దేశవ్యాప్తంగా ఉచితంగా నెలసరి కిట్‌!

New Zealand Schools Provide Free Sanitary Products To All Students - Sakshi

వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్‌ ప్రధాని జెసిండా ఆర్డెర్న్‌ గురువారం కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో విద్యార్థినిలకు ఉచితంగా నెలసరి కిట్‌ను అందించనున్నట్లు ప్రకటించారు. జూన్‌ నుంచి దశల వారీగా ఈ పంపిణీ ప్రారంభమవుతుందేని పేర్కొన్నారు. పాఠశాలలు, ఇంటర్మీడియట్‌, సెకండరీ స్కూల్స్‌లో ఈ కిట్‌ను ఉచితంగా అందిస్తామని తెలిపారు. కాగా పైలట్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా 15 పాఠశాలల్లోని 3200 మంది విద్యార్థినులకు ఉచితంగా శానిటరీ ప్యాడ్స్‌ సహా మరికొన్ని ఉత్పత్తులను అందించారు. ఇది విజయవంతం కావడంతో వాటిని దేశవ్యాప్తంగా ఫ్రీగా పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు దాదాపు 25 మిలియన్ల న్యూజిలాండ్‌ డాలర్లు ఖర్చు కానున్నాయి.

శానిటరీ న్యాప్‌కిన్ల ధర ఎక్కువగా ఉండటంతో పేద బాలికలు వాటిని కొనలేకపోతున్నారని, దీంతో రుతుక్రమం సమయంలో వారు స్కూలుకు వెళ్లడమే మానేస్తున్నారని ఓ అధ్యయనం పేర్కొంది. దీంతో నెలసరి సమస్యల వల్ల అమ్మాయిలు చదువుకు దూరం కావద్దనే ఈ కొత్త పథకానికి శ్రీకారం చుట్టినట్లు జెసిండా చెప్పుకొచ్చారు. "పీరియడ్‌ పావర్టీ"ని తగ్గించాలనేదే తన లక్ష్యమని తెలిపారు. శానిటరీ కిట్ల ఉచిత పంపిణీ మూడేళ్ల వరకు కొనసాగుతుందని ప్రకటించారు. అయితే ఇలా మహిళల రుతుక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని వారికోసం నెలసరి కిట్లను ఉచితంగా అందించిన తొలి దేశంగా స్కాట్‌లాండ్‌ ఇదివరకే చరిత్రకెక్కింది. నెలసరి సమయంలో మహిళలకు అవసరమయ్యే వస్తువులన్నింటినీ ఉచితంగా అందించాలని స్కాట్‌లాండ్‌ ప్రభుత్వం నిర్ణయించడమే కాక గతేడాది నవంబర్‌ నుంచే దాన్ని అమల్లోకి తెచ్చింది.

చదవండి: త్వరలోనే పెళ్లి చేసుకోనున్న ప్రధాని జెసిండా!

వైరల్‌: వంటకు సాయం చేస్తున్న కోతి!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top