టెహ్రాన్: హార్మూజ్ జలసంధిని 48 గంటల్లో తెరవకపోతే ఇరాన్ విద్యుత్ కేంద్రాలను పూర్తిగా నాశనం చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికపై ఇరాన్ స్పందించింది. ట్రంప్‌కే తిరిగి వార్నింగ్ ఇచ్చింది. పశ్చిమాసియా అంతటా కీలక మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తామని చెప్పింది.
“మా ఇంధన, ఎనర్జీ మౌలిక సదుపాయాలపై శత్రువులు దాడి చేస్తే.. పశ్చిమాసియాలో అమెరికాకు చెందిన ఆస్తులతో పాటు ఆయా దేశాల్లోని ఎనర్జీ, సమాచార సాంకేతిక, సముద్ర జల ఉప్పుతీత మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటాం” అని ఇరాన్ మిలిటరీ ఆపరేషనల్ కమాండ్ ఓ ప్రకటనలో తెలిపింది.
కాగా, హార్మూజ్ భద్రతకు యూరోపియన్ దేశాలు, నాటో మిత్రదేశాలు, ఇతర దేశాలు సహకరించాలని ట్రంప్ కోరుతున్న విషయం తెలిసిందే. తాజాగా ట్రంప్ మాట్లాడుతూ.. “48 గంటల్లో ఇరాన్ ఎలాంటి బెదిరింపులు లేకుండా పూర్తిగా హార్మూజ్ జలసంధిని తెరవకపోతే ఆ దేశ విద్యుత్ కేంద్రాలపై దాడి చేసి పూర్తిగా నాశనం చేస్తాం’’ అని అన్నారు.
బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జోర్డాన్, ఇరాక్ దేశాల్లో పౌరులు, పౌర మౌలిక సదుపాయాలపై ఇరాన్ చేసిన దాడులను జీ7 విదేశాంగ మంత్రులు తీవ్రంగా ఖండించారు.
“ఈ దేశాలపై ఇరాన్ చేసిన దాడులు ప్రాంతీయ, ప్రపంచ భద్రతకు ముప్పుగా నిలుస్తున్నాయి. ఇరాన్ తక్షణం, ఎలాంటి షరతులు లేకుండా అన్ని దాడులను నిలిపివేయాలని మేము పిలుపునిస్తున్నాం. సముద్ర మార్గాల రక్షణ, నౌకాయాన భద్రతకు సహకరించాల్సిందే. హార్మూజ్ జలసంధి సహా కీలక జలమార్గాలు, సరఫరా చైన్ భద్రత, ఎనర్జీ మార్కెట్ల స్థిరత్వం అవసరం” అని జీ7 విదేశాంగ మంత్రులు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో తెలిపారు.
కాగా, ఇరాన్ ఇప్పటికే పలు దేశాలకు హార్మూజ్ జలసంధిని వినియోగించుకోవచ్చని అనుమతి ఇచ్చింది. పశ్చిమాసియా యుద్ధంలో పాల్గొనని దేశాలు హార్మూజ్ జలసంధిని వాడుకోవచ్చని, నౌకల ప్రయాణానికి ఇరాన్ సైన్యం అనుమతి తీసుకోవాలని, సమన‍్వయం చేసుకోవాలని పేర్కొంది.


