Pegasus Spyware: ఎన్‌ఎస్‌వోకు కోపమొచ్చింది.. ఆ దేశాల్లో ‘పెగసస్‌’ బ్లాక్‌!

Israel NSO blocks some government clients from using its spyware over misuse claims - Sakshi

నిఘా స్పైవేర్‌ను తమ క్లయింట్లు దుర్వినియోగం చేయడంపై ఎన్‌ఎస్‌వో చర్యలు

సాఫ్ట్‌వేర్‌ సేవలను తాత్కాలికంగా నిలిపేసిన ఎన్‌ఎస్‌వో

అమెరికా మీడియాలో కథనాలు  

వాషింగ్టన్‌: ప్రపంచవ్యాప్తంగా తాము తయారుచేసిన ‘పెగసస్‌’స్పైవేర్‌ సాఫ్ట్‌వేర్‌ దుర్వినియోగం అవుతోందని పలు కథనాలు వెలువడి, అనేక దేశాల్లో వివాదమైన నేపథ్యంలో దాని తయారీసంస్థ ఎన్‌ఎస్‌వో గ్రూప్‌ ఆగ్రహంగా ఉంది. అందుకే తమ సొంత క్లయింట్లు ఆ స్పైర్‌వేర్‌ను వినియోగించడానికి వీల్లేకుండా తాత్కాలికంగా బ్లాక్‌చేసిందని అమెరికా మీడియాలో కథనాలొచ్చాయి. ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌వో గ్రూప్‌ తయారుచేసిన పెగసస్‌ స్పైవేర్‌ సాఫ్ట్‌వేర్‌ను పలు దేశాల ప్రభుత్వాలు ఉగ్రవాదం, నేరాలు, తదితరాల కట్టడి కోసం కొనుగోలుచేస్తాయి.

అయితే, ఈ లక్ష్యాలకు బదులుగా పౌరులు, జడ్జీలు, మంత్రులు, పాత్రికేయులు, మానవహక్కుల నేతలు, పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ ఉన్నతాధికారులపై నిఘాకు దుర్వినియోగం చేస్తున్నట్లు వాషింగ్టన్‌ పోస్ట్, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, తదితర అనేక మీడియా సంస్థల నివేదికలు బహిర్గతపరచడం తెల్సిందే. దీంతో ఎన్‌ఎస్‌వో సంస్థ తాత్కాలికంగా తమ క్లయింట్లు ఈ టెక్నాలజీని వాడకుండా బ్లాక్‌చేసింది. పలు మీడియాల సమాఖ్య ‘పెగసస్‌ ప్రాజెక్ట్‌’పేరిట ఈ దుర్వినియోగంపై వివరాలు రాబడుతున్న నేపథ్యంలో తమ సంస్థ ఈ చర్య తీసుకుందని ఎన్‌ఎస్‌వో ఉన్నతాధికారి చెప్పారని ఇజ్రాయెల్‌లోని లాభాపేక్షలేని స్వతంత్ర మీడియా సంస్థ నేషనల్‌ పబ్లిక్‌ రేడియో(ఎన్‌పీఆర్‌) వెల్లడించింది.

ఎన్‌ఎస్‌వో ఇప్పటికే ఐదు ప్రభుత్వాలను బ్లాక్‌చేసిందని వాషింగ్టన్‌ పోస్ట్‌ తన కథనంలో పేర్కొంది. వీటిలో మెక్సికో, సౌదీ అరేబియా, దుబాయ్‌ కూడా ఉన్నాయని తెలుస్తోంది.అయితే, ప్రభుత్వాలు ఫోన్ల హ్యాకింగ్‌కు పాల్పడిన ఘటనకు తమ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని, సంస్థ అంతర్గత దర్యాప్తులోనూ ఇదే తేలిందని ఎన్‌ఎస్‌వో ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఆరోపణలు తీవ్రస్థాయిలో రావడంతో ఇజ్రాయెల్‌ దేశ ప్రభుత్వం సైతం ఎన్‌ఎస్‌వో సంస్థపై దర్యాప్తునకు ఆదేశించడం తెల్సిందే. దర్యాప్తులో భాగంగా టెల్‌అవీవ్‌ సిటీ దగ్గర్లోని ఎన్‌ఎస్‌వో ఆఫీస్‌లో అధికారులు దర్యాప్తు చేపట్టారని ఇజ్రాయెల్‌ రక్షణశాఖ పేర్కొంది.  ఎన్‌ఎస్‌వో సంస్థకు 40 దేశాల్లో 60కిపైగా కస్టమర్లు ఉన్నారని తేలింది. ఈ లిస్ట్‌లో ఉన్నవన్నీ పలు దేశాల నిఘా, దర్యాప్తు సంస్థలు, సైనిక విభాగాలేనని సమాచారం.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top