రిపబ్లికన్‌ అభ్యర్థి మెక్‌కార్తీకి ఎదురుదెబ్బ

McCarthy loses three rounds of vote for US speaker - Sakshi

అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ ఎన్నికలో విపక్షానికి పరాభవం

మూడు రౌండ్ల ఓటింగ్‌లో లభించని మెజార్టీ

తొలిరోజు స్పీకర్‌ను ఎన్నుకోలేకపోవడం గత వందేళ్లలో ఇదే తొలిసారి

వాషింగ్టన్‌: అమెరికా కాంగ్రెస్‌(పార్లమెంట్‌)లో దిగువ సభ అయిన ప్రతినిధుల సభ(హౌజ్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌)లో ప్రతిపక్ష రిపబ్లికన్‌ పార్టీదే మెజార్టీ. అయినప్పటికీ స్పీకర్‌ ఎన్నికలో ఆ పార్టీ అభ్యర్థి నెగ్గలేకపోయారు. నూతన సభ మంగళవారం కొలువుదీరింది. తొలిరోజు సభాపతి (స్పీకర్‌) ఎన్నిక నిర్వహించారు. రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిగా పోటీకి దిగిన కెవిన్‌ మెక్‌కార్తీ మెజార్టీ ఓట్లు కూడగట్టడంలో విఫలమమ్యారు.

మంగళవారం రాత్రంతా సభలో హైడ్రామా చోటుచేసుకుంది. మూడు రౌండ్లు ఓటింగ్‌ నిర్వహించారు. స్పీకర్‌గా నెగ్గడానికి 218 ఓట్లు అవసరం కాగా, మెక్‌కార్తీకి తొలి రెండు రౌండ్లలో 203 ఓట్ల చొప్పున, మూడో రౌండ్‌లో 202 ఓట్లు వచ్చాయి. దీంతో తదుపరి ఓటింగ్‌ను స్థానిక కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నానికి వాయిదా వేశారు. స్పీకర్‌ లేకుండానే సభ వాయిదా పడింది. అమెరికా చరిత్రలో 1923 నుంచి చూస్తే ప్రతినిధుల సభలో తొలి రోజు స్పీకర్‌ను ఎన్నుకోలేకపోవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. మెక్‌కార్తీ ఇక ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. కొత్త స్పీకర్‌ ఎన్నికయ్యే దాకా సభలో ఓటింగ్‌ నిర్వహిస్తారు. 

మెక్‌కార్తీకి వ్యక్తిగతంగా, రాజకీయంగా చాలామంది ప్రత్యర్థులు ఉన్నారని రిపబ్లికన్‌ ముఖ్యనేత ఒకరు చెప్పారు. ఆయన స్పీకర్‌గా ఎన్నిక కావడం సొంత పార్టీలోనే కొందరికి ఇష్టం లేదన్నారు. మెక్‌కార్తీ స్పీకర్‌ కావడం కష్టమేనని రిపబ్లికన్‌ సభ్యుడు బాబ్‌గుడ్‌ వ్యాఖ్యానించారు. స్పీకర్‌ లేకుండా సభ సంపూర్ణం కాదు. నూతన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించడం, కమిటీలకు చైర్మన్లను నియమించడం, సభా కార్యకలాపాలు నిర్వహించడం వంటివి స్పీకర్‌ బాధ్యతలే. మెజారిటీ ఉన్నా సొంత పార్టీ అభ్యర్థి స్పీకర్‌గా నెగ్గకపోవడం విపక్షానికి చేదు అనుభవమేనని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top