‘స్పీకర్‌ను ఎన్నుకోలేకపోవడం సిగ్గుచేటు’.. రిపబ్లికన్లపై బైడెన్‌ విమర్శలు!

Joe Biden Slams Republicans As They Fail To Elect New Speaker - Sakshi

వాషింగ్టన్‌: అమెరికా కాంగ్రెస్‌(పార్లమెంట్‌)లో దిగువ సభ అయిన ప్రతినిధుల సభ(హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌)లో ప్రతిపక్ష రిపబ్లికన్‌ పార్టీదే మెజారిటీ. అయినప్పటికీ స్పీకర్‌ ఎన్నికలో ఆ పార్టీ అభ్యర్థి నెగ్గలేకపోయారు. నూతన సభ మంగళవారం కొలువుదీరింది. తొలిరోజు సభాపతి(స్పీకర్‌) ఎన్నిక నిర్వహించినా స్పీకర్‌ను ఎన్నుకోలేకపోయారు రిపబ్లికన్లు. ఈ క్రమంలో ఘాటుగా స్పందించారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌. ప్రతినిధుల సభ స్పీకర్‌ను ఎన్నికోలేకపోయిన రిపబ్లికన్ల తీరు సిగ్గు చేటుగా పేర్కొన్నారు. యావత్‌ ప్రపంచం మొత్తం మనల్ని చూస్తోందని గుర్తు చేశారు. కెంటకీ బయలుదేరే ముందు విలేకరులతో మాట్లాడారు బైడెన్‌.

‘స్పీకర్‌ను ఎన్నుకోలేకపోవటం సిగ్గుచేటు, ఇబ్బందికరం. వారు ప్రవర్తిస్తున్న తీరును చూస్తే ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు చాలా సమయం పట్టేలా కనిపిస్తోంది. యావత్‌ ప్రపంచం మొత్తం మనల్ని చూస్తోంది. మనం కలిసి పని చేయగలమా అనే సందేహంలో ఉన్నారు.’ అని పేర్కొన్నారు అధ్యక్షుడు జో బైడెన్‌. 

హైడ్రామా..
రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిగా పోటీకి దిగిన కెవిన్‌ మెక్‌కార్తీ మెజారిటీ ఓట్లు కూడగట్టడంలో విఫలమయ్యారు. మంగళవారం రాత్రంతా సభలో హెడ్రామా చోటు చేసుకుంది. మూడు రౌండ్లు ఓటింగ్‌ నిర్వహించారు. స్పీకర్‌గా నెగ్గడానికి 218 ఓట్లు అవసరం కాగా, మెక్‌కార్తీకి తొలి రెండు రౌండ్లలో 203 ఓట్ల చొప్పున, మూడో రౌండ్‌లో 202 ఓట్లు వచ్చాయి. దీంతో తదుపరి ఓటింగ్‌కు స్థానిక కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నానికి వాయిదా వేశారు. స్పీకర్‌ లేకుండానే సభ వాయిదా పడింది. అమెరికా చరిత్రలో 1923 నుంచి చూస్తే ప్రతినిధుల సభలో తొలి రోజు స్పీకర్‌ను ఎన్నుకోలేకపోవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

ఇదీ చదవండి: రిపబ్లికన్‌ అభ్యర్థి మెక్‌కార్తీకి ఎదురుదెబ్బ

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top