
హాజరుకానున్న 26 దేశాల అధినేతలు
10 వేల మంది సిబ్బందితో కవాతు
తాజా ఆయుధాలను ప్రదర్శించనున్న చైనా
బీజింగ్: సెప్టెంబర్ 3న బీజింగ్‌లో జరగనున్న చైనా సైనిక కవాతుకు రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ హాజరవుతారని చైనా తెలిపింది. ఇదొక చారిత్రక పర్యటన అవుతుందని చైనా విదేశాంగ శాఖ గురువారం విలేకరుల సమావేశంలో ప్రకటించింది. ఇది కిమ్ మొట్టమొదటి పాక్షిక అంతర్జాతీయ సమావేశం కాగా, కొత్త ప్రపంచ క్రమం కోసం ప్రయత్నిస్తున్న చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు ఇది దౌత్య విజయంగా మారింది. ఉత్తరకొరియా– చైనాలది దశాబ్దాల స్నేహమని, ప్రాంతీయ శాంతి, స్థిరత్వం కోసం రెండు దేశాలు పరస్పరం సహకరించుకుంటూనే ఉంటాయని తెలిపింది.
కవాతుకు 26 మంది దేశాధినేతలు..
రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ లొంగిపోయి 80 ఏళ్లవుతుండగా.. ఆ సంఘర్షణ ముగిసిన సందర్భంగా చైనా ‘విక్టరీ డే’కవాతును నిర్వహిస్తోంది. వందలాది యుద్ధ విమానాలు, ట్యాంకులు, యాంటీ–డ్రోన్ వ్యవస్థలతో సహా తన తాజా ఆయుధాలను చైనా ప్రదర్శించే అవకాశం ఉంది. దాని సైన్యం కొత్త దళ నిర్మాణాన్ని పూర్తిగా కవాతులో ప్రదర్శించడం ఇదే మొదటిసారి. ఈ కార్యక్రమంలో పదివేల మంది సైనిక సిబ్బంది చారిత్రాత్మక టియానన్మెన్ స్క్వేర్ గుండా కవాతు చేస్తారు. చైనా సైన్యంలోని 45 స్థాయిల సైనికులు, యుద్ధ అనుభవజు్ఞలు కూడా ఇందులో పాల్గొంటారు. ఈ కవాతుకు హాజరు కానున్న 26 మంది దేశాధినేతల్లో పుతిన్, కిమ్ కూడా ఉంటారు.
జిన్‌పింగ్ ఆహ్వానాన్ని దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే–మ్యుంగ్ తిరస్కరించారు. ఆయన స్థానంలో జాతీయ అసెంబ్లీ స్పీకర్ కిమ్ జిన్–ప్యోను హాజరు కానున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని వ్యతిరేకిస్తున్న చాలా పాశ్చాత్య దేశాలు నాయకులు కవాతుకు హాజరు కావడం లేదు. ఇండోనేషియా అధ్యక్షుడు, మలేషియా ప్రధాన మంత్రి, మయన్మార్ సైనిక పాలకుడు, యురోపియన్ యూనియన్ నాయకుడు, స్లోవాక్ ప్రధాన మంత్రి రాబర్ట్ ఫికో, బల్గేరియా, హంగేరీ ప్రతినిధులు కూడా హాజరుకున్నారు. 1959 తర్వాత ఉత్తర కొరియా నాయకుడు చైనా సైనిక కవాతుకు హాజరు కావడం ఇదే తొలిసారి. 2015లో చివరిసారిగా విక్టరీ డే పరేడ్ నిర్వహించినప్పుడు ఉన్నతాధికారులలో ఒకరైన చో ర్యాంగ్–హేను పంపింది.
కవాతులో పాల్గొనొద్దు: తైవాన్
చైనా సైనిక కవాతులో పాల్గొనవద్దని ప్రజాస్వామ్య దేశాలకు తైవాన్ విజ్ఞప్తి చేసింది. చైనా ఈ సమయాన్ని ఉపయోగించుకుని సారూప్యత కలిగిన ప్రభుత్వాల మధ్య చీలికను తీసుకురావచ్చని హెచ్చరించింది. స్వేచ్ఛాయుత, ప్రజాస్వామ్య దేశాలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాలని లేదా బహిరంగంగా ఖండించాలని ఆ దేశ విదేశాంగ శాఖ కోరింది. చైనా సైనిక, ఆర్థిక వృద్ధి ఇండో–పసిఫిక్‌లో ఉద్రిక్తతలకు దారి తీస్తుందని, ఒకప్పుడు రక్షణ రంగంలో చైనా కంటే అమెరికా ఎక్కువ ఖర్చు చేసినప్పటికీ, ఇప్పుడు చైనా దాన్ని దాటేసిందని ప్రకటించింది. చైనా రక్షణ వ్యయంలో దాదాపు 90 శాతం ఇండో–పసిఫిక్‌లో, ముఖ్యంగా భారత్–చైనా సరిహద్దులో కేంద్రీకృతమై ఉందని, ఈ సమయంలో అమెరికాతోపాటు మిత్రదేశాలు అప్రమత్తంగా ఉండాలని నొక్కి చెప్పింది.