Iran: జాతి కోసం రగిలిన జ్వాల.. దేశ రక్షణే పరమావధి | Iran: Ignited for the Motherland And Guarding till the End | Sakshi
Sakshi News home page

Iran: జాతి కోసం రగిలిన జ్వాల.. దేశ రక్షణే పరమావధి

Apr 7 2026 5:58 PM | Updated on Apr 7 2026 6:50 PM

Iran: Ignited for the Motherland And Guarding till the End

జాతి కోసం రగిలిన జ్వాల.. దేశ రక్షణే పరమావధి.. ఇది ఇప్పుడు ఇరాన్‌లో కనిపిస్తున్న పరిస్థితి. ఇరాన్‌లో ఉన్న యువత దగ్గర్నుంచి అద్యక్షుడి స్థాయి వరకూ వినిపిస్తున్న మాట మాత్రం.. దేశాన్ని రక్షించుకోవడమే.  ఇది ఇప్పుడు ఇరాన్‌లో మాట కాదు.. నినాదంగా మారిపోయింది.  దేశం కోసం జ్వాలలై, నడుంబిగిద్దాం రండి అంటూ ఇరాన్‌ నినదిస్తోంది. 

ఇప్పటివరకూ అమెరికా బెదిరింపులకు గానీ, డెడ్‌లైన్లకు గానీ ఏ మాత్రం లొంగని ఇరాన్‌.. ఇక దేశాన్ని తుది వరకూ పోరాడైనా సరే కాపాడుకోవాలనే కృతనిశ్చయంతో ఉంది.  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. మళ్లీ ఇరాన్‌పై యుద్ధానికి కాలు దువ్విన క్రమంలో ఆ దేశం శాయశక్తులా పోరాడాలని, అందుకు తమకు చెందిన ప్రతీ పౌరుడు బాధ్యత తీసుకోవాలని అంటోంది. దీనిలో భాగంగా దేశం కోసం మీ పిల్లల్ని పంపాలని తల్లిదండ్రులకు పిలుపునిచ్చింది. ఇరాన్‌ దేశంలో ఉంటున్న వారు యుద్ధంలో భాగస్వాములు కావాలని పేర్కొంది. ఇందుకు తల్లిదండ్రులు తమ పిల్లలను సరిహద్దులకు పంపాలని విజ్ఞప్తి చేసింది. 

ఇప్పటికే తమ దేశాన్ని కాపాడుకోవడం కోసం యువతే స్వచ్ఛందంగా ముందుకొచ్చి విద్యుత్‌  ప్లాంట్ల చుట్టూ మానవహారాలు చేస్తోంది. అమెరికా-ఇజ్రాయెల్‌ నుంచి భీకర దాడులు తప్పవని తెలిసినా వారు విద్యుత్‌ ప్లాంట్ల చుట్టూ మానవహారంగా ఏర్పడ్డారు. ఇందుకోసం ఇరాన్‌ పిలుపు ఇవ్వకుండానే, యువతే ప్రభుత్వానికి సూచన చేయడం విశేషం. 

ఈ ఆలోచన యువత నుంచే వచ్చిందని యువజన వ్యవహారాల ఉప మంత్రి అలిరెజా రహిమీ తెలిపారు. “యువతే ఈ సూచన చేసింది. కొంతమంది విశ్వవిద్యాలయాల విద్యార్థులు, యువ కళాకారులు, యువజన సంస్థలు దేశంలోని విద్యుత్ కేంద్రాల చుట్టూ మానవ వలయం లేదా మానవ హారంలా ఏర్పాటు చేద్దామని ప్రతిపాదించారు” అని చెప్పారు. దేశ మౌలిక వసతులను రక్షించడంలో యువత నిబద్ధతకు, వారి భవిష్యత్తు నిర్మాణానికి సంకేతంగా ఈ నిర్ణయం నిలుస్తుందన్నారు.

హార్మూజ్‌ జలసంధిని తెరవడానికి ట్రంప్‌ మంగళవారం రాత్రి వరకు గడువు ఇచ్చారు. ఇరాన్‌ ఒప్పందం కుదు​ర్చుకోకపోతే కఠిన సైనిక చర్యలు తీసుకుంటామని, ముఖ్య మౌలిక వసతులపై దాడులు జరగవచ్చని ట్రంప్‌ హెచ్చరించారు. ఆ గడువు దాటాక ఇరాన్‌పై అమెరికా- ఇజ్రాయెల్‌ మరింత తీవ్రంగా విరుచుకుపడతాయని తెలుస్తోంది. 

మరొకవైపు తనతో సహా ఇరాన్‌ ప్రజలంతా ప్రాణ త్యాగం చేస్తామన్నారు ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్ పెజేష్కియాన్. 14 మిలియన్లకు పైగా ఇరానీయులు తమ ప్రాణాలను దేశం కోసం అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. నా దేశం కోసం నేనూ ఎప్పుడూ, ఎప్పటికీ ప్రాణ త్యాగం చేస్తా’నని పునరుద్ఘాటించారు. దీనిపై కాస్త భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నా.. దేశాన్ని కాపాడుకోవాలనే తపన మాత్రం అక్కడున్న పౌరుల్లో రగులుకుంది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement