భారత మామిడి పళ్లపై జపాన్‌ బ్యాన్‌ : ఎందుకో తెలుసా? | Japan bans Indian mangoes again after 20 years check details | Sakshi
Sakshi News home page

భారత మామిడి పళ్లపై జపాన్‌ బ్యాన్‌ : ఎందుకో తెలుసా?

May 28 2026 1:04 PM | Updated on May 28 2026 1:13 PM

Japan bans Indian mangoes again after 20 years check details

భారతీయ మామిడిపళ్ల ఎగుమతులపై జపాన్‌  కీలక నిర్ణయం తీసుకుంది.  ఇక్కడి  మామిడి పండ్ల శుద్ధి కేంద్రాలలో, మగ్గబెట్టడం (Fumigation)  క్రిమిసంహారక (Disinfection) చర్యలలో లోపాలు ఉన్నట్లు గుర్తించిన తరువాత భారత్ నుండి వచ్చే తాజా మామిడి పండ్ల దిగుమతులను జపాన్ నిలిపివేసింది. మామిడి పండ్ల ఎగుమతులకు అత్యంత కీలకమైన ఏప్రిల్-జూన్ సీజన్‌లోఈ నిర్ణయం తీసుకోవడంతో మామిడి ఎగుమతులపై  భారీ ప్రభావం చూపుతోంది.

'ది ఎకనామిక్ టైమ్స్' నివేదిక ప్రకారంజపాన్ క్వారంటైన్ ఇన్‌స్పెక్టర్లు తనఖీల తరువాత ఈ నిర్ణయం తీసుకుంది. ఈ  నిర్ణయంతో అల్ఫోన్సో, కేసర్, లంగ్రా, బంగినపల్లి వంటి ప్రముఖ భారతీయ మామిడి రకాల ఎగుమతులకు తీవ్ర విఘాతం కలిగింది.

ఇదీ చదవండి: ఢిల్లీ వ్యాపారవేత్తకు బెంగళూరులో ఇస్త్రీ ధరల షాక్!

యోకోహామా ప్లాంట్ ప్రొటెక్షన్ అసోసియేషన్ మార్చి 31న ఒక ప్రకటన విడుదల చేస్తూ, మార్చి 25, 2026 లేదా ఆ తర్వాత భారతదేశం జారీ చేసిన తనిఖీ ధృవీకరణ పత్రాలు (Inspection certificates) ఉన్న షిప్‌మెంట్‌లను అనుమతించబోమని స్పష్టం చేసింది. భారతీయ కేంద్రాలలో నిర్వహణ ప్రమాణాలు మెరుగుపడ్డాయని జపాన్ అధికారులు సంతృప్తి చెందే వరకు ఈ నిషేధం కొనసాగుతుందని పేర్కొంది.

ఇదీ చదవండి: అదే జరిగితే : సీనియర్లకు 400శాతం వేతనం పెంపు

జపాన్ అధికారులు ఎలాంటి లోపాలను గుర్తించారు?
మామిడి పండ్ల ఎగుమతి కోసం ఉపయోగించే వేపర్ హీట్ ట్రీట్‌మెంట్ (VHT) కేంద్రాలను పరిశీలించడానికి జపాన్ క్వారంటైన్ అధికారులు ఈ ఏడాది మార్చిలో ఉత్తరప్రదేశ్‌లోని రెహమాన్‌పూర్‌ను సందర్శించారు.

వేపర్ హీట్ ట్రీట్‌మెంట్ (VHT) అంటే ఏమిటి?
ఇది ఎగుమతి చేయడానికి ముందు మామిడి పండ్లలోని పురుగులను, తెగుళ్లను నివారించడానికి ఎటువంటి రసాయనాలు లేకుండా, కేవలం వేడి మరియు తేమతో కూడిన గాలితో శుద్ధి చేసే ప్రక్రియ. ఈ ప్రక్రియను పర్యవేక్షించడానికి జపాన్ ప్రతి సంవత్సరం మామిడి సీజన్‌కు ముందు తన ఇన్‌స్పెక్టర్లను భారతదేశానికి పంపుతుంది.

అయితే, ఈ ఏడాది పరిశీలనలో పొగబెట్టడం (Fumigation) మరియు దానికి సంబంధించిన క్రిమిసంహారక చర్యలలో లోపాలు ఉన్నట్లు అధికారులు కనుగొన్నారు. దీనితో టోక్యో (జపాన్ ప్రభుత్వం) దిగుమతులను నిలిపివేయాలని నిర్ణయించింది. జపాన్ మార్కెట్లో మంచి ఆదరణ ఉన్న పలు రకాల మామిడి పండ్లపై ఈ నిషేధ ప్రభావం పడింది. వాటిలో ముఖ్యమైనవి ఇవి.

  • అల్ఫోన్సో (Alphonso)

  • కేసర్ (Kesar)

  • లంగ్రా (Langra)

  • బంగినపల్లి (Banganapalli)

2025-26 ఆర్థిక సంవత్సరంలో జపాన్‌కు ఎగుమతి అయిన భారతీయ మామిడి పండ్లలో గుజరాత్‌కు చెందిన 'కేసర్' రకానిదే సింహభాగం. జపాన్‌కు జరిగిన మొత్తం తాజా మరియు ప్రాసెస్డ్ మామిడి ఉత్పత్తుల ఎగుమతుల విలువ $1.54 మిలియన్లు కాగా, అందులో కేసర్ రకం వాటానే సుమారు 0.2 మిలియన్ల డాలర్లుగా ఉంది.

ఇది మొదటిసారి కాదు 
జపాన్ భారత్ నుండి మామిడి దిగుమతులను నిలిపివేయడం ఇది రెండోసారి. సరిగ్గా 20 ఏళ్ల క్రితం ఎత్తివేసిన ఆంక్షలను జపాన్ మళ్లీ ఇన్నాళ్లకు విధించింది.

1986లో తొలిసారి  నిషేధం
ఫ్రూట్ ఫ్లైస్ (పండ్ల ఈగలు) వల్ల తెగుళ్లు వ్యాపించే ప్రమాదం ఉందనే ఆందోళనతో జపాన్ 1986లో తొలిసారి భారత మామిడి పండ్లపై ఆంక్షలు విధించింది. శాస్త్రీయ అధ్యయనాలు, చర్చలు జరిగినప్పటికీ ఆ నిషేధం 2006 వరకు (20 ఏళ్లు) కొనసాగింది.

2006లో నిషేధం ఎత్తివేత: అప్పటి వాణిజ్య మంత్రి కమల్ నాథ్ నిరంతర ప్రయత్నాలు, జపాన్ క్వారంటైన్ బృందాల క్షేత్రస్థాయి పరిశీలనల అనంతరం.. భారతీయ మామిడి పండ్ల వల్ల ఎలాంటి తెగుళ్లు వచ్చే ప్రమాదం లేదని నిర్ధారించుకుని జపాన్ జూన్ 2006లో నిషేధాన్ని ఎత్తివేసింది. జపాన్ కోరినట్లుగా భారతదేశం వేపర్ హీట్ ట్రీట్‌మెంట్ (VHT) విధానాన్ని అమలు చేసింది.

2006 తర్వాత ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లోని ఆమోదిత ప్రాంతాలలో పండే అల్ఫోన్సో, బంగినపల్లి, కేసర్, లంగ్రా, చౌసా, మల్లిక రకాల మామిడి పండ్ల దిగుమతికి జపాన్ అనుమతినిచ్చింది. అయితే ఇప్పుడు మళ్లీ లోపాలు బయటపడటంతో దిగుమతులను నిషేధించింది. భారతదేశానికి అత్యధికంగా మామిడి పండ్లను ఎగుమతి చేసే ప్రధాన దేశాలు: అమెరికా, యూఏఈ, యూకే, నెదర్లాండ్స్ మరియు సౌదీ అరేబియా.

Advertisement
 
Advertisement
Advertisement