నేపాల్‌లో భయానకం.. మంత్రులు, కుటుంబాలే టార్గెట్‌ | Nepal Ministers And Family Cling To Chopper Rope To Flee Protests, Watch Video Inside Goes Viral | Sakshi
Sakshi News home page

నేపాల్‌లో భయానకం.. మంత్రులు, కుటుంబాలే టార్గెట్‌

Sep 11 2025 7:42 AM | Updated on Sep 11 2025 9:17 AM

Nepal Ministers And Family Cling To Chopper Rope To Flee Protests

ఖాట్మాండు: నేపాల్‌లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేపాల్‌లో ‘జన్ జి’ పేరుతో యువతరం చేపట్టిన ఆందోళనలు పీక్‌ స్టేజ్‌కు చేరుకున్నాయి. యువత ఆందోళనలు చివరకు హింసకు దారితీశాయి. సహనం కోల్పోయిన నిరసనకారులు, పాలకులను తరిమి తరిమికొట్టారు. ఈ క్రమంలో నేపాల్‌కు చెందిన ఓ మంత్రి, ఆయన కుటుంబ సభ్యులు.. తమ ప్రాణాలను అరచేతిలో పట్టుకుని హెలికాప్టర్‌లో తప్పించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

వివరాల ప్రకారం.. నేపాల్‌లో సోషల్‌ మీడియాపై బ్యాన్‌ అనంతరం దారుణ పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. నేపాల్‌ రాజధాని ఖాట్మాండులో నిరసనకారులు రెచ్చిపోయారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన యువత.. మంత్రులు, ప్రభుత్వ అధికారుల ఇళ్లను ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా నేపాల్‌ పార్లమెంట్‌ భవనానికి నిప్పంటించారు. డిప్యూటీ పీఎం ఆర్థిక మంత్రి బిష్ణు పౌడెల్ నివాసంపై రాళ్లు రువ్వారు. నేపాల్ ఆర్థిక మంత్రిని వీధిలో నిరసనకారులు వెంబడిస్తుంటే.. ఎదురుగా వచ్చిన ఓ యువకుడు ఆయనను ఎగిరి తన్నుతున్న దృశ్యాలు, విదేశాంగ మంత్రి అర్జు రాణా దేవ్‌బా, ఆమె భర్త, మాజీ ప్రధాని, నేపాలి కాంగ్రెస్ చీఫ్ షేర్ బహదూర్ దేవ్‌బాలను ఇంట్లోనే దాడి చేసిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.

మరోవైపు..మాజీ ప్రధాని దేవ్‌బా ముఖానికి రక్తమోడుతూ నిస్సహాయంగా కూర్చున్న దృశ్యం కనిపించింది. తరువాత అధికారులు అక్కడకు చేరుకొని ఆయనను రక్షించారు. ఖాట్మాండు హోటల్‌పై ఎగురుతున్న హెలికాప్టర్‌లో అధికారులను తరలిస్తున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. సైన్యానికి చెందిన హెలికాప్టర్లు కొంతమంది మంత్రులు, వారి కుటుంబాలను సురక్షిత ప్రదేశాలకు తరలించగలిగాయి. పలువురు మంత్రులు హెలికాప్టర్‌ సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు.

ఇదిలా ఉండగా.. నేపాల్‌లో ఆందోళనలు, అల్లర్లు జైళ్లకు సైతం వ్యాపించాయి. జైళ్లలో నిప్పుపెట్టి, భద్రతా సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేసి దేశవ్యాప్తంగా ఆయా జైళ్ల నుంచి దాదాపు 7,000 మంది ఖైదీలు పరారయ్యారు. హోం మంత్రిత్వ శాఖ వర్గాల సమాచారం ప్రకారం ఢిల్లీ బజార్ జైలు నుంచి 1,100 మంది, చిత్వన్-700, నక్కు-1,200, సున్సారి జిల్లా జుంప్కా జైలు-1,575.. కంచన్‌పూర్-450, కైలాలి-612, జలేశ్వర్-576, కాస్కి-773, డాంగ్-124, జుమ్లా-36, సొలుఖుంబు-86, గౌర్-260, బజ్హాంగ్ జైలు నుంచి 65 తప్పించుకున్నారు. మరోవైపు.. నేపాల్‌లో కల్లోల పరిస్థితులను చక్కదిద్దడానికి సైన్యం రంగంలోకి దిగింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని సైన్యం ఆదేశించింది. అల్లర్లతో అస్తవ్యస్తమైన నగరంలో శాంతి నెలకొల్పేందుకు సైన్యం కృషి చేస్తోంది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement