ఇరాన్‌లో అడుగుపెట్టిన పాక్‌ సైన్యాధిపతి మునీర్‌ | Iran’s Araghchi receives Pakistani army chief in Tehran | Sakshi
Sakshi News home page

ఇరాన్‌లో అడుగుపెట్టిన పాక్‌ సైన్యాధిపతి మునీర్‌

Apr 15 2026 9:16 PM | Updated on Apr 15 2026 9:44 PM

 Iran’s Araghchi receives Pakistani army chief in Tehran

టెహ్రాన్‌: పాకిస్థాన్ సైన్యాధిపతి ఆసిమ్‌ మునీర్‌ ఇరాన్ చేరుకున్నారు. ఉన్నత స్థాయి చర్చల్లో ఆయన పాల్గొంటారు. ఇరాన్-అమెరికా మధ్య చర్చల పునఃప్రారంభంపై ఈ ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. అందుకు సంబంధించిన పాక్‌ ప్రతినిధి బృందంతో మునీర్‌ ఇరాన్‌ వెళ్లినట్లు పాకిస్థాన్ సైన్యం బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది.

యుద్ధం వేళ అమెరికాకు పాక్‌ టీమ్‌ పలు ప్రతిపాదనలు చేయనుంది. టీమ్‌లో ఆసిమ్‌ మునీర్‌తో పాటు అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్ నక్వీ తెహ్రాన్ కూడా ఉన్నారు. అమెరికా ఇచ్చిన ఆఫర్‌ను ఇరాన్‌కు ఆసిమ్‌ మునీర్‌ వివరిస్తారు. అమెరికా పంపిన సందేశాన్ని ఇరాన్‌కు ఇచ్చాక రెండో దశ చర్చల అంశాన్ని ప్రస్తావించే అవకాశం ఉంది. అంతకుముందు టెహ్రాన్‌లోని విమానాశ్రయంలో ఆసిమ్‌ మునీర్‌ నేతృత్వంలోని పాకిస్థాన్ ప్రతినిధి బృందానికి ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ స్వాగతం పలికారు. 

కాగా, యూఎస్‌-ఇరాన్‌ మధ్య రెండు రోజు‍ల్లో చర్చలు జరగనున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇప్పటికే ప్రకటించారు. ఈ చర్చలు కూడా పాకిస్థాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌ వేదికగానే ప్రారంభమయ్యే అవకాశం ఉందన‍్నారు. పాకిస్థాన్ సైన్యాధ్యక్షుడు, ఫీల్డ్ మార్షల్ అసీమ్ మునీర్ ఈ చర్చల విషయంలో అద్భుతంగా పని చేస్తున్నారని ప్రశంసించారు. ఆయనో అద్భుతమైన వ్యక్తి అని, అందుకే తాము మళ్లీ అక్కడికి వెళ్లే అవకాశం ఎక్కువగా ఉందని ట్రంప్ చెప్పుకొచ్చారు. 

మరోవైపు, కాల్పుల విరమణ విషయంలో లెబనాన్‌ను చేర్చాలని అమెరికాపై ఇరాన్ ఒత్తిడి పెడుతోందని హెజ్‌బొల్లా ప్రతినిధి తెలిపారు. హార్మూజ్ జలసంధిపై ఆంక్షలను ఒత్తిడి సాధనంగా ఉపయోగించి, కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్‌ను చేర్చాలని ఇరాన్ ప్రయత్నించిందని తెలిపారు. “ఇరానీయులు అమెరికాపై అధిక ఒత్తిడి పెడుతున్నారు, అమెరికా కాల్పుల విరమణలో లెబనాన్‌ను చేర్చాలి అనే షరతులు పెట్టారు. అది చేయకపోతే, హార్మూజ్ ఆంక్షలను కొనసాగిస్తారు” అని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement