ఇరాన్‌ బి..గ్‌ ప్లాన్‌, ప్రపంచానికి కొత్త టెన్షన్‌! | Is Iran Gearing Up Again? Satellite Images Trigger Fresh Global Anxiety | Sakshi
Sakshi News home page

ఇరాన్‌ బి..గ్‌ ప్లాన్‌, ప్రపంచానికి కొత్త టెన్షన్‌!

Jun 1 2026 7:59 AM | Updated on Jun 1 2026 7:26 PM

Is Iran Gearing Up Again? Satellite Images Trigger Fresh Global Anxiety

శాంతి చర్చలు, కాల్పుల విరమణ ఒప్పందాలు, దౌత్యపరమైన కసరత్తులతో పశ్చిమాసియా యుద్ధం అనే అధ్యాయం ముగింపునకు చేరిందని ప్రపంచం భావించింది. కానీ తాజా శాటిలైట్‌ చిత్రాలు మరో కథను బయటపెడుతున్నాయి. కొన్ని వారాల క్రితం ధ్వంసమైపోయినట్లు కనిపించిన ఇరాన్‌ స్థావరాల్లో వద్ద మళ్లీ కదలికలు మొదలయ్యాయి. పర్వతాల కింద దాగిన ఆ రహస్య టన్నెల్‌ నెట్‌వర్క్‌లో అసలేం జరుగుతోంది?.. ఇరాన్‌ కేవలం పునరుద్ధరణ పనులే చేస్తోందా.. లేదంటే పశ్చిమాసియా యుద్ధంలో సీక్వెల్‌కు సిద్ధపడుతోందా?.. ఇప్పుడు ప్రపంచ భద్రతా వర్గాలను ఈ ప్రశ్న కలవరపెడుతోంది.

అమెరికా, ఇజ్రాయెల్‌ సంయుక్త దాడుల్లో తీవ్రంగా దెబ్బతిన్నట్లు భావించిన ఇరాన్‌ భూగర్భ క్షిపణి టన్నెల్లను మళ్లీ తెరిచే పనులు జోరుగా సాగుతున్నట్లు తాజా శాటిలైట్‌ చిత్రాలు సూచిస్తున్నాయి. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. దాడులకు గురైన 18 ప్రధాన భూగర్భ క్షిపణి కేంద్రాలకు చెందిన 69 టన్నెల్‌ ప్రవేశ మార్గాల్లో ఇప్పటికే 50 మార్గాలను ఇరాన్‌ తిరిగి వినియోగించగల స్థితికి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఇరాన్‌ క్షిపణి సామర్థ్యం నిజంగా ఎంత మేర దెబ్బతిందనే ప్రశ్న మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది.

గత కొంతకాలంగా ఇరాన్‌ క్షిపణి మౌలిక వసతులపై అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులు నిర్వహిస్తున్నాయి. ముఖ్యంగా భూగర్భంలో నిర్మించిన క్షిపణి నిల్వ కేంద్రాలు, ప్రయోగ స్థావరాలు, టన్నెల్‌ నెట్‌వర్క్‌లను లక్ష్యంగా చేసుకున్నాయని చెప్పుకున్నాయి. ఈ దాడుల ప్రధాన ఉద్దేశం ఇరాన్‌ దీర్ఘశ్రేణి క్షిపణులను ఉపయోగించకుండా అడ్డుకోవడమే. టన్నెల్‌ ప్రవేశ మార్గాలను ధ్వంసం చేసి, లోపల నిల్వ ఉంచిన ఆయుధాలను బయటకు తీసుకురాలేని పరిస్థితి సృష్టించాలని ప్రయత్నించారు. యుద్ధ సమయంలో ఇరాన్‌కు చెందిన 450కు పైగా క్షిపణి సంబంధిత లక్ష్యాలు, నిల్వ కేంద్రాలు, ప్రయోగ సదుపాయాలు దాడులకు గురైనట్లు పాశ్చాత్య అంచనాలు చెబుతున్నాయి.

అయితే తాజా శాటిలైట్‌ చిత్రాలు పూర్తిగా భిన్నమైన దృశ్యాన్ని చూపిస్తున్నాయి. సీఎన్‌ఎన్‌ విశ్లేషించిన ఎయిర్‌బస్‌ డిఫెన్స్‌ అండ్‌ స్పేస్‌ చిత్రాల ప్రకారం.. కాల్పుల విరమణ తర్వాత ఇరాన్‌ భారీ స్థాయిలో పునరుద్ధరణ చర్యలు ప్రారంభించింది. బుల్డోజర్లు, డంప్‌ ట్రక్కులు, భారీ యంత్రాలతో ధ్వంసమైన ప్రవేశ మార్గాల వద్ద మట్టిని తొలగిస్తూ మళ్లీ టన్నెల్లను తెరుస్తోంది. కొన్ని స్థావరాల వద్ద భారీ బాంబుల కారణంగా ఏర్పడిన గుంతలను పూడ్చివేస్తూ, లోపలికి వెళ్లే రహదారులను తిరిగి అందుబాటులోకి తెస్తున్నట్లు చిత్రాలు సూచిస్తున్నాయి.

ఈ పరిణామం అమెరికా, ఇజ్రాయెల్‌ వ్యూహాత్మక అంచనాలపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఎందుకంటే దాడుల అనంతరం ఇరాన్‌ క్షిపణి ప్రయోగ సామర్థ్యం దాదాపు 90 శాతం వరకు దెబ్బతిందని పాశ్చాత్య విశ్లేషకులు పేర్కొన్నారు. కనీసం 29 క్షిపణి ప్రయోగ కేంద్రాలు, నాలుగు ప్రధాన క్షిపణి తయారీ సముదాయాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు అప్పట్లో నివేదికలు వచ్చాయి. కానీ ఇప్పుడు బయటకు వస్తున్న ఆధారాలు చూస్తే.. క్షిపణి నిల్వలు పూర్తిగా నాశనం కాలేదని, కేవలం భూగర్భంలో చిక్కుకుపోయాయని కొందరు నిపుణులు భావిస్తున్నారు. టన్నెల్లను మళ్లీ తెరవగలిగితే ఆ క్షిపణులను తిరిగి వినియోగించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

ఇరాన్‌కు భూగర్భ క్షిపణి కేంద్రాలు అత్యంత కీలకమైన వ్యూహాత్మక ఆస్తులు. పర్వతాల లోపల, వందల మీటర్ల లోతులో నిర్మించిన ఈ కేంద్రాలు వైమానిక దాడులను తట్టుకునేలా రూపొందించబడ్డాయి. అందుకే అమెరికా, ఇజ్రాయెల్‌ దాడుల ప్రధాన లక్ష్యంగా ఇవే మారాయి. అయినప్పటికీ, ఇరాన్‌ గతంలో కూడా దెబ్బతిన్న సైనిక మౌలిక వసతులను వేగంగా పునర్నిర్మించిన చరిత్ర కలిగి ఉంది. తాజా పరిణామాలు అదే సామర్థ్యాన్ని మరోసారి సూచిస్తున్నాయని భద్రతా నిపుణులు పేర్కొంటున్నారు.

ఇక హర్ముజ్‌ జలసంధి పరిసరాల్లో ఉన్న కొన్ని క్షిపణి స్థావరాల్లో కూడా కార్యకలాపాలు పునరుద్ధరించబడుతున్నట్లు పాశ్చాత్య గూఢచార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రపంచ చమురు రవాణాలో కీలక పాత్ర పోషించే హర్ముజ్‌ ప్రాంతంలో ఇరాన్‌ మళ్లీ క్షిపణి సామర్థ్యాన్ని పెంచుకుంటే మధ్యప్రాచ్య భద్రతా సమీకరణాలపై దాని ప్రభావం గణనీయంగా ఉండొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ధ్వంసమైన టన్నెల్లను తిరిగి తెరవడం, భూగర్భ స్థావరాల్లో కార్యకలాపాలను పునరుద్ధరించడం ద్వారా ఇరాన్‌ తన వ్యూహాత్మక సామర్థ్యాన్ని మళ్లీ నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తోందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని టెన్నెల్స్‌ తిరిగి అందుబాటులోకి రావడం, భూగర్భ నిల్వల్లో ఇంకా గణనీయమైన క్షిపణి సామర్థ్యం మిగిలి ఉండొచ్చన్న అంచనాలు పశ్చిమాసియా భద్రతా సమీకరణాలను మరోసారి సంక్లిష్టంగా మారుస్తున్నాయి. పశ్చిమాసియా సంక్షోభం ముగిసిపోయిందని భావించడానికి ప్రపంచం ఇంకా సిద్ధంగా ఉండలేకపోతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement