‘మన గ్యాస్‌ని ఎవర్రా ఆపేది?’.. భారత్‌కు అమెరికా గ్యాస్‌! | Pyxis Pioneer cargo ship carrying LPG from US | Sakshi
Sakshi News home page

‘మన గ్యాస్‌ని ఎవర్రా ఆపేది?’.. భారత్‌కు అమెరికా గ్యాస్‌!

Mar 22 2026 9:11 AM | Updated on Mar 22 2026 9:11 AM

Pyxis Pioneer cargo ship carrying LPG from US

మంగళూరు: పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాల కారణంగా మన దేశంలో ఏర్పడుతున్న ఎల్పీజీ (ఎల్‌పీజీ) కొరతకు పరష్కారం దొరికింది. అమెరికాలోని టెక్సాస్ నుంచి భారీ గ్యాస్ నిల్వలతో కూడిన ‘పిక్సిస్ పయనీర్’ (Pyxis Pioneer) నౌక ఎట్టకేలకు భారత్ చేరుకుంది. ఆదివారం ఉదయం కర్ణాటకలోని న్యూ మంగళూరు పోర్టుకు ఈ నౌక సురక్షితంగా వచ్చి చేరింది.

టెక్సాస్ టు మంగళూరు ..
సింగపూర్ ఫ్లాగ్‌తో ప్రయాణించిన ఈ భారీ ట్యాంకర్ ఫిబ్రవరి 14న టెక్సాస్‌లోని నెదర్లాండ్ పోర్టు నుంచి బయల్దేరింది. న్యూ మంగళూరు పోర్ట్ అథారిటీ వివరాల ప్రకారం.. 47,236 టన్నుల గ్రాస్ టన్ను సామర్థ్యం ఉన్న ఈ నౌక, ఆదివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో 13వ నంబర్ బెర్త్‌కు చేరుకుంది. ఇది ఏజిస్ లాజిస్టిక్స్ లిమిటెడ్ కోసం సుమారు 16,714 టన్నుల ఎల్పీజీని ఇక్కడ అన్లోడ్ చేయనుంది. సోమవారం ఉదయం ఈ నౌక తిరిగి ప్రయాణం కానుంది.

భారత్‌కు ఊరట
గత మూడు వారాలుగా పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల వల్ల భారత్‌కు ఇంధన సరఫరాలో తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయి. సరఫరా తగ్గడంతో గృహ అవసరాలకు ఇబ్బంది కలగకుండా చూసేందుకు, హోటళ్లు వంటి వాణిజ్య సంస్థలకు గ్యాస్ కోత విధించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ క్లిష్ట సమయంలో అమెరికా నుంచి గ్యాస్ నిల్వలు రావడం దేశానికి పెద్ద ఊరట లభించింది.

ఇరాన్ హామీతో..
ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ భారతీయ నౌకలకు హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) ద్వారా సురక్షిత మార్గాన్ని కల్పిస్తామని ఇరాన్ హామీ ఇచ్చింది. దీంతో పాటు ఇటీవల ‘జగ్ లాడ్కీ’ ముడి చమురును, ‘నందాదేవి’, ‘శివాలిక్’ నౌకలు గ్యాస్ నిల్వలను విజయవంతంగా భారత తీరానికి చేరవేసాయి. కాగా భారత్ తన ఇంధన అవసరాల కోసం విదేశాలపైనే ఎక్కువగా ఆధారపడుతోంది. దేశానికి కావాల్సిన ముడి చమురులో 88 శాతం, సహజ వాయువులో 50 శాతం, ఎల్పీజీలో దాదాపు 60 శాతం దిగుమతుల ద్వారానే అందుతోంది. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా,ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఇంధన సరఫరా వ్యవస్థ కొంత అస్తవ్యస్తమయ్యింది. అయితే తాజా షిప్‌మెంట్‌లతో పరిస్థితులు దారికి వస్తున్నాయి.

ఇది కూడా చదవండి: ట్రంప్‌ షాకింగ్‌ పోస్ట్‌.. ‘అతని చావుతో సంతోషం’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement