టెహ్రాన్: పశ్చిమాసియాలో క్షిపణుల వర్షం కురుస్తోంది. హర్మూజ్ జలసంధి తెరిచే అంశంలో ట్రంప్ డెడ్‌లైన్ విధించడంతో అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. అయితే ఆ గడువుకు ముందే ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్ తన ఆదేశాల్ని బేకాతరు చేయడంతో ట్రంప్ ఆగ్రహానికి గురయ్యాడు. ఈ క్రమంలో ఖర్గ్ ద్వీపంపై అమెరికా సైన్యం దాడులు జరిపినట్లు పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
ఇరాన్ మీడియా కథనాల ప్రకారం, అమెరికా సైన్యం ఖర్గ్ ఐల్యాండ్‌తో పాటు కీలక రైల్వే బ్రిడ్జీని ధ్వంసం చేసింది. విద్యుత్ ప్లాంట్లు, బ్రిడ్జిలపై దాడులు చేస్తామని ట్రంప్ ముందే హెచ్చరించిన నేపథ్యంలో ఇరాన్‌లో భారీ ఎత్తున ప్రాణాపాయం తప్పినట్లు సమాచారం.
ట్రంప్ హెచ్చరికలతో ఇరాన్ వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది. దేశ యువతను విద్యుత్ కేంద్రాల చుట్టూ మానవహారాలుగా ఏర్పాటు చేయాలని ఇరాన్ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఈ మేరకు యువతను విద్యుత్ కేంద్రాల వద్దకు చేరుకోవాలని పిలుపునిచ్చింది. క్రీడాశాఖ కూడా క్రీడాకారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. ప్రజలంతా ఐక్యంగా ఉండి దేశాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చింది. అమెరికా దాడులు ప్రారంభించడంతో ఇరాన్‌లో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఇకపై ఏమి జరగనుందో అన్న ఆందోళన, టెన్షన్ దేశవ్యాప్తంగా నెలకొంది.


