టైమ్‌ అత్యంత ప్రభావశీల వ్యక్తుల జాబితాలో మోదీ, మమతా బెనర్జీ

Narendra Modi, Mamata Banerjee Is On 2021 TIME 100 List - Sakshi

న్యూయార్క్‌: ప్రఖ్యాత ‘టైమ్‌’ మ్యాగజైన్‌ 2021వ సంవత్సరానికి గాను బుధవారం విడుదల చేసిన ‘ప్రపంచంలోని 100 మంది అత్యంత ప్రభావశీల వ్యక్తుల’ జాబితాలో భారత్‌ నుంచి ముగ్గురికి స్థానం లభించింది. ప్రధాని మోదీ, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, సీరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సీఈఓ అదర్‌ పూనావాలా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, ప్రిన్స్‌ హ్యారీ–మెఘన్‌ మెర్కెల్‌ దంపతులు, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్, తాలిబన్‌ ముఠా సహ వ్యవస్థాపకుడు, అఫ్గానిస్తాన్‌ ఉప ప్రధాని ముల్లా అబ్దుల్‌ బరాదర్‌ తదితరుల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.

74 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిరా గాంధీ తర్వాత మూడవ కీలకమైన నాయకుడు నరేంద్ర మోదీ అని టైమ్‌ పత్రిక ప్రొఫైల్‌లో పేర్కొంది. ఈ ప్రొఫైల్‌ను సీఎన్‌ఎన్‌ జర్నలిస్టు ఫరీద్‌ జకారియా రాశారు. భారతదేశాన్ని నరేంద్ర మోదీ లౌకికవాదం నుంచి హిందూ జాతీయవాదం వైపు నెడుతున్నారని విమర్శలు గుప్పించారు. దేశంలోని ముస్లిం మైనార్టీల హక్కులను హరిస్తున్నారని, అమాయక జర్నలిస్టులను జైళ్లలో పెడుతున్నారని ఆరోపించారు.

టైమ్‌ అత్యంత ప్రభావశీల వ్యక్తుల జాబితాలో టెన్నిస్‌ ప్లేయర్‌ నవోమీ ఒసాకా, రష్యా ఉద్యమకారుడు అలెక్సీ నావల్నీ, గాయకురాలు బ్రిట్నీ స్పియర్స్, ఆపిల్‌ కంపెనీ సీఈఓ టిమ్‌ కుక్, హాలీవుడ్‌ నటీమణి కేట్‌ విన్‌స్లెట్, ఆసియన్‌ పసిఫిక్‌ పాలసీ అండ్‌ ప్లానింగ్‌ కౌన్సిల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ మంజూష పి.కులకర్ణి తదితరులు చోటు దక్కించుకున్నారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top