వాషింగ్గన్: ఎప్పుడూ సంచలనాలకు అడ్డాగా నిలిచిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోమారు తీవ్ర స్థాయిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడవి ప్రపంచవ్యాపంగా పెనుదుమారాన్ని రేపుతున్నాయి. అమెరికా గూఢచారి సంస్థ ఎఫ్‌బీఐ (ఎఫ్‌బీఐ) మాజీ డైరెక్టర్ రాబర్ట్ ముల్లర్ (81) కన్నుమూశారు. అతని మరణంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించిన తీరు అందరినీ ఆశ్యర్యపరుస్తోంది. ఒకప్పుడు తనపై వచ్చిన రష్యా సంబంధాల ఆరోపణలను విచారించిన ముల్లర్ మరణంపై ట్రంప్ అత్యంత కఠినమైన పదజాలంతో వ్యాఖ్యలు చేశారు.
విద్వేషానికి పరాకాష్ట
ముల్లర్ మరణవార్త తెలిసిన వెంటనే ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ వేదికగా.. ‘రాబర్ట్ ముల్లర్ చనిపోయారు. మంచిదైంది.. ఆయన చనిపోయినందుకు నేను సంతోషిస్తున్నాను. ఇకపై ఆయన అమాయకులను బాధించలేరు’ అంటూ పోస్ట్ చేశారు. గతంలో ముల్లర్ చేపట్టిన దర్యాప్తును ట్రంప్ పదేపదే ‘విచ్ హంట్’ (రాజకీయ కుట్ర)గా అభివర్ణించేవారు. తాజాగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ముల్లర్‌పై ఆయనకున్న తీవ్ర విద్వేషాన్ని బయటపెట్టాయి.
ఎఫ్‌బీఐలో కొత్త ఉత్సాహం
ముల్లర్ తన 12 ఏళ్ల పదవీ కాలంలో ఎఫ్‌బీఐ రూపురేఖలను మార్చివేశారు. 2001లో అమెరికాపై జరిగిన సెప్టెంబర్ 11 దాడులకు వారం రోజుల ముందే ఆయన బాధ్యతలు చేపట్టారు. అప్పటి వరకు కేవలం నేర పరిశోధన సంస్థగా ఉన్న ఎఫ్‌బీఐని, ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో అగ్రగామిగా తీర్చిదిద్దిన ఘనత ముల్లర్‌కే దక్కుతుంది. రిపబ్లికన్ ప్రెసిడెంట్ జార్జ్ డబ్ల్యూ బుష్ హయాంలో నియమితులైన ఆయన, రెండు ప్రధాన రాజకీయ పార్టీల అధ్యక్షుల కింద పనిచేశారు.
ట్రంప్.. ఆయన 34 మంది స్నేహితులు..
2013లో పదవీ విరమణ చేసిన ముల్లర్, 2017లో మరోమారు వార్తల్లోకి నిలిచారు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ప్రచార బృందానికి, రష్యాకు మధ్య ఏవైనా అక్రమ సంబంధాలు ఉన్నాయా అనే అంశంపై దర్యాప్తు చేయడానికి ఆయన ‘స్పెషల్ కౌన్సిల్’గా నియమితులయ్యారు. దాదాపు 22 నెలల పాటు సాగిన ఈ విచారణలో ట్రంప్ సన్నిహితులతో సహా 34 మందిపై అభియోగాలు నమోదయ్యాయి. 2019లో ఆయన సమర్పించిన 448 పేజీల నివేదికలో.. ట్రంప్ బృందానికి రష్యాతో సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నప్పటికీ, అది నేరపూరిత కుట్ర అని చెప్పడానికి తగిన ఆధారాలు లేవని ముల్లర్ తేల్చారు. అప్పటి నిబంధనల ప్రకారం సిట్టింగ్ ప్రెసిడెంట్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోలేకపోయినప్పటికీ, ట్రంప్ దర్యాప్తును అడ్డుకోవడానికి చేసిన ప్రయత్నాలను ఆయన తన నివేదికలో వెల్లడించారు. ముల్లర్ కుటుంబ సభ్యులు ఆయన ధృవీకరిస్తూ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఇది కూడా చదవండి: ప్రపంచం షాక్..‘అరిరంగ్’తో బీటీఎస్ విశ్వరూపం


