అదే జరిగితే : సీనియర్లకు 400శాతం వేతనం పెంపు | 8th Pay Commission 400pc Salary Hike 5 Fitment Factor Formula | Sakshi
Sakshi News home page

అదే జరిగితే : సీనియర్లకు 400శాతం వేతనం పెంపు

May 27 2026 5:43 PM | Updated on May 27 2026 5:49 PM

8th Pay Commission 400pc Salary Hike 5 Fitment Factor Formula

సాక్షి, న్యూఢిల్లీ : 8వ వేతన సంఘం (8th Pay Commission) జీతాల పెంపు విషయంలో కీలక ప్రతిపాదనలు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. 8వ వేతన సంఘంతో సంప్రదింపులలో పాల్గొంటున్న ఒక కీలక ఉద్యోగుల సంఘం ఇండియన్ రైల్వే టెక్నికల్ సూపర్‌వైజర్స్ అసోసియేషన్ (IRTSA) ప్రతిపాదించిన కొత్త ఐదు-అంచెల ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఫార్ములా ఈ చర్చకు కేంద్ర బిందువుగా ఉంది.

దేశవ్యాప్తంగా ఉన్న కోటి మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల భవిష్యత్తును నిర్ణయించే 8వ వేతన సంఘంపై చర్చలు మరింత ఆసక్తికరంగా మారాయి.  దీంతోపాటు కొంతమంది సీనియర్ ప్రభుత్వ ఉద్యోగులకు 400 శాతానికి పైగా జీతాల పెంపును ప్రతిపాదించడం మరో విశేషం. కొత్త ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఫార్ములాసాధారణంగా గత పే కమిషన్లలో (ఉదాహరణకు 7వ పే కమిషన్‌లో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57 గా ఉండేది) అందరు ఉద్యోగులకు ఒకే ఒక ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను వర్తింపజేసేవారు. కానీ ఈసారి IRTSA ఒక వినూత్న  ప్రతిపాదన చేసింది. 

దీని ప్రకారం
Levels 1 నుండి 5 వరకు ఉన్నవారికి 2.92 ఫిట్‌మెంట్ కారకం లభిస్తుంది.
 6- 8 వరకు ఉన్నవారికి 3.50 లభిస్తుంది.
 9 నుండి 12 వరకు ఉన్నవారికి 3.80 లభిస్తుంది.
 13 నుండి 16 వరకు ఉన్నవారికి 4.09 లభిస్తుంది.
 17 నుండి 18 వరకు ఉన్నవారికి 4.38 లభిస్తుంది.

ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే, జీతాలపై దాని ప్రభావం భారీగా ఉండవచ్చు. ఉదాహరణకు,  17-18  లెవల్స్‌లో పరిధిలో రూ. 2.5 లక్షల బేసిక్ పే పొందుతున్న ఒక ఉద్యోగికి, ప్రతిపాదిత 4.38 కారకం ప్రకారం సవరించిన మూల వేతనం దాదాపు రూ. 10.95 లక్షలకు పెరిగే అవకాశం ఉంది. అలాగే మధ్యస్థాయి ఉద్యోగులు (లెవెల్ 6-8): ప్రస్తుతం  రూ. 45 వేల బేసిక్ పే ఉన్న ఉద్యోగి జీతం, ప్రతిపాదిత 3.50 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ప్రకారం రూ1.57 లక్షలకు పెరుగుతుంది.8వ వేతన సంఘం సిఫార్సులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబాలతో సహా 1.1 కోట్లకు పైగా లబ్ధిదారులను ప్రభావితం చేస్తాయని అంచనా.

అయితే ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, ద్రవ్యోల్బణంపై ఆందోళనలు మధ్య  ఈ ప్రతిపాదనలు ఒకవైపు ఉద్యోగుల్లో ఆశలు రేకెత్తిస్తుండగా, మరోవైపు ప్రభుత్వ ఖజానాపై పడే భారం వల్ల దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది.

ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్
ఈ చర్చకు కేంద్రబిందువుగా ఉన్నది ఒక సాంకేతిక పదం, అదే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్.  ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అంటే ఒక వేతన సంఘం కింద జీతాలను సవరించడానికి ఉపయోగించే గుణకం. దీని సూత్రం చాలా సులభం (కొత్త మూల వేతనం = ప్రస్తుత మూల వేతనం X ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్).  ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 3.00 ఉంటే,  ఉద్యోగి ప్రస్తుత బేసిక్ జీతం మూడు రెట్లు పెరుగుతుంది.

7వ వేతన సంఘం కింద ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 2.57గా నిర్ణయించారు. ఇప్పుడు, వివిధ రంగాలలోని ఉద్యోగ సంఘాలు అంతకంటే చాలా ఎక్కువ సంఖ్యలను డిమాండ్ చేస్తున్నాయి. కొన్ని సంస్థలు 3.83 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను కోరాయి. మరికొన్ని అంతకు మించి కూడా వెళ్ళాయి. నేషనల్ కౌన్సిల్-జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ కనీస మూల వేతనం రూ. 69,000గా ఉండాలని డిమాండ్ చేయగా, భారతీయ ప్రతిరక్షా మజ్దూర్ సంఘ్ కూడా ఇదే డిమాండ్ చేసినట్లు సమాచారం.

ఇదీ చదవండి: డీకే ప్రమాణ స్వీకారం ఎపుడు? ఉత్కంఠగా బ్రేక్‌ఫాస్ట్ భేటీ

8వ వేతన సంఘం: సంప్రదింపులు
ఇదిలా ఉండగా, 8వ వేతన సంఘం స్వయంగా విస్తృత సంప్రదింపుల దశలోకి  ఎంట్రీ ఇచ్చింది. రిటైర్డ్ జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలోని ఈ కమిటీ ఇప్పటికే ఢిల్లీతో పాటు పలు ఇతర ప్రాంతాలలో సమావేశాలు నిర్వహించింది. ఉద్యోగుల సంఘాలు, పెన్షనర్ల బృందాలు, ప్రభుత్వ సంస్థలతో దేశవ్యాప్తంగా జరిపే సంప్రదింపుల కార్యక్రమంలో భాగంగా, జూలై 6, 7 తేదీలలో భువనేశ్వర్‌లో పర్యటించనున్నట్లు ఇప్పుడు ప్రకటించింది. లక్నో, హైదరాబాద్, శ్రీనగర్, లడఖ్, జమ్మూ & కాశ్మీర్‌లలో కూడా సంప్రదింపులు జరపాలని కమిషన్ నిర్ణయించింది. 1946లో ప్రారంభమైన సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, ప్రభుత్వం 2025 నవంబర్ 3న అధికారికంగా 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేసింది.
ఇదీ చదవండి: ఇద్దర్ని చంపి సంబరాలా? వీడియో వైరల్‌, పెల్లుబుకిన ఆగ్రహం

Advertisement
 
Advertisement
Advertisement