దక్షిణ గాజాను వీడండి.. పాలస్తీనాకు ఇజ్రాయెల్ హెచ్చరికలు

Israel Renews Warning For Gazans To Flee Southern City - Sakshi

ఖాన్ యూనిస్: హమాస్ అంతమే ధ్యేయంగా ఇజ్రాయెల్ సైన్యం పాలస్తీనాపై విరుచుకుపడుతోంది. ఇప్పటికే గాజా ఉత్తర ప్రాంతాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకుంది. తాజాగా దక్షిణ ప్రాంతంపై కూడా గురిపెట్టింది. దక్షిణ గాజాలో పౌరులందరూ పశ్చిమ ప్రాంతానికి వెళ్లాలని ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరికలు చేసింది. 

'దక్షిణ గాజాను ఖాలీ చేయాల్సిందిగా పౌరులకు సూచించాం. వెంటనే సాధ్యం కాదని మాకు తెలుసు. కానీ కాల్పుల్లో పౌరులు మరణించకూడదని కోరుకుంటున్నాం. పశ్చిమ ప్రాంతంలో మానవతా సహాయం అందుతుంది.' అని ప్రధాని నెతన్యాహు సన్నిహితుడు మార్క్ రెగెవ్ తెలిపారు.  

ఇజ్రాయెల్ యుద్ధంతో ఉత్తర గాజా నుంచి ఇప్పటికే లక్షల్లో జనాభా దక్షిణ ప్రాంతానికి వలస వెళ్లింది. ప్రస్తుతం దక్షిణ ప్రాంతంలోని ఖాన్ యూనిస్ నగరంలో దాదాపు 4 లక్షల జనాభా ఉంటుంది. ప్రస్తుతం వీరందర్ని పశ్చిమం వైపు వెళ్లాల్సిందిగా ఇజ్రాయెల్ ఆదేశిస్తోంది. ఇజ్రాయెల్ దూకుడుతో పాలస్తీనీయులకు పశ్చిమానికి వెళ్లడం తప్పేలా కనిపించడం లేదు. 
 
24 మంది మృతి..

అల్‌-షిఫా ఆస్పత్రిని హమాస్ ఉగ్రవాదులు రక్షణ కవచంగా ఉపయోగిస్తున్నారని ఆరోపిస్తున్న ఇజ్రాయెల్ సైన్యం.. ఆస్పత్రి కేంద్రంగా దాడులు చేస్తోంది.  దీంతో ఆస్పత్రికి ఆక్సిజన్, ఇంధనం, కరెంట్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆస్పత్రిలో తాజాగా 24 మంది రోగులు మృతి చెందారని పాలస్తీనా వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.  

ఇజ్రాయెల్‌పై అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు దాడి చేయడంతో యుద్ధం ప్రారంభమైంది. హమాస్ అంతమే లక్ష‍్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. ఈ యుద్ధంలో ఇప్పటివరకు ఇజ్రాయెల్ వైపు 1200 మంది మరణించగా.. పాలస్తీనా మధ్య 12,000పైగా మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చదవండి: Israel-Hamas war: అల్‌–షిఫాలో మృత్యుఘోష
    

 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top