ఇస్లామాబాద్: ఇంధన సంక్షోభం తీవ్రతరమవుతున్న నేపథ్యంలో పాకిస్థాన్ కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి రాత్రి 8గంటలకే మార్కెట్లు మూసివేయాలని ప్రధాని షహ్‌బాజ్ షరీఫ్ ఆదేశాలు జారీ చేశారు. ఇంధన వినియోగాన్ని తగ్గించి, ఆర్థిక భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాక్ ప్రధాని కార్యాలయం విడుదల చేసిన అధికార ప్రకటనలో పేర్కొంది.
పాకిస్థాన్ ప్రభుత్వం తాజా నిర్ణయం ప్రకారం.. పంజాబ్, ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా, బలూచిస్తాన్, ఇస్లామాబాద్, గిల్గిట్-బాల్టిస్థాన్ ప్రాంతాల్లోని షాపింగ్ మాల్స్, బజార్లు రాత్రి 8 గంటలకే మూసివేయాలి. ఈ ఆదేశాలు ఇంధన వినియోగాన్ని తగ్గించి, ఆర్థిక భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా తీసుకున్నట్లు ప్రధాని కార్యాలయం ప్రకటించింది.
ప్రత్యేక మినహాయింపులు కూడా ఉన్నాయి. బేకరీలు, రెస్టారెంట్లు, హోటల్స్‌తో పాటు కళ్యాణ మండపాలు రాత్రి 10 గంటల వరకు కొనసాగవచ్చు. ఇళ్లలో జరిగే వ్యక్తిగత వేడుకలు కూడా రాత్రి 10 గంటల వరకు మాత్రమే అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయం పాకిస్థాన్‌లో పెరుగుతున్న ఇంధన ధరలు, అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ఒత్తిడి, ఆర్థిక సంక్షోభం కారణంగా తీసుకున్నదని అధికారులు తెలిపారు. ఇప్పటికే ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రాంతంలో బజార్లు రాత్రి 9 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచే ఆదేశాలు అమల్లో ఉన్నాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ ఆదేశాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రభుత్వం ఈ చర్యను జాతీయ అవసరంగా పేర్కొంది. “దేశ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి” అని షహ్‌బాజ్ షరీఫ్ అన్నారు. అయితే వ్యాపార సంఘాలు ఈ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, తమ వ్యాపారాలు దెబ్బతింటాయని హెచ్చరిస్తున్నాయి. మొత్తం మీద పాక్ ప్రభుత్వ నిర్ణయం ఆర్థిక భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఉన్నప్పటికీ, వ్యాపారులు ప్రజలపై దీని ప్రభావం గణనీయంగా ఉండనుంది.



