గేట్స్‌ దంపతులు విడిపోవడానికి కారణం ‘అతడేనట’..

Melinda Marriage With Bill Gates Broken Due To Jeffrey Epstein - Sakshi

రెండేళ్ల నుంచి కొనసాగతున్న విడాకుల ప్రక్రియ

లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్స్టీన్‌తో బిల్‌గేట్స్‌ డీలింగ్‌

సంచలన విషయాలు వెల్లడించిన వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌

వాషింగ్టన్‌: మైక్రోసాఫ్ట్‌ కో ఫౌండర్‌, బిలయనీర్‌ బిల్‌ గేట్స్‌ తన భార్యతో విడిపోతున్నట్లు ప్రకటించి షాకిచ్చిన సంగతి తెలిసిందే. 27 ఏళ్ల తమ వైవాహిక జీవితానికి ముగింపు పలకనున్నట్లు గేట్స్‌ దంపతులు ప్రకటించారు. ఈ క్రమంలో వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ సంచలన విషయాలు వెల్లడించింది. 2019 నుంచే వీరి విడాకుల ప్రక్రియ ప్రారంభమైనట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి మెలిందా 2019లోనే న్యాయవాదులను కలిసి చర్చించారని వాల్‌ స్ట్రీట్‌ రాసుకొచ్చింది 

వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ నివేదిక ప్రకారం, మెలిందా అక్టోబర్, 2019 నాటికి అనేక సంస్థలకు చెందిన న్యాయవాదులతో విడాకుల గురించి చర్చించారని.. వారి వైవాహిక జీవితం “అతకలేని విధంగా విచ్ఛిన్నమైందని” మెలిందా వారికి తెలిపినట్లు వాల్‌ స్ట్రీట్‌ వెల్లడించింది. గతేడాది కోవిడ్‌ సమయంలోనే వీరి విడాకుల గురించి చర్చలు జరిగాయని.. వారి సంపద 145 బిలియన్‌ డాలర్లను విభజించడానికి న్యాయవాదుల బృందం మధ్యవర్తిత్వం చేసిందని వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ రాసుకొచ్చింది. 

ఓ లైంగిక నేరస్థుడితో గేట్స్‌కు ఉన్న డీలింగ్‌ వల్లే మెలిందా భర్త నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు వాల్‌స్ట్రీట్‌ పేర్కొంది. అతడు ఎవరంటే జెఫ్రీన్‌ ఎప్స్టీన్‌. ఎప్స్టీన్‌తో బిల్‌ గేట్స్‌కు ఉన్న సంబంధాల గురించి తెలిసినప్పటి నుంచి మెలిందా చాలా బాధపడ్డారని నివేదిక పేర్కొంది. 2013 నుంచి బిల్‌గేట్స్‌, ఎప్స్టీన్‌తో డీలింగ్స్‌ కలిగి ఉన్నట్లు వాల్‌ స్ట్రీట్‌ రాసుకొచ్చింది. 

గత సంవత్సరం న్యూయార్క్ టైమ్స్ నివేదిక కూడా మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు జెఫ్రీ ఎప్స్టీన్‌ను చాలాసార్లు కలుసుకున్నారని, అతని న్యూయార్క్ టౌన్‌హౌస్‌లోనే గేట్స్‌ చాలా సమయం గడిపేవారని తెలిపింది. ఈ వార్తలపై బిల్ గేట్స్ అధికార ప్రతినిధి ఒకరు స్పందిస్తూ.. గేట్స్‌, ఎప్స్టీన్ మధ్య సమావేశాలు దాతృత్వంపై దృష్టి సారించాయని తెలిపారు.

ఎవరీ జెఫ్రీ ఎప్స్టీన్..
జెఫ్రీ ఎడ్వర్డ్ ఎప్స్టీన్ ఒక అమెరికన్ ఆర్థికవేత్త. అతను లైంగిక వేధింపులకు, దాడులకు పాల్పడ్డాడు. అతనిపై సెక్స్ కోసం తక్కువ వయస్సు గల అమ్మాయిలతో విస్తారమైన నెట్‌వర్క్‌ను నడుపుతున్నాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. లైంగిక అక్రమ రవాణాకు సంబంధించిన సమాఖ్య ఆరోపణలపై విచారణ కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఎప్స్టీన్ 2019 ఆగస్టులో 66 సంవత్సరాల వయసులో జైలులో మరణించాడు.

చదవండి: గేట్స్‌ గుండె తలుపులు తట్టిందెవరు?

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top