తగ్గుతున్న టీకా యాంటీబాడీలు

Pfizer Astra Vaccine Antibody Levels May Decline After 2 to 3 Months - Sakshi

లాన్సెట్‌ జర్నల్‌లో ప్రచురితమైన పరిశోధన వివరాలు

లండన్‌: ఫైజర్, ఆస్ట్రాజెనెకా టీకాల వల్ల ఏర్పడిన యాంటీబాడీలు 10 వారాల్లో 50 శాతానికి పడిపోతున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. రెండు డోసుల వ్యాక్సిన్‌ను తీసుకున్నా యాంటీబాడీలు తగ్గిపోవడం గమనార్హం. యూనివర్సిటీ కాలేజ్‌ లండన్‌ (యూసీఎల్‌) పరిశోధకులు యూకేలో జరిపిన ఈ పరిశోధన వివరాలు లాన్సెట్‌ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. కాలం గడిచేకొద్దీ యాంటీబాడీలు తగ్గిపోతుండడంతో, భవిష్యత్తులో వచ్చే కొత్త వేరియంట్లను ఎదుర్కోవడానికి సమస్యలు ఎదురుకావచ్చనే ఆందోళన వెల్లడవుతోంది.  బూస్టర్‌ డోస్‌తో సానుకూల ఫలితం ఉండవచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు.

ఫైజర్, ఆస్ట్రాజెనెకా (భారత్‌లో కోవిషీల్డ్‌) వ్యాక్సిన్లు తీసుకున్న 600 మందిపై ఈ ప్రయోగం నిర్వహించినట్లు యూసీఎల్‌ పరిశోధకులు తెలిపారు. ఇందులో 18 ఏళ్లు దాటిన అన్నిరకాల గ్రూపులవారు ఉన్నట్లు వెల్లడించారు. వీరిపై చేసిన పరిశోధనలో రోజులు గడిచే కొద్దీ యాంటీబాడీలు తగ్గిపోవడాన్ని గుర్తించారు. ఫైజర్‌ వ్యాక్సిన్‌ విషయంలో.. వ్యాక్సినేషన్‌ జరిగిన 21–41 రోజులకు యాంటీబాడీ లెవెల్స్‌ ప్రతి మిల్లీలీటర్‌కు 7506 యూనిట్లకు తగ్గిపోయాయి. అదే 70 రోజులు దాటే సమయానికి 3320 యూనిట్లకు తగ్గిపోయాయి. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ విషయంలో వ్యాక్సినేషన్‌ జరిగిన 20 రోజుల్లోపు యాంటీబాడీ లెవెల్స్‌ 1201కి తగ్గాయి. 70 రోజులు దాటే సరికి ఆ సంఖ్య 190కి పడిపోయింది. అంటే దాదాపు అయిదు రెట్ల వేగంతో యాంటీబాడీలు తగ్గిపోయాయి. 

కోవిషీల్డ్‌ 93 శాతం రక్షిస్తుంది
కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ కరోనా సోకకుండా 93 శాతం రక్షణ కల్పిస్తుందని కేంద్రం పేర్కొంది.  98 శాతం మరణాలను  తగ్గించినట్లు తాజా పరిశోధనలో తేలిందని నీతి ఆయోగ్‌ సభ్యుడు  వీకే పాల్‌ తెలిపారు. కోవిడ్‌ సెకెండ్‌ వేవ్‌ సమయంలో ఆర్మ్‌›్డ ఫోర్సెస్‌ మెడికల్‌ కాలేజీ  ఆధ్వర్యంలో జరిగిన ఈ వివరాలు వెల్లడయ్యాయని తెలిపారు. దాదాపు 15 లక్షల మంది డాక్టర్లు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లపై జరిగిన పరిశోధనలో ఈ మేరకు ఫలితాలు వచ్చాయని తెలిపారు. కరోనాను ఎదుర్కోవడానికి వ్యాక్సిన్‌ అత్యంత ముఖ్యమని అన్నారు.   

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top