో విష స్రావాలు వచ్చేందుకు దోహదపడే జన్యువులు.. సరీసృపాల (పాము జాతి)తో పాటు మానవుల్లో కూడా ఉన్నాయని, దీన్నిబట్టి మానవులు కూడా భవిష్యత్తులో విషం కక్కే రోజులు వస్తాయని చెబుతున్నారు. మానవుల లాలాజల గ్రంథులు, పాముల్లోని విష గ్రంథుల అమరిక కణ స్థాయిలో ఒకేరకంగా ఉంటాయని రుజువులు చూపిస్తున్నారు. అందుకే తాము ఈ సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతున్నామని పేర్కొంటున్నారు. విషం అనేది ప్రోటీన్ల మిశ్రమం అని, జంతువులు తమ ఆహారాన్ని కదలకుండా చేసేందుకు, స్వీయ రక్షణ కోసం ఈ ఆయుధాన్ని వాడుతాయని ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న అగ్నీశ్‌ బారువా అనే పరిశోధకుడు వివరించారు.

ఇలాంటి విషం కొన్ని క్షీరదాలతో పాటు జెల్లీఫిష్, తేళ్లు, సాలీళ్లు, పాముల్లో ఉంటుంది. చాలా జంతువులు తమ నోటి ద్వారానే విషం విడుదల చేస్తాయి. విషంలోని ప్రోటీన్ల మిశ్రమం తయారయ్యేందుకు ప్రభావితం చేసే జన్యువుల గురించి గతంలో పరిశోధనలు జరిగాయి. కానీ తాజాగా వివిధ జన్యువులు ఎలా ఒకదానిపై ఒకటి ప్రభావితం చేసుకుంటాయని పరిశోధనలు చేస్తున్నాయి. ‘విషం, విష గ్రంథులు ఆవిర్భవించక ముందు ఉన్న జన్యువులు, విష వ్యవస్థ అభివృద్ధి చెందడానికి సహకరించిన జన్యువుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది’ అని బారువా చెప్పారు. ఇందుకోసం తైవాన్‌కు చెందిన హబు పాముల విషంపై కూడా అధ్యయనం చేశారు. దాదాపు 3 వేల ‘సహకార’ జన్యువులను వీరు గుర్తించారు. 

చాలా జంతువుల్లో గుర్తింపు.. 
ఇలాంటి జన్యువులు మరే జంతువుల్లోనైనా ఉన్నాయా అని పరిశోధకులు వెతికారు. కుక్కలు, చింపాంజీలు, మానవుల వంటి క్షీరదాల్లో వాటి వెర్షన్లలో ఈ జన్యువులు ఉన్నట్లు గుర్తించారు. క్షీరదాల్లోని లాలాజల గ్రంథుల నిర్మాణం, కణాల అమరిక అచ్చు.. పాముల్లోని విష గ్రంథులలాగే ఉన్నట్లు తెలుసుకున్నారు. ఈ రెండు జాతులు కోట్ల సంవత్సరాల కింద వేరు పడటానికి ముందు నుంచీ ఈ గ్రంథులకు సంబంధించి ఒకే మూలాలు కలిగి ఉన్నాయని నమ్ముతున్నారు. పర్యావరణ పరిస్థితులు కనుక మనకు అనుకూలంగా లేకపోతే త్వరలోనే మన లాలాజల గ్రంథులు కాస్తా విష గ్రంథులుగా రూపాంతరం చెందినా ఆశ్చర్యపోనక్కర్లేదు!  
– సాక్షి సెంట్రల్‌ డెస్క్‌
చదవండి: ఈ చెట్టు పిట్టలని చంపుతుంది.. అయినా వాటికి అదే ఇష్టం!
యాంటీ బయోటిక్స్‌ అని వాడితే..‌ చివరికి అవే విషంలా

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top