టెహ్రాన్: రోమ్ తగలబడుతుంటే నీరో ఫిడేలు వాయించినట్టే… ఇరాన్ యుద్ధంలో మోజ్తాబా మౌనం. దేశం రగులుతున్నా కొత్త సుప్రీం లీడర్ ఒక్క బహిరంగ ప్రకటన చేయలేకపోవడం ఇప్పుడు ట్రంప్ ఇంటెలిజెన్స్ బ్రీఫింగ్‌లలో హాట్‌టాపిక్‌గా మారింది
అమెరికా-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్‌లో పరిస్థితులు తీవ్రంగా మారాయి. ఫిబ్రవరి 28న జరిగిన క్షిపణి దాడుల్లో సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించడంతో ఆయన కుమారుడు మోజ్తాబా ఖమేనీ కొత్త సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టాడు. అయితే ఆయన ఆరోగ్యం, నాయకత్వ సామర్థ్యంపై అంతర్జాతీయ స్థాయిలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
జెరూసలెం పోస్ట్ నివేదిక ప్రకారం, మోజ్తాబా తీవ్ర గాయాలతో బాధపడుతున్నారని, వాస్తవానికి ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ (IRGC) యుద్ధ వ్యూహాలను నడిపిస్తున్నాయని పేర్కొంది. అమెరికా నిఘా వర్గాల సమాచారం ప్రకారం, దాడుల్లో ఆయన ఒక కాలు కోల్పోయి, కాలేయం దెబ్బతిని ఆయన ఆరోగ్య పరిస్థి అంతంత మాత్రంగా ఉన్నట్లు తెలుస్తోంది.
మోజ్తాబా మౌనం
మరో అమెరికా మీడియా సంస్థ యాక్సియోస్ ..ఇరాన్‌పై ముప్పేటా దాడి,ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ అలీ లారిజానీని ముట్టుబెట్టడం,ఇరాన్‌పై పైచేయి సాధించేలా యుద్ధ వ్యూహాల్ని రచిస్తున్నా మోజ్తాబా మౌనం.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంటెలిజెన్స్ బ్రీఫింగ్‌ల సమయంలో చర్చనీయాంశంగా ఉంది. ఇరాన్ బాధ్యతలు ఎవరు నిర్వహిస్తున్నారో అమెరికా జాతీయ భద్రతా బృందం ఆరా తీస్తుందని ట్రంప్ వర్గంలోని ఓ కీలక వ్యక్తి చెప్పారని నివేదించింది
మోజ్తాబా ఖమేనీ ఆరోగ్యం అంతంత మాత్రమే?
అదే సమయంలో ఇజ్రాయెల్ ఇనిస్టిట్యూట్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ నిపుణుడు రజ్ జిమ్మ్ట్ మోజ్తాబా ఆచూకీపై మీడియా యాక్సియోస్‌తో మాట్లాడారు. కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా ప్రస్తుత భద్రతా పరిస్థితుల కారణంగా ప్రజల ముందుకు రావడం అసాధ్యం.క్షిపణి దాడుల్లో ఆయన గాయపడిన తీరు అలాంటిది. ఓ వీడియో రికార్డు చేసి ప్రజలకు సైతం సందేశం పంపించ లేకపోతున్నారని చెప్పారు.
వరుస ప్రాణాలు కోల్పోతున్న ఇరాన్ అగ్రనాయకులు
ఇదే సమయంలో ఇజ్రాయెల్–అమెరికా దాడుల్లో ఇరాన్ అగ్రనాయకులు వరుసగా ప్రాణాలు కోల్పోతున్నారు. మార్చి 16న కమాండర్ ఘోలాంరెజా సోలేమానీ, మార్చి 17న భద్రతా వ్యూహకర్త అలీ లారిజానీ మరణించారు. ఈ పరిణామాలపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి స్పందిస్తూ.. ఓ వ్యక్తి ఉండటం,లేకపోవడం ఇరాన్ రాజకీయ, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపదు. మేము పోరాటాన్ని కొనసాగిస్తాం.సుప్రీం లీడర్ కూడా వీరమరణం పొందినా, వ్యవస్థ తన పనిని కొనసాగించింది’ అని పేర్కొన్నారు.
ఇరాన్ ప్రభుత్వ మీడియా ప్రకారం, యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి 1270 మంది మరణించారు. అమెరికా స్థావరాలపై ప్రతిదాడులు జరిపిన ఇరాన్, హర్మూజ్ జలసంధిపై ఆంక్షలు విధించింది. ప్రపంచ చమురు, సహజ వాయువు సరఫరాలో ఐదవ వంతు ఈ మార్గం ద్వారా జరుగుతుంది. నౌకలు ప్రయాణించలేకపోవడంతో ఇంధన సరఫరా తీవ్రంగా దెబ్బతింది. ఈ పరిణామాలు ఇరాన్ అంతర్గత రాజకీయాలపై మాత్రమే కాకుండా, ప్రపంచ ఇంధన మార్కెట్లపై కూడా తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయి.


