ప్రపంచాన్ని గందరగోళంలోకి నెడుతూ.. హర్ముజ్‌ హైడ్రామా | Iran US Hormuz Latest High‑Drama | Sakshi
Sakshi News home page

ప్రపంచాన్ని గందరగోళంలోకి నెడుతూ.. హర్ముజ్‌ హైడ్రామా

May 28 2026 6:45 AM | Updated on May 28 2026 12:11 PM

Iran US Hormuz Latest High‑Drama

ఒక రోజు యుద్ధ హెచ్చరికలు.. మరుసటి రోజు శాంతి చర్చలు..! ఉదయం ఒప్పందం కుదిరిందంటూ ప్రకటనలు.. సాయంత్రానికి “అది ఫేక్‌” అంటూ ఖండనలు..! ప్రస్తుతం హర్ముజ్‌ జలసంధి చుట్టూ అమెరికా-ఇరాన్‌ వ్యవహారం అంతర్జాతీయ రాజకీయాల కంటే ఎక్కువగా ఒక హైటెన్షన్‌ డ్రామాను తలపిస్తోంది.

ఒకవైపు ప్రపంచ చమురు మార్కెట్లు వణికిపోతుంటే.. మరోవైపు రెండు దేశాలు మాత్రం మాటల యుద్ధంతో ప్రపంచాన్ని గందరగోళంలోకి నెట్టేస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా ఇరాన్‌ ప్రభుత్వ మీడియా ఒక్కసారిగా “అమెరికాతో ఒప్పందం కుదిరింది.. హర్ముజ్‌ను మళ్లీ తెరుస్తాం” అంటూ ప్రకటించడంతో ప్రపంచ మార్కెట్లు ఊపిరిపీల్చుకున్నాయి. అమెరికా ఆంక్షలు ఎత్తివేస్తుందని, సైన్యాన్ని వెనక్కి తీసుకుంటుందని కూడా ఇరాన్‌ ప్రచారం చేసింది.

అంతేకాదు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ కూడా గత కొన్ని రోజులుగా “ఇరాన్‌ చర్చలకు సిద్ధమైంది.. అణు ఒప్పందం దిశగా పురోగతి ఉంది.. హర్ముజ్‌లో మళ్లీ స్వేచ్ఛా వాణిజ్యం జరుగుతుంది” అంటూ వరుస ప్రకటనలు చేస్తూ వచ్చారు. దీంతో నిజంగానే రెండు దేశాలు రాజీ దిశగా వెళ్తున్నాయనే అభిప్రాయం ప్రపంచవ్యాప్తంగా ఏర్పడింది.

కానీ అప్పుడే కథలో భారీ ట్విస్ట్‌ చోటు చేసుకుంది. రంగంలోకి దిగిన వైట్‌హౌస్‌.. ఇరాన్‌ మీడియా విడుదల చేసిన ఒప్పంద ముసాయిదా “పూర్తిగా కల్పితం” అంటూ తేల్చేసింది. దీంతో అసలు నిజం ఏంటన్నది ప్రపంచ దేశాలకు అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు ట్రంప్‌ శాంతి సంకేతాలు ఇస్తుంటే.. మరోవైపు వైట్‌హౌస్‌ మాత్రం ఒప్పందాన్నే ఖండించడం ఇప్పుడు మరింత గందరగోళానికి దారి తీసింది.

ఇదే సమయంలో అమెరికా మరోవైపు ఇరాన్‌పై వైమానిక దాడులు కొనసాగిస్తుండటం మరింత అనుమానాలకు తావిస్తోంది. ఒకచేత్తో చర్చలు.. మరోచేత్తో దాడులు అనే విధంగా అమెరికా వ్యవహరిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఇరాన్‌ కూడా “యుద్ధం ఉండదు” అంటూనే, హర్ముజ్‌పై నియంత్రణ మాత్రం తమదేనని స్పష్టం చేస్తోంది.

ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హర్ముజ్‌ జలసంధి చుట్టూ ఇలాంటి ప్రకటనలు రావడం వల్ల మార్కెట్లు ఒక్కసారిగా కుదేలవుతున్నాయి. చమురు ధరలు భారీగా మారిపోతుండగా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో అమెరికా-ఇరాన్‌ దేశాలు నిజంగా శాంతి కోరుకుంటున్నాయా..? లేక ప్రపంచంపై ఒత్తిడి పెంచేందుకు రాజకీయ డ్రామాలు ఆడుతున్నాయా..? అనే చర్చ అంతర్జాతీయ వేదికలపై జోరుగా సాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement