పాకిస్తాన్‌కు రాజ్‌నాథ్‌ సింగ్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌ | Rajnath Singh Stern Warning To Pak No Indus Water For Terror Patrons | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌కు రాజ్‌నాథ్‌ సింగ్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌

Jun 13 2026 10:47 AM | Updated on Jun 13 2026 11:24 AM

Rajnath Singh Stern Warning To Pak No Indus Water For Terror Patrons

ఉగ్రవాదానికి పాకిస్తాన్ అందిస్తున్న మద్దతును రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారికి సింధు నది నీరు చేరకుండా ఎన్‌డిఎ (NDA) ప్రభుత్వం అడ్డుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.హైదరాబాద్‌లో తెలంగాణ బీజేపీ ఏర్పాటు చేసిన 'మేధావుల సమావేశం'లో  ఆయన ఈ కీలక  వ్యాఖ్యలు చేశారు. 

శాంతి, సామరస్యాల భాష అర్థం కాని వారికి ఎలా సమాధానం చెప్పాలో తమ ప్రభుత్వానికి బాగా తెలుసని 'ఆపరేషన్ సిందూర్' ద్వారా ప్రపంచానికి నిరూపించామని ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాదానికి అండగా నిలిచే వారికి సింధు నదీ జలాలు అంద కుండా చేస్తామని హెచ్చరించారు. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ చేసిన రక్తం, నీరు కలిసి ప్రవహించవు  అన్న హెచ్చరికను రక్షణ మంత్రి ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, సింధు జలాల ఒప్పందాన్ని (IWT) నిలిపివేస్తూ, బాధితుల పట్ల కరుణ చూపనివారికి  తమ నుంచి నీటిని ఆశించకూడదని చెప్పామన్నారు. ఉగ్రవాదులకు అండగా నిలిచేవారికి, మానవాళికే ముప్పుగా ఉన్నవారికి ఈ జలాలు అందకుండా చేస్తామన్నారు.

కాగా సింధు నదీ వ్యవస్థకు చెందిన నదుల జలాల వినియోగానికి సంబంధించి 1960 సెప్టెంబర్ 19న భారత్, పాకిస్థాన్ మధ్య సింధు జలాల ఒప్పందం (IWT) కుదిరింది. అయితే గత ఏడాది జరిగిన దారుణమైన పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, అంతర్జాతీయ చట్టం ప్రకారం సార్వభౌమ దేశంగా తనకున్న హక్కులను వినియోగించుకుంటూ, సరిహద్దు ఉగ్రవాదానికి పాకిస్థాన్ నమ్మదగిన, తిరుగులేని రీతిలో మద్దతు ఉపసంహరించుకునే వరకు భారత్ ఈ ఒప్పందాన్ని నిలిపివేసింది.

అలాగే గత 12 ఏళ్లలో ఎన్డీయే ప్రభుత్వం సాధించిన విజయాల గురించి మాట్లాడుతూ, రక్షణ మంత్రి ఆర్టికల్ 370 రద్దు, దేశాన్ని నక్సల్స్ రహితంగా మార్చడంలో పురోగతి, జీఎస్టీ (GST) అమలు, దేశవ్యాప్త విద్యుదీకరణ మరియు న్యాయ వ్యవస్థలో సంస్కరణలను ప్రస్తావించారు. ఒకప్పుడు ఉగ్రవాదానికి నిలయంగా ఉన్న కాశ్మీర్, ఇప్పుడు పర్యాటకం, పెట్టుబడులు,  ఉపాధి అవకాశాలతో దూసుకుపోతోందని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.శ్రీనగర్‌లోని లాల్ చౌక్ వద్ద త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది, అక్కడ తొలిసారిగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుగుతున్నాయి, మొహర్రం ఊరేగింపులు ప్రశాంతంగా సాగుతున్నాయి, దశాబ్దాలుగా మూతపడి ఉన్న సినిమా హాళ్లు తిరిగి తెరుచుకుంటున్నాయని రాజ్‌నాథ్‌ సింగ్‌ వెల్లడించారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement